– క్రాస్ ఓటింగ్‌పైనే ‘కాంగ్రెస్’ ఆశలు
– ఇప్పటికీ బీఆర్‌ఎస్ వైపే మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీలు
– ఒక్కొక్కరుగా ‘కారు’ దిగుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు
– అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్
– ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మారనున్న రాజకీయ పరిణామాలు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి అభ్యర్థుల ప్రకటన వెలువడింది. ప్రచారం కూడా ముమ్మరమైంది. అయితే, రాజకీయ పార్టీల బలాబలాలు చూస్తే.. ఇప్పటికీ బీఆర్‌ఎస్‌కే మెజార్టీ స్థానిక ప్రజాప్రతినిధులున్నారు.కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచిన సమయంలో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికార పార్టీగా ఉన్నది.ఇప్పుడు ప్రతిపక్షస్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి రావడంతో బీఆర్‌ఎస్ నుంచి జంపింగ్‌ల పర్వం మొదలైంది. పోలింగ్ నాటికి ఎంతమంది కారు దిగుతారోనన్న ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇప్పటి కే కొంతమంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా ఇంకా మెజార్టీ స్థానిక ప్రతినిధులు బీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. అధికార కాంగ్రెస్‌కు క్రాస్ ఓటింగ్ అయ్యే అవకాశాలున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి నాగర్‌కుంట నవీన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డికి టికెట్లను కేటాయించారు. వీరిలో ఒకరు తమకు అధిక స్థానాలు ఉన్నాయనే ఆశ పెట్టు కున్నారు. మరొకరు క్రాస్ ఓటింగ్‌పై భరోసాతో ఉన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధుల కోటాలో కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి ఇప్పుడు ఎన్నిక జరగనుంది. ఉమ్మడి జిల్లాలో 779 ఎంపీటీసీలు, 71 మంది జడ్పీటీసీలున్నారు. 374 మంది కౌన్సిలర్లు, 14 మంది ఎమ్మెల్యేలున్నారు. జడ్పీటీసీలలో మెజార్టీ సభ్యులు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు సైతం కాంగ్రెస్‌లో చేరారు. మహబూబ్‌నగర్ బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌లు పార్టీ మారడంతో మున్సిపాల్టీని కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. అధికార పార్టీ కాంగ్రెస్ కావడంతో మెజార్టీ ప్రజాప్రతినిధులు కాంగ్రెెస్‌లో చేరే అవకాశాలున్నాయి. 14 మంది ఎమ్మెల్యేలలో 12 మంది కాంగ్రెస్ సభ్యులున్నారు.
పెండింగ్ బిల్లులతోపాటు మరో ఐదేండ్లపాటు పాలనాపరంగా అధికార పార్టీతో అనేక అవసరాలు ఉంటాయి. అందుకే చాలా మంది ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి ఓట్లు క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న భరోసాతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అదే జరిగితే మన్నె జీవన్‌రెడ్డి గెలుపు సులభమే. రేపటితో నామినేషన్ గడువు ముగుస్తుంది. 12న పరిశీలన, 14న నామినేషన్ల విత్‌డ్రా ఉంటుంది. 28న పోలింగ్, ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.