సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అభినందనలు

– సీపీఎస్‌ రద్దుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సభ్యులకు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అభినందనలు తెలిపారు. ఎన్నికల సందర్భంలో ప్రస్తావించినట్టు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం, మంత్రిమండలి సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలనీ, పరిపాలన కొనసాగించాలని సూచించారు. పార్టీలతో సంబంధం లేకుండా సీఎం, మంత్రిమండలి సభ్యులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్లు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలను క్రమపద్ధతిలో అమలు చేయాలని కోరారు. సీపీఎస్‌ రద్దు విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
రేవంత్‌కు ఉపాధ్యాయ సంఘాల శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నూతన మంత్రులకు పలు ఉపాధ్యాయ సంఘాలు శుభాకాంక్షలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వానికి పీఆర్టీయూటీఎస్‌ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు బి మోహన్‌రెడ్డి, పూల రవీందర్‌, టీజీజేఎల్‌ఏ-475 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌, టీఎస్టీయూ అధ్యక్షులు మహమ్మద్‌ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (జీటీఏ) అధ్యక్షులు కాసం ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శి మేరోజు బ్రహ్మచారి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ (ఆర్‌యూపీపీటీ) అధ్యక్షులు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి తిరుమల క్రాంతికృష్ణ, తెలంగాణ గురుకుల ప్రిన్సిపాళ్ల సంఘం (టీజీపీఏ) అధ్యక్షులు ఆర్‌ అజరుకుమార్‌, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ రాంబాబు, తెలంగాణ రాష్ట్ర వృత్తి విద్య ఉపాధ్యాయ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎద్దు ఉపేంద్రం అభినందనలు తెలిపారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలివ్వాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు.