నవతెలంగాణ-ఉట్నూర్
విద్యార్థులకు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్యనందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం మండలంలోని కేబి కాంప్లెక్స్‌లోని స్పోర్ట్స్ స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ చేశారు. పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో అందిస్తున్న విద్య, వైద్య భోజన సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా విద్యార్థులతో పాటు క్యూలో నిలబడి పల్లెంలో ఆహారం తీసుకోని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజు మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని సూచించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలనీ అన్నారు. నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతిరోజు వంటగది, స్టోర్ రూం, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు. వర్షకాలంలో దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా, వసతి గృహ పరిసరాలలో వర్షపు నీరు నిలువ ఉండకుండా చూడాలని సూచించారు.విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కారిస్తామని తెలిపారు. అనంతరం ఐటీఐ కళాశాలను సందర్శించారు. కళాశాలలో గల పరికరాలు, యంత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.