ఆధునిక బానిసత్వం…!

Modern day slavery...!– విలవిల్లాడుతున్న కార్మిక లోకం
– హరించుకుపోతున్న హక్కులు, సౌకర్యాలు
– భద్రత లేని ఉద్యోగాలు… చాలీచాలని వేతనాలు
– ప్రధాని కాళ్లు కడిగినా మారని పారిశుధ్య కార్మికుల బతుకులు
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ పాలనలో బానిసత్వం ఆధునిక రూపాలు సంతరించుకుంది. బానిసత్వ కోరల్లో చిక్కి కార్మిక లోకం విలవిల్లాడుతోంది. కార్మికుల వేతనాలు పెరగక పోగా నానాటికీ తగ్గిపోతున్నాయి. కార్మిక వర్గానికి ఉన్న హక్కులన్నీ హరించుకుపోతున్నాయి.
చెప్పిందేమిటి?
కార్మికులపై బీజేపీ ఎనలేని ప్రేమ కనబరచింది. వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటానని బీరాలు పలికింది. కార్మికులతో పాటు మున్సిపాలిటీలలో పనిచేసే వారిని గౌరవిస్తానని, వారి బాగోగులు చూసుకుంటానని హామీ ఇచ్చింది. కానీ గడచిన పది సంవత్సరాల కాలంలో కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ వారి హక్కులను అణచివేస్తోంది.
దుర్భరం…కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీవనం
మోడీ హయాంలో కార్మికుల హక్కులు, సౌకర్యాలు కనుమరుగయ్యాయి. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు, దినసరి కార్మికులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు…ఒకరేమిటి? కార్మిక లోకమంతా సమస్యల వలయంలో చిక్కుకుపోయింది. ఉద్యోగ భద్రత కరువైన కార్మికులను ప్రమాదకరమైన పరిస్థితిలోకి నెట్టేశారు. కాంట్రాక్ట్‌ కార్మిక వ్యవస్థ అంటేనే బానిసత్వానికి ఆధునిక రూపం. ఈ రకం కార్మికులకు ప్రయోజనాలేవీ వర్తించవు. ఇష్టముంటే పనిలో పెట్టుకుంటారు. లేకుంటే బయటికి గెంటేస్తారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, పెన్షన్‌, బోనస్‌ అనేవే ఉండవు. వీరికి ఇచ్చే వేతనాలు దారుణంగా, అవమానకరంగా ఉంటాయి. డబుల్‌ డిగ్రీలు చేసి, తగిన ఉద్యోగం లభించక జీవనాధారం కోసం కాంట్రాక్ట్‌ లెక్చరర్‌గా పని చేస్తున్న వారికి సగటున నెలకు కేవలం 8,000 రూపాయల వేతనం మాత్రమే దక్కుతోంది.
వారిది అంతులేని కథ…వ్యథ
మున్సిపల్‌ కార్మికుల కష్టాలు చెప్పనలవి కావు. ఈ ఆధునిక కాలంలో కూడా వారు ఇప్పటికీ అవమానకరమైన, క్లిష్టతరమైన పనులు చేస్తూ జీవితాలు గడుపుతున్నారు. చాలీచాలని వేతనాలు తీసుకుంటూ రాత్రింబవళ్లూ కష్టపడి నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. మోడీ పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగి ఆ నీళ్లను తలపై చల్లుకున్నా వారి బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదు. వారికి గౌరవప్రదమైన జీవితమూ లభించలేదు. అదంతా ఆయన చౌకబారు డ్రామాయే. వీధులు ఊడుస్తూ, డ్రైనేజీలు శుభ్రం చేస్తున్న మున్సిపల్‌ కార్మికులకు సగటున నెలకు ఐదు వేల రూపాయల జీతం మాత్రమే లభిస్తోంది.
