
– గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబాటు
– ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరిన ఆది.గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైంది అని శాసన సభాపతికి , మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం తీసుకువెళ్లారు.అసెంబ్లీ సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సాగునీటి రంగంలో ఆనాటి స్పీకర్ శ్రీపాద రావు పేరు మీద శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజి 2 ,ఫేజ్ 1 పనులకు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 1737 కోట్లు మంజూరు చేయగా వాటిలో 10% పనులు పూర్తి చేశారని శాసన సభాపతికి తెలిపారు. వేములవాడ నియోజకవర్గం సుమారు 43 వేల ఎకరాల పైచిలుకు సాగునీరు పంట పొలాలకు అందుతుందని తెలిపారు. కథలాపూర్,భీమారం,మేడిపల్లి మండలాల ప్రజలకు సాగు, త్రాగునీరుకు ఎంతో ఉపయోగపడే కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ కుడి,ఎడమ కాలువలకు 2018 సంవత్సరంలో గత ప్రభుత్వం హయాంలో శంకుస్థాపనకే పరిమితమైందన్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలికోట సూరమ్మ చెరువును పిసిసి హోదాలో సందర్శించినారు, వేములవాడ నియోజకవర్గ ప్రాంత ప్రజలకు సూరమ్మ చెరువు రిజర్వాయర్ ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఈ మధ్యనే జరిగిన రివ్యూలో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించడం జరిగిందని, నిధుల విడుదలకు హామీ ఇచ్చారని అన్నారు. వేములవాడ నియోజకవర్గంలోని మరిపెళ్లి రిజర్వాయర్,లచ్చంపేట రిజర్వాయర్,నూకలమర్రి గ్రామంలోని లొంకచెరువు,ఆసిరెడ్డి పల్లె గ్రామంలోని కొత్తచెరువు, సనుగుల గ్రామంలోని ఎర్ర చెరువు పటేల్ చెరువు లను నీటితో నింపడానికి అవసరమైన నిధులను విడుదల చేయాలని కోరారు. రుద్రంగి మండల లోని నాగారం చెరువు రిజర్వాయర్ లోకి వెళ్లే కాలువల పైన బ్రిడ్జిలు లేకపోవడంతో రైతులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. వీలైనంత త్వరలో నాగారం చెరువు కాలువపై బ్రిడ్జిల నిర్మాణంతో పాటు, అచ్చయ్య కుంట కాల్వ మరమ్మత్తులు చేయవలసిందిగా అభ్యర్థించారు. బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని రాళ్ళవాగు ప్రాజెక్టు కింద వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలం పరిధిలోని పలు గ్రామాల్లో సుమారు 3500ఎకరాలకు సాగునీరు అందించే కాలువలు వర్షాకాలంలో తెగిపోవడం వల్ల రైతులకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, వీలైనంత త్వరగా కాలువల మరమ్మతులు చేయవలసిందిగా కోరారు.
గత వర్షాకాలంలో వరదల వల్ల తెగిపోయిన కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో కొత్తచెరువు, రాజలింగంపేట గ్రామంలో గోవిందరాజుల చెరువు, బొమ్మన ప్రాజెక్టుకు మరమ్మతులు, చింతకుంట రాజారాం తండా, దుంపేట గ్రామాల్లో తెగిపోయిన చెరువులకు మరమత్తుల కోసం నిధులను మంజూరు చేయాలని కోరారు.
టెంపుల్ టౌన్ సిటీగా వేములవాడ: గత ప్రభుత్వం వేములవాడ దేవస్థాన అభివృద్ధికి ఏటా రూ.100 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి మర్చిపోయిందని అన్నారు. వేములవాడ దేవస్థానం అభివృద్ధికి విటిడిఎ ద్వారా గత ముఖ్యమంత్రి వీటీడీఏ చైర్మన్ హోదాలో కనీసం ఒక్క సమీక్ష సమావేశం నిర్వహించలేదు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన వీటీడీఏ సమావేశం ఏర్పాటు చేసి రూ.20 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.
గుడి చెరువు లో మురికి నీరు కలవకుండా నూతన కాలువ నిర్మాణానికి ఎస్టిపి నిధులను విడుదల చేయాలని కోరారు. వేములవాడ పట్టణంలో మూల వాగు పై గత ఏడు సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతూనే ఉందని, ట్రాఫిక్ కష్టాలు తీరడానికి తిప్పాపూర్ బ్రిడ్జి నిర్మాణానికి, తిప్పాపూర్ నుండి గుడి ముందర వరకు రోడ్డు వెడల్పు చేయడానికి అవసరమైన 35 కోట్ల నిధులను విడుదల చేయాలని అన్నారు. వేములవాడ పట్టణంలోని 100 పడకల ఆసుపత్రిలో సరిపడా సిబ్బంది లేరని, డాక్టర్లను స్టాఫ్ నర్స్ లను, సరిపడా సిబ్బందిని నియమించాలని కోరారు.
ముంపు గ్రామాల సమస్యల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ముంపు గ్రామాల ప్రజలకు గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కింద 5 లక్షల 4 వేలు ఇస్తానని రాజన్న సాక్షిగా హామీ ఇచ్చి మొండి చేయి చూపెట్టారని అన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కింద పరిహారంతో పాటు, వారికి సరైన ఉపాధి లభించేలా పరిశ్రమ లను ఏర్పాటు చేయాలని అన్నారు.
బ్రిడ్జిలు రోడ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టాలి: వేములవాడ నియోజకవర్గంలో రోడ్లు, బిడ్జిల సమస్య ప్రధానంగా ఉందన్నారు,
మేడిపల్లి,భీమారం,చందుర్తి మండల ప్రజలకు ఎంతో ఉపయోగపడే మోత్కరావుపేట్-చందుర్తి రోడ్డుకు అటవి శాఖ అనుమతులు కల్పిస్తూ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. మరిమడ్ల మానాల రోడ్డును పూర్తి చేయాలని కోరారు. కొనరావుపేట్ మండల పరిధిలోని మూలవాగు,పెంటి వాగులపై బావుసాయిపేట-వెంకట్రావుపేట్, మామిడిపల్లి- నిజామాబాద్, వట్టిమల్ల-నిమ్మపల్లి,సిరిసిల్ల నుండి సీరికొండ వెళ్లే రహదారి వెంకట్రావుపేట వద్ద, వేములవాడ నుండి సిరికొండ వెళ్లే బ్రిడ్జి గొల్లపల్లి వద్ద బ్రిడ్జిల నిర్మాణానికి నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. కరీంనగర్ నుంచి వేములవాడకు వచ్చే ప్రధాన రహదారిని కొదురుపాక నుంచి నందికమన్ వరకు 4 వరుసలు రహదారిగా పూర్తి చేయాలని కోరారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు వేములవాడ నుంచి చందుర్తి,రుద్రంగి కథలాపూర్ ,కోరుట్ల కి గల ప్రధాన రహదారిని 4వరుసల రహదారిగా పూర్తి చేయడానికి ఆర్ అండ్ బి మంత్రి నుంచి నిధులు విడుదల చేయాలని కోరారు. వేములవాడ పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, నియోజకవర్గoలో పాలిటెక్నిక్,ఐటిఐ కళాశాలలను నెలకొల్పాలని అన్నారు. మేడిపల్లి,భీమారం మండలాలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మంజూరు చేయాలని కోరారు*నియోజకవర్గం లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి అభివృద్ధికి బాటలు వెయ్యాలని ఆది శ్రీనివాస్అసెంబ్లీలో కోరారు.