”చూశావా! నా మోడీ పవర్! 3.0 అప్‌డేటేడ్!” అన్నాడు చారి. భార్య అందించిన చాయి కప్పు అందుకుంటూ.
”3.0. అంటే ఏమిటీ? ఆప్‌డేటెడెట్ ఏమిటీ? నాకేమీ అర్థం కావటం లేదు!” అన్నది వాణి తానూ చాయి కప్పు అందుకొని.
”నా మోడీ మూడోసారి వరసగా గెలవటమే కాదు. మూడోసారి ప్రధాని కూడా అయ్యి రికార్డు స్థాపించాడు. అందుకే 3.0. అంటున్నాం. ఇది కూడా అర్థం కావటం లేదంటే నీవెంత వెనకపడి ఉన్నావో అర్థం అవుతూనే ఉంది!” అన్నాడు చారి నవ్వుతూ.
”నేను వెనకపడ్డ మాట నిజమే! కాని దానికి కారణము ఎవరో మీకే బాగా తెలుసు! అది తర్వాత మాట్లాడుదాం! ఇంతకీ 3.0. ప్రత్యేకత ఏమిటో కాస్త చెప్పండీ!” అడిగింది వాణి.
”3.0. స్పెషల్ ఏమిటో ఇప్పటికే ఫస్ట్‌రీల్ చూపించాడు. నువ్వింకా చూడలేదా? అందుకే నిన్ను వెనకబడ్డావని అనేది! సర్లే
”నా మోడీ ఎన్నికలు కాగానే ఇటలీ వెళ్లి అక్కడ జి7 నాయకులతో కలిసి ఫొటోలు దిగాడు తెలుసా? అన్నాడు చారి గర్వంగా.
”అదేంటీ ఎన్నికలు కాగానే యువరాజు రాహుల్ ఇటలీ వెళతాడని మోడీనే ఎడంచేత్తో చప్పట్లు కొట్టి మరీ చెప్పాడు. ఇప్పుడేమో తానే వెళ్లాడా? పోన్లెండి వెళ్లనైతే వెళ్ళాడుగాని, జి7లో భారత్‌కు సభ్యత్వం లేదు కదా! మీరు చెప్పినట్లు జి7 నాయకులు దిగిన గ్రూప్‌ఫొటోలో మోడీ లేరు కదా!” అడిగింది వాణి.
”ఆహ్హహ్హ! మోడీ అంటే విశ్వగురు, ప్రపంచ నాయకుడు. ఆయనతో ఫొటోలు దిగాలంటే అదృష్టం ఉండాలి! అందుకే ఒక్కో దేశ నాయకుడిని పిలిచి విడివిడిగా ఫొటోలు దిగి, వారిని సంతోష పెట్టాడు. అందుకే గ్రూప్‌ఫొటోలో ఆయన లేరు! ఆయన గొప్పతనం అర్థం చేసుకో!” అన్నాడు దిలాసాగా చారి.
”నిజమేనండి! మోడీ గొప్పతనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం! అవునూ.. ఇలా విదేశీ పర్యటనలు చేసినపుడు, దేశ నాయకులను కలసినపుడు ఏవో ఒప్పందాలు రాసుకుని వాటిలో సంతకాలు చేస్తూ, వాటిని పరస్పరం ఇచ్చుకుంటూ, గత సాదా, సీదా ప్రధానులు ఫొటోలు దిగేవారు! ఇప్పుడేమో ఖాళీ చేతులు ఊపుకుంటూ ఫొటోలు దిగారు! మోడీ 3.0లో ఒప్పందాలు లేవా?” అమాయకంగా అడిగింది వాణి.
”అదే చెబుతున్నా! మోడీతో ఒప్పందాలు చేసు కోవాలంటే కూడా ఆయా దేశాధినేతలకు కూడా అదృష్టం ఉండాలి! జి7 దేశాల అధినేతల దురదృష్టానికి నేనేం చేయలేను!” అన్నాడు చారీ గంభీరంగా.
”నిజమే! వారి ఖర్మకు మీరు మాత్రం ఏం చేస్తారు! ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయుల పిల్లలను భారత్‌కు తీసుకుని రావటానికి, ఉక్రెయిన్, రష్యా అధినేతలతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించి మరీ పిల్లల్ని భారత్‌కు మోడీ రప్పించారట కదండీ!” అడిగింది వాణి.
”చూశావా! నాలుగుసార్లు మోడీ నామస్మరణ చేశావు. నీ జ్ఞాపకశక్తీ పెరిగింది! ఉక్రెయిన్-రష్యా యుద్ధమే కాదు! ఏ యుద్ధమైనా సరే మోడీ ఆపగలడు. అసలింతకూ మూడవ ప్రపంచ యుద్ధం 2014 నుండీ ఇప్పటి వరకు జరగలేదంటే కారణం మోడీ! ఇది తెలుసుకో!” అన్నారు చారి ఛాతి ఉప్పొంగుతుండగా.
”అవునండీ! మోడీ అంత సమర్థుడే! కానీ నాదో డౌటు తీర్చండి!” అంది వాణి.
”అడుగు!” అన్నాడు చిద్విలాసంగా చారి.
”ఎక్కడో జరుగుతున్న పెద్ద పెద్ద యుద్ధాలు ఆపగల సామర్థ్య మున్న మోడీ, భారత్‌లో జరుగుతున్న నీట్, నెట్ లీకేజీలను ఆపలేక పోతున్నా రెందుకు?” అడిగింది వాణి.
”మోడీ అంతటి నాయకుడికి ఇదేం పెద్ద లెక్కకానే కాదు!” అన్నాడు చారీ బింకంగా.
”నీట్‌లో 23 లక్షల 33 వేల మంది పిల్లలు పరీక్ష రాశారు. మరో పదొకొండు లక్షల మంది నెట్ పరీక్ష రాశారు. మొత్తం కలిసి 34 లక్షల మంది భవిష్యత్ సంబంధించిన విషయం లెక్కలోకి రావటం లేదా?” అందుకేనా ఇంత వరకు ప్రధాని నోరెత్తి మాట్లాడలేదు?” అడిగింది వాణి.
”మంత్రులు చర్య తీసుకుంటామని ప్రకటించారు కదా!” అన్నాడు బింకంగా చారి.
”మంత్రులా! వారంతా మట్టి బొమ్మలు! వారి మాటలు నీటిమీది రాతలు! పదో తరగతి పరీక్షలు ఎలా రాయాలో పరీక్షాపై చర్చ జరుపుతారు!(aంb)2లో 2ab ఎట్లా వస్తుందో వివరంగా తెలుపుతారు! కాని నీట్, నెట్ పేపర్లు లీకై లక్షలాది మంది రోడ్ల మీద పడితే మాత్రం నోరెత్తి మాట్లాడరు! ఎందుకు?” ప్రశ్నించింది వాణి.
భార్య మాటలకు చారి బుర్ర గిర్రున తిరిగింది!
”మన్‌కి బాత్ అనీ, చర్చా అనీ మైకుల ముందు ఒం టరిగా గంటలకొద్దీ ప్రసంగించే మోడీ శవాలు గంగలో కొట్టుకొని పోయినప్పుడు