నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని అమీర్ నగర్ గ్రామంలో శనివారం స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అమీర్ నగర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను 8వ తరగతి నుండి 9వ తరగతి వరకు స్థాయి పెరగడానికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషి చేశారని పేర్కొంటూ బీఆర్ఎస్ నాయకులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకంతో ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ…. ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే గ్రామ బీఆర్ఎస్ నాయకులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి పాఠశాలను అప్ గ్రేడేషన్ చేయించాలని విన్నవించినట్లు తెలిపారు. వెంటనే మంత్రి హోదాలో ప్రశాంత్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి పాఠశాలలో 9వ తరగతి నడిపించారన్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఉత్తర్వులు రావడం జరిగిందని, కానీ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీ బాల్కొండ ఇంచార్జ్ సునీల్ రెడ్డి అమీర్ నగర్ పాఠశాల అప్ గ్రేడేషన్ కు ప్రోసిండింగ్ తెప్పించారని అబద్ధపు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చేతనైతే కొత్తగా ఇంకా మిగిలిన పక్క గ్రామాల పాఠశాలలు కూడా అప్ గ్రేడే షన్ చేయించి గొప్పలు చెప్పుకోండి కానీ, ప్రశాంత్ రెడ్డి చేసిన పనులను కాంగ్రెస్ పార్టీ చేసింది అని ప్రచారాలు చేయొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుప్పాల గంగాధర్, సొసైటీ వైస్ చైర్మన్ ఆకుల రాజన్న, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మాలవత్ ప్రకాష్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగం గంగారెడ్డి, గ్రామ రైతు కో ఆర్డినేటర్ క్యాతం రాజేందర్, బెజ్జరపు సత్యం, జిల్ల రవి, వర్ణం రాజేందర్, రమేష్, గంగాధర్, ముత్తెన్న, దశరథ్, తదితరులు పాల్గొన్నారు.