– 2014 తర్వాతే అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరణ
– విమర్శలకు జవాబుగా కక్ష సాధింపులు
– సెబీ నిష్క్రియాపరత్వం
ప్రధాని నరేంద్ర మోడీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మధ్య అనేక సంవత్సరాలుగా సత్సంబంధాలు కొనసాగుతున్న విషయం బహిరంగ రహస్యమే. భారత చరిత్రలో ఓ దేశ ప్రధానికి, ఓ పారిశ్రామికవేత్తకు మధ్య ఇంతలా సంబంధాలు పెనవేసుకుపోవడం గతంలో ఎన్నడూ జరగలేదు. అదానీ కోసం మోడీ పనిచేస్తున్నారని చెప్పడానికి ప్రతిపక్షాలు తరచుగా ‘మోదానీ’ అనే పదాన్ని ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ‘మోడీ-అదానీ భారు భారు/దేశ్ బెచ్ కీ ఖాయే మలారు’ అనే నినాదం మార్మోగింది. అదానీ గ్రూప్ సంస్థలు అనైతిక పద్ధతులకు పాల్పడుతున్నాయంటూ అమెరికా కోర్టు అభిశంసించడానికి చాలా కాలం క్రితమే పార్లమెంటులో ఈ నినాదాలు హోరెత్తాయి.మోడీ కూడా అదానీతో తనకున్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని దాచిపెట్టేందుకు ఏనాడూ ప్రయత్నించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండే మోడీ, అదానీల మధ్య అపవిత్ర సంబంధం ఉన్నదంటూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించినా ప్రధాని ఏ మాత్రమో పట్టించుకోలేదు. ప్రత్యేక ఆర్థిక మండలి కోసం అదానీకి గుజరాత్‌లో ప్రభుత్వ భూమిని కారుచౌకగా (చదరపు మీటరు ధర రూపాయి నుంచి 32 రూపాయల వరకూ) కట్టబెట్టారని కాంగ్రెస్ 2014కు ముందే చెప్పింది. మోడీని గొప్ప పాలనాదక్షుడిగా, సంస్కరణవాదిగా చూపేందుకు అదానీ గ్రూప్ ముమ్మరంగా కృషి చేసింది. ఈ నేపథ్యంలో మోడీ, అదానీ సంబంధాలపై ‘ది వైర్’ పోర్టల్ అందించిన కథనం మీ కోసం…
న్యూఢిల్లీ : 2001లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు అదానీ పెద్దగా పేరున్న వ్యక్తేమీ కాదు. 2014లో అదానీ నికర ఆస్తుల విలువ 2.8 బిలియన్ డాలర్లు మాత్రమే. అప్పట్లో ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఆయనది భారతదేశంలోని సంపన్న వ్యక్తుల్లో 11వ స్థానం. కానీ 2022 ఏప్రిల్ నాటికి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో రెండో వ్యక్తిగా నిలిచారు. అప్పుడు ఆయన నికర ఆస్తుల విలువ 90 బిలియన్ డాలర్లు.
ఇదేం స్పందన?
ఇటు దేశంలోనూ, అటు విదేశాల్లోనూ అదానీకి మేలు చేకూర్చేందుకు మోడీ ప్రధాని కార్యాలయాన్ని వాడుకున్నారని రాహుల్ గాంధీ అనేక బహిరంగ సభలు, పత్రికా సమావేశాల్లో చెబుతూ వచ్చారు. ఆ తర్వాత ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా రాహుల్‌కు మద్దతుగా మాట్లాడడం మొదలు పెట్టారు. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ సంచలన నివేదిక బయటపెట్టిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా, అమ్‌ఆద్మీ పార్టీకి చెందిన సంజరు సింగ్ గళం విప్పారు. ప్రతిపక్ష పార్టీలు ‘మోదానీ’ అంటూ గగ్గోలు పెడుతుంటే మోడీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది? పార్లమెంటులో చర్చకు నిరాకరించింది. మోడీ, అదానీ మధ్య సంబంధాలపై ప్రతిపక్షాలు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను రికార్దుల నుండి తొలగించింది. ఇరువురి మధ్య సంబంధాలపై కథనాలు రాసిన పాత్రికేయులను వెంటాడింది. మోడీ, అదానీ మధ్య సంబంధాలను బట్టబయలు చేసినందుకే రాహుల్, మొయిత్రాలను లోక్‌సభ సభ్యత్వాలకు అనర్హులుగా ప్రకటించారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. తప్పుడు పనులు, చట్ట ఉల్లంఘనలకు సంబంధించి నిర్దిష్ట ఆధారాలు అందిస్తూ అదానీ వ్యవహారాలపై కాంగ్రెస్ వంద ప్రశ్నలు సంధిస్తే ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడిన చందంగా వ్యవహరించి, విచారణకు సిద్ధపడలేదు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ జరిపించాలని డిమాండ్ వచ్చినప్పటికీ దానిని ప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో ఈ వ్యవహారం వెనుక ఏదో రహస్యం దాగి ఉందన్న అనుమానాలు పెరిగాయి. ఆరోపణలపై స్పందించేందుకు మోడీ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ప్రభుత్వం నిస్పాక్షిక విచారణకు ఆదేశించలేదు సరికదా కనీసం పార్లమెంటులో చర్చకు కూడా అనుమతించలేదు. కొన్ని కేసుల్లో కేంద్ర సంస్థలు చేపట్టిన దర్యాప్తులు నత్తనడక నడిచాయి.
ఎదురు దెబ్బలు
అదానీకి పవన విద్యుత్ ప్రాజెక్టును అప్పగించాల్సిందిగా మోడీ తమ దేశాధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చారని శ్రీలంక అధికారి ఒకరు పార్లమెంటరీ కమిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అయితే అందుకు మోడీ ఎలాంటి రాజకీయ మూల్యం చెల్లించుకోలేదు. అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ కెన్యా రద్దు చేసుకుంది. అదానీని తమకు మోడీయే పరిచయం చేశారని కెన్యా ప్రభుత్వం అంగీకరించింది కూడా. బంగ్లాదేశ్‌లో విద్యుత్ సరఫరా కాంట్రాక్టుపై పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. విద్యుత్ ప్లాంటు నెలకొల్పిన జార్ఖండ్‌లోనూ అదే పరిస్థితి. ఇజ్రాయిల్‌తో అదానీ కుదుర్చుకున్న రక్షణ కాంట్రాక్ట్ ఓ ఫార్స్ అని, భారత్‌లో ఉత్పత్తులే జరగడం లేదని కాంగ్రెస్ చెబుతోంది. ఇండొనేషియా నుండి బొగ్గు కొనుగోలు విషయంలో ఇన్వాయిస్ ధరను అధికంగా చూపారంటూ పెద్ద ఎత్తున అలజడి చెలరేగినప్పటికీ విచారణ జరపలేదు. తాజాగా అమెరికా ప్రాసిక్యూటర్లు అదానీపై అవినీతి, మోసం ఆరోపణలు మోపుతూ న్యూయార్క్ కోర్టులో కేసు వేశారు.
సెబీ ఏం చేస్తోంది?
అదానీ గ్రూపు సంవత్సరాల తరబడి ఎన్నో ఉల్లంఘనలకు పాల్పడుతున్నప్పటికీ సెబీ ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. సెబీ ఛైర్‌పర్సన్ మాధబి బచ్ పూరీపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఆమెను తొలగించలేదు. అదానీ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకు కొన్ని శక్తులతో కూడిన భారీ నెట్‌వర్క్ పనిచేస్తోందని చెప్పడానికి ఇది సరిపోతుంది. అదానీకి ఒకటి కంటే ఎక్కువ విమానాశ్రయాలను ధారాదత్తం చేయడానికి మోడీ ప్రభుత్వం నిబంధనలు సవరించింది. అదానీ- అంబానీకి రూ.30 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ వాణిజ్యాన్ని అప్పగించేందుకు జరిగిన కుట్రలో భాగంగానే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారన్న ఆరోపణలూ వచ్చాయి. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్న ఈడీ, సీబీఐలు అదానీపై వచ్చిన ఆరోపణలను పట్టించుకోవడం లేదు.
ఏదేశమేగినా..
ఎన్ని ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ అదానీ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా దినదినాభివృద్ధి చెందింది. అదానీపై వచ్చిన ఆరోపణలు విస్మరించదగినవేమీ కావు. ఎందుకంటే అవి చాలా తీవ్రమైనవి. ప్రపంచవ్యాప్తంగా ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్, గనుల తవ్వకం, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగాల్లో వ్యాపార ప్రయోజనాలను విస్తరించు కోవడంలో అదానీకి మోడీ తన కార్యాలయం ద్వారా సాయపడ్డారని రాహుల్ అనేక సందర్భాల్లో ఆరోపించారు. అదానీ వ్యాపార ప్రయోజనాలు, ప్రాజెక్టు లు, కాంట్రాక్టులను ముందుకు తీసికెళ్లేందుకు మోడీ మన దేశ దౌత్య అధికారాన్ని ఉపయోగించారని కూడా ఆయన విమర్శించారు. మోడీ ఏ దేశం లో పర్యటించినా అక్కడ అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. అమెరికా పర్యటనకు ముందు శ్రీలంక, బంగ్లాదేశ్, కెన్యా, ఆస్ట్రేలియా దేశాల్లో వివాదా లు చెలరేగాయి. అయితే వీటిని మోడీ ఏ మాత్రం ఖాతరు చేయలేదు.