నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బుధవారం విస్తృతంగా పర్యటించారు. రూ.1 కోటి 30 లక్షల 80 వేల నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి,శంకుస్థాపన చేసారు. అశ్వారావుపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు అనుసంధానంగా రూ. 24 లక్షల 50 వే వ్యయం తో నిర్మించనున్న శవ పంచనామా గది(మార్చురీ) నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఊట్లపల్లి లో ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తేమ శాతం తదితర విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు పారదర్శకంగా జరగాలని సూచించారు. ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు రూ. 500 లు బోనస్ ఒక్కొక్క క్వింటాలుకు అందిస్తుందని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.వినాయకపురం లో రూ.18 లక్షల 30 వేల వ్యయంతో నిర్మించే కల్వర్ట్,రూ.17 లక్షలతో నిర్మించే పంచాయతీ కార్యాలయం ప్రహరీ గోడ పనులకు శంకుస్థాపన చేశారు. తిరుమల కుంట పంచాయతీ పాకలగూడెం లో రూ. 7 లక్షలతో అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసారు. మొద్దులమడ లో గత వారం అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కాకా వీరయ్య కుటుంబాన్ని పరామర్శించి తాత్కాలిక ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందించారు. గుంటిమడుగు లో రూ.15 లక్షల నిధులతో నూతనంగా నిర్మించే అంగన్వాడీ భవనానికి భూమి పూజ చేశారు. నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.18 లక్షలతో నిర్మించే భోజన శాల నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. సూర్యం పేట లో గత పర్యటనలో ఇచ్చిన కరెంటు లైన్ ఏర్పాటు హామీ మేరకు నూతన విద్యుత్ లైన్ ప్రారంభోత్సవం చేశారు. దత్తత గ్రామం చెన్నాపురం లో అంగన్వాడీ కేంద్రం ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.6 లక్షలతో పనులు ప్రారంభించారు. కావడిగుండ్ల లో నూతన అంగన్వాడీ భవనం నిర్మాణం కోసం రూ.10 లక్షల నిధులు కేటాయించి భూమి పూజ చేశారు.గోపన్న గూడెంలో రూ.15 లక్షల వ్యయంతో సిసి రోడ్లు రిటర్నింగ్ వాల్ పనుల ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీరాజ్ డీఈఈ శ్రీధర్,ఎం.ఈ.ఒ ప్రసాదరావు,ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మీ,సీహెచ్ సీ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రుక్మిణి,ఆర్ఎంవో డాక్టర్ విజయ్ కుమార్,పీఏసీఎస్ అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ, కాంగ్రెస్ సుంకవల్లి వీరభద్రరావు,చెన్నకేశవ రావు,జూపల్లి రమేష్,కార్యకర్తలు, అభిమానులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.