నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజలను మోసగించడంలో సీఎం కేసీఆర్‌ను మించిన నాయకులు లేరని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులకు మూడెకరాలు, ప్రతి నియోజకవర్గంలో 1,500 మందికి దళిత బంధు వంటివి మాటలుగానే మిగిలిపోయాయని తెలిపారు. బీసీలకు ఎంత మందికి ఆర్థిక సహాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. గడిచిన ఐదేండ్లలో మైనార్టీ యాక్షన్ ప్లాన్ ఏమైందో చెప్పాలన్నారు. మైనార్టీలను కేసీఆర్ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లీం రిజర్వేషన్లు ఎత్తేస్తామని కిషన్ రెడ్డి అంటున్నారనీ, ఆ రిజర్వేషన్లు మతపరమైనవి కావని గుర్తుచేశారు.