– ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం
– కాంగ్రెస్‌లో జోష్.. బీఆర్‌ఎస్‌కు ఎదురీతే..!
– పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతోపాటే ఎమ్మెల్సీ ప్రచారాన్ని ప్రారంభించిన..
– కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈనెల 13వ తేదీన పార్లమెంటు ఎన్నికలు ముగియగానే పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రచారంలో వేగం పెరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా రాకేష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిను ఆయా పార్టీలు ఖరారు చేయడం, వారందరూ నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు పార్లమెంట్, మరోవైపు పట్టభద్రుల నియోజకవర్గ ప్రచారాన్ని సైతం కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ముందే ప్రారంభించింది. గత ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో పట్టభద్రుల నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఇప్పటికే ఈ నియోజకవర్గంలో రెండుసార్లు పోటీ చేసి గట్టి పోటీనిచ్చారు. వరుస ఓటముల నేపథ్యంలో ‘తీన్మార్’పై సానుభూతి కూడా ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, మరోవైపు ఆయనకున్న గుర్తింపు, సానుభూతి తనను విజయతీరాలకు తరలిస్తుందన్న విశ్వాసం ‘తీన్మార్’ వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ముందస్తుగానే కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి బి ఫారం అందచేయడంతో నామినేషన్‌ను సైతం అందరి కంటే ‘తీన్మార్’ ముందే దాఖలు చేశారు. గత రెండు ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోటీ చేసి విశేష ఆదరణను పొంది ప్రత్యేక గుర్తింపు పొందిన తీన్మార్ మల్లన్నకు పార్టీ బలంతోపాటు, జర్నలిస్టుగా గుర్తింపుతోపాటు గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి సైతం కలిసొచ్చే అవకాశముంది. ఇదిలావుంటే మల్లన్న అందరి కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో ఈసారి గెలుపు సునాయసమవుతుందన్న విశ్వాసంలో తీన్మార్ అనుచరులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఈ ఎన్నికను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. ఎమ్మెల్యేల బలం తగ్గిపోవడంతో బీఆర్‌ఎస్‌కు ఎదురీత తప్పడం లేదు. ఈ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమకారులకు కాకుండా తాజాగా బీజేపీని వీడి బీఆర్‌ఎస్ లో చేరిన రాకేశ్‌రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది.
కమలం పోటీనిచ్చేనా..?
బీజేపీ గ్రాఫ్ బాగా పెరిగిందన్న ప్రచారం నేపథ్యంలో మరోమారు ఈ నియోజకవర్గంలో బీజేపీ తన బలాన్ని పరీక్షించుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని అభ్యర్థిగా రంగంలోకి దించింది. హన్మకొండ జిల్లాకు చెందిన ‘గుజ్జుల’ గతంలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిగా ఎర్రబెల్లి రామ్మోహన్‌రావును రంగంలోకి దించినా ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో మళ్లీ ‘గుజ్జుల’ను రంగంలోకి దించడం గమనార్హం.
ద్విముఖ పోటీనే..
పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యనే ద్విముఖ పోటీ ఉండే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఇండిపెండెంట్ తీన్మార్ మల్లన్న, టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్ మధ్యనే హౌరాహౌరీ పోటీ నడిచింది. ఈసారి ఉప ఎన్నికలో మూడు పార్టీలు రంగంలో ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యనే పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఇప్పటికే రాజకీయ పార్టీలు సమావేశాలను నిర్వహించి అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని దిశా నిర్ధేశం చేశాయి. ప్రచారాన్ని ముమ్మరం చేయడంలో నేతలు నిమగమయ్యారు. ఏదేమైనా పార్లమెంటు ఎన్నికలు ముగియగానే పట్టభద్రుల నియోజకవర్గంలో ఉప ఎన్నికలుండటంతో పార్లమెంటు ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా గణనీయంగా పడే అవకాశముంది.