ఎమ్మెల్యే సుమన్ బహిరంగ క్షేమాపణ చెప్పాలి…

– జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన
నవతెలంగాణ-భీమారం :  చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భీమారం మండల విలేకరులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని మంచిర్యాల-చెన్నూరు జాతీయ రహదారిపై నల్ల బ్యాడ్జీలు ధరించి ఎమ్మెల్యే సుమన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  అనంతరం వారు మాట్లాడుతూ.. శుక్రవారం మందమర్రి పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జర్నలిస్టులను ‘వాడు వీడు వంకర వార్తలు రాసే విలేఖరులు’ అంటు సక్కగా చేయూండ్రి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.  ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పనిచేస్తున్న జర్నలిస్టులపై ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఇలా మాట్లాడటాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ముందు నుంచే బాల్క సుమన్ తీరు ఇటు ప్రజల పట్ల గాని, అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించడం పరిపాటయింది. ఇలాంటి బాధ్యత రహిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడాన్ని ఖండిస్తూ.. నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వెంటనే బేషరతుగా జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల ఐక్యతను చాటి చెప్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో మండల జర్నలిస్టులు వేముల భగవాన్ దాస్, మడి పెద్ది సతీష్, నరహరి సంపత్ రెడ్డి, తైదల రాజన్న, అయిటిపాముల ప్రవీణ్ పాల్గొన్నారు.