కార్మిక శక్తి దోపిడీ
ఇవన్నీ చాలవన్నట్టు మోసపూరిత ప్రభుత్వం రోజువారీ పని గంటలను 8 నుంచి 12కు పెంచింది. ఇప్పటి వరకూ అమలులో ఉన్న 8 పని గంటలు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నిర్ణయించినవి. సుదీర్ఘ కాలం కొనసాగిన కార్మికుల ఆందోళన ఫలితంగా వంద సంవత్సరాల క్రితం ఈ పని గంటలను నిర్ణయించారు. ఇప్పుడు అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేసి ప్రభుత్వం పని గంటలను పెంచుతోంది. తద్వారా కార్మికులను మరింతగా దోచుకునేందుకు మార్గం సుగమం చేస్తోంది.
వీరి బతుకులూ అంతంతే
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆశాలు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన సిబ్బంది బతుకులు కూడా దుర్భరంగానే ఉన్నాయి. పనిభారం అధికంగా ఉన్నప్పటికీ వారికి లభించే నెలసరి వేతనం ఐదు వేల రూపాయలు మాత్రమే. ఇక ఓలా, ఊబర్‌, స్విగ్గి, జొమాటో కార్మికులు ఎండ, వానలతో నిమిత్తం లేకుండా రోజంతా వీధుల్లోనే తిరుగుతుంటారు. అయినా వీరికి నెలకు పది వేల రూపాయలు లభించడం గగనమే అవుతోంది. మరోవైపు ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల జీవితాలు కూడా అస్థిరంగానే ఉన్నాయి. లాటరీలో డబ్బు గెలుచుకుంటామో లేదో ఎలా చెప్పలేమో వారికి ఎంత ఆదాయం వస్తుందో చెప్పడం కూడా అంతే కష్టం. వారి ఆదాయం ఓలా, ఊబర్‌ వంటి యాప్‌ ఆధారిత కంపెనీలపై ఆధారపడి ఉంటుంది.
కారణాలు ఇవే…
కార్పొరేట్‌ కంపెనీల లాభాలను పెంచి, ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవడానికే ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధా నాలను అమలు చేస్తోంది. కార్మికుల హక్కులను హరిస్తోంది. ఉద్యోగావకాశాలను తగ్గిస్తోంది. నైపుణ్యత కలిగిన విద్యావం తులైన కార్మికుల సంఖ్యను పెంచుతోంది. ఫలితంగా వారంతా తక్కువ వేతనాలతో రోజుకు 12 గంటల పాటు కట్టు బానిసలుగా పనిచేయాల్సి వస్తోంది. నిరుపయోగమైన కార్యక్రమాలు చేపట్టి కొందరు వ్యక్తులకు శిక్షణ ఇప్పించి, కార్పొరేట్‌ సంస్థల లాభాల కోసం వారిని నిపుణులైన బానిసలుగా పంపుతోంది. శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన నిపుణులు తక్కువ వేతనాలకే లభిస్తుండ డంతో విదేశీ పెట్టుబడి దారులు వారికి వల వేస్తున్నారు. చౌకగా లభిస్తున్న నిపుణులను నియమించుకొని లాభాలు ఆర్జిస్తూ, వాటిలో కొంత భాగాన్ని అవినీతి ప్రభుత్వానికి ముట్టచెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కార్మికులను అణచివేసి, కార్పొరేట్‌ సంస్థలకు బలోపేతం చేయడమే మోడీ ప్రభుత్వ విధానం.
ఈ ప్రశ్నలకు బదులేది?
ఇలాంటి అరకొర ఆదాయంతో కార్మికులు ఎలా జీవించగలరు? ధరలు ఆకాశాన్ని అంటుతుంటే చాలీచాలని సంపదతో కుటుంబాలను ఎలా పోషించగలరు? పిల్లల పాఠశాల ఫీజులు ఎలా కట్టగలరు? ఆరోగ్యం బాగుండక ఆస్పత్రి పాలైతే అప్పు చేయాల్సిందే. వీటన్నింటితో పాటు గ్రామాల్లో నివసిస్తున్న వృద్ధులైన తల్లిదండ్రుల పోషణకు డబ్బు పంపాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సొంత ఇంటి కల ఎలా సాకారమవుతుంది?