– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి
నవతెలంగాణ-చేర్యాల
చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు గత శనివారం అధికార పార్టీకి చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంఘీభావం తెలపడం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సోమవారం లైట్ మోటార్ డ్రైవర్స్ అసోసియేషన్ డ్రైవర్లు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా దీక్షలకు మల్లారెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల నుండి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నా ఏనాడు ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ను ఒప్పించి, మెప్పించి డివిజన్ కేంద్రాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు ఉన్నప్పటికీ అది చేయకుండా ప్రతిపక్ష నాయకుడిలా సంఘీభావం తెలపడం సరికాదన్నారు. సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.