– అయోధ్య పూర్తయినా.. హిందూత్వతోనే రాజకీయం
– రానున్న ఎన్నికల్లో బీజేపీ ఎత్తుగడలు
– కాశీ, మథురపై ఆ పార్టీ నేతల ‘కీలక’ వ్యాఖ్యలు
– మూడోసారి అధికారంలోకి వస్తామని మోడీ విశ్వాసం
– లోక్‌సభలో 370 సీట్లపై గురి
– ఆరెస్సెస్ సిద్ధాంతాల అమలే లక్ష్యం
– రాజకీయ విశ్లేషకుల అంచనా
న్యూఢిల్లీ : యూపీలోని అయోధ్యలో రామ మందిర నిర్మాణ అంశం బీజేపీకి రాజకీయంగా ఎదుగుదలకు దోహదం చేసింది. దేశంలో 1990వ దశకం వరకు ఆ పార్టీ ఉనికి, బలం అంతగా లేదు. అయితే, రామ మందిర నిర్మాణ డిమాండ్‌తో ఆ పార్టీ అగ్రనేత ఎల్.కె అద్వానీ దేశంలో చేపట్టిన రథయాత్ర ఆ పార్టీని రాజకీయంగా బలంగా తయారు చేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన పలు లోక్‌సభ ఎన్నికల్లో వందకు పైగా స్థానాలు, అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీకి అధికారాన్ని సాధించేలా చేసింది. ‘హిందూత్వ’ అనే భావోద్వేగ సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఆ పార్టీ ఆ సెంటిమెంట్‌ను పలు ఎన్నికల్లో ఉపయోగిస్తూ వచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో రామ మందిర అంశాన్ని ఆ పార్టీ లేవనెత్తింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి కావటంతో బీజేపీ హిందూత్వ సిద్ధాంతం కాస్త బీటలు వారొచ్చనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. అయితే, బీజేపీలోని కీలక నాయకులు మాత్రం.. అయోధ్య పూర్తయినా కాశీ, మథురాలు ఇంకా మిగిలే ఉన్నాయని అంటున్నారు. దీంతో ఏ రకంగానైనా హిందూత్వ అజెండాతోనే రాజకీయాలు చేయాలనీ, రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ దీనిని వాడాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు కాషాయపార్టీ నేతల మాటలను చూస్తే అర్థమవుతున్నది.
ఇటు 17వ లోక్‌సభ శనివారంతో ముగిసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించటంపై అధికార బీజేపీ విశ్వాసం వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ మెరుగైన మెజారిటీతో విజయం సాధిస్తుందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. 370 సీట్లను సాధిస్తుందని పరోక్షంగా చెప్పారు. ”మా మూడో దఫా చాలా పెద్ద నిర్ణయాలకు సాక్ష్యంగా ఉంటుంది. రాబోయే 1,000 సంవత్సరాలకు బలమైన పునాది వేస్తుంది” అని మోడీ సభలో చెప్పారు.
‘హిందూత్వ’, యూసీసీ వంటి పలు సున్నితమైన, వివాదాస్పద, భావోద్వేగ అంశాలను ఆధారంగా చేసుకొనే ఆయన ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి అంశాలను వాడుకొని అధికారంలోకి రావటం ఆ పార్టీకి అలవాటనీ చెప్తున్నారు. 2019లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘పుల్వామా దాడి’ ఘటన ఆ పార్టీకి రాజకీయంగా చాలా లబ్దిని చేకూర్చిందనీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 300కు పైగా స్థానాలు దక్కేలా చేసిందని అంటున్నారు. ఈ సారి కూడా హిందూత్వ, జాతీయవాదం వంటి అంశాలను ఆ పార్టీ మళ్లీ ఉపయోగించినా ఆశ్చర్యపోవాల్సినవసరం లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
హిందూత్వ సిద్ధాంతాన్ని బలంగా వినిపించే బీజేపీ నాయకుల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒకరు. ఆయన ఇటీవల ఆ రాష్ట్ర అసెంబ్లీలో ‘అయోధ్య పూర్తయిందనీ, కాశీ, మథుర లు ఎదురు చూస్తున్నాయని’ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రుల స్థాయిలో ఉన్న పలువురు బీజేపీ నాయకులూ ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బీజేపీ కొన్ని సైద్ధాంతిక ప్రాజెక్టులు ఇప్పటికే కీలక దశకు చేరుకున్నాయి. 17వ లోక్‌సభలో తన సభ్యుల బలంతో ఆ పార్టీ పలు కీలక బిల్లులను ఆమోదింపజేసుకున్నది. ఇందులో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్‌ను నేరంగా ప్రకటించటం, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వంటివి ఉన్నాయి. న్యాయస్థానం తీర్పుతో అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైంది. ఇక లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను కల్పించే బిల్లు, వలస కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్తవి తీసుకురావటం వంటివి చేసింది.
370 సీట్లతో తిరిగి అధికారంలోకి వచ్చి పెద్ద నిర్ణయాలు తీసుకుంటామని పార్లమెంటులో మోడీ చెప్పారు. అయితే, ఈ లోక్‌సభ ఎన్నికల్లో భావోద్వేగ అంశాలను వాడుకొని, ప్రజల్లో సెంటిమెంట్‌ను రగల్చే ప్రణాళికను బీజేపీ ఇప్పటికే సిద్ధం చేసుకున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాశీ, మథుర సెంటిమెంట్, యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ), మత మార్పిడి నిరోధక చట్టం, జనాభా నియంత్రణ చట్టం వంటి వాటిని ఆ పార్టీ ఆయుధాలుగా వాడుకొనే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆ పార్టీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినా.. ఆరెస్సెస్ సిద్ధాంతాలను అమలు చేసే పనిలోనే ఉంటుందని చెప్తున్నారు.