సీఎం , మంత్రి శ్రీధర్‌ బాబుపై ఎమ్మెల్సీ కవిత ప్రివిలేజ్‌ నోటీసులు

MLC Kavitha privilege notices on CM and Minister Sridhar Babu– శాసన మండలి చైర్మెన్‌ సుఖేందర్‌ రెడ్డికి అందజేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి సభకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రివిలేజ్‌ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఇతర బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలతో కలిసి శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్కిడి ఎమ్మెల్సీ కవిత నోటీసులను అందించారు. మంగళవారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి తాను అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తరపున పరిశ్రమలు ,ఐటీ ,శాసన సభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు సమాధానమిస్తూ డీటెయిల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌ )తయారు కాలేదనీ, ప్రపంచ బ్యాంకు నుంచి ఎలాంటి సాయాన్ని అభ్యర్థించలేదని చెప్పా రని గుర్తు చేశారు. అయితే ప్రపంచ బ్యాంకు కు రాష్ట్రప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌ 19న రూ.4,100 కోట్ల రూపాయల సాయాన్ని అభ్యర్థించిందనీ, ప్రాజెక్టుకు డీపీఆర్‌ ఉందని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. కానీ సభలో మాత్రం ఈ విషయం చెప్ప కుండా మంత్రి దాచివేశారని వివరించారు. అంతేకాకుండా, ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డిని కలిసిన సందర్భంలోనూ సీఎం రేవంత్‌ రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు రూ.14 వేల కోట్ల కేటాయించాలని కొరారని పేర్కొ న్నారు. ప్రపంచ బ్యాంక్‌కు ,కేంద్ర ప్రభుత్వానికి మూసీ ప్రాజెక్టు పై డీపీఆర్‌ గురించి ఓ రకంగా ,శాసన మండలికి మరో రకంగా చెప్పడం ద్వారా సీఎం రేవంత్‌ రెడ్డి ,మంత్రి శ్రీధర్‌బాబు శాసన మండలిని అవమానపరిచారని తెలిపారు. కాబట్టి శాసన మండలి నియమావళి 168 (ఏ )కింద వెంటనే సీఎం రేవంత్‌ రెడ్డి ,మంత్రి శ్రీధర్‌బాబుల పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల కింద చర్చకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అనంత రం ఆమె శాసనమండలి మీడియా పాయింట్‌లో మాట్లాడారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌లు ఉన్నాయని ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల పత్రాలున్నాయని చెప్పారు. తమ వద్ద నిర్దిష్టమైన ఆధారాలున్నాయనీ, సభలోనే చెప్పినట్టు ఆమె గుర్తుచేశారు. పదేండ్లలో బీఆర్‌ఎస్‌ రుణం కోసం ప్రపంచబ్యాంకును ఆశ్రయించలేదని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేద ప్రజల నుంచి భూములు లాక్కొని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి రియల్‌ ఎస్టేట్‌ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకుకు పంపించిన పత్రాల్లో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌ మెంట్‌ ప్రాజెక్టు కోసమని ఉంటే, మంత్రి శ్రీధర్‌ బాబు మాత్రం మురుగునీటి శుద్ధికి సంబంధించి కోరామని తెలిపారన్నారు. రియల్‌ ఎస్టేట్‌, ల్యాండ్‌ పూలింగ్‌ చేసి పెద్ద పెద్ద భవంతులు కడుతామని ప్రతిపాదనల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నట్టు చెప్పారు. ప్రపంచ బ్యాంకుకు ప్రతిపా దనలు పంపిన తర్వాత అక్టోబరులో డీపీఆర్‌ తయారీకి కన్షార్టియంను ప్రభుత్వం నియమించిం దని వెల్లడించారు. ఎందుకోసం అబద్దాలు చెబుతు న్నారనీ, ఎవరి కోసం ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, ప్రపంచ బ్యాంకుకు, అసెం బ్లీకి, పేద ప్రజలకు వేర్వేరు మాటలు చెబుతోందని విమర్శించారు.మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో భయానక పరిస్థితి నెలకొందని, 15 వేల ఇళ్లకు మార్కింగ్‌ చేయడం వల్ల తమ ఇళ్లను ఎప్పుడు కూల్చుతారో అన్న భయం వారిలో నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాసితు లకు పునరావాసం ఎక్కడ కల్పిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చేయబోయే రియల్‌ ఎస్టేట్‌ లో నిర్వాసితులకు ఏం వస్తుందో ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికను వెల్లడించాలని సూచించారు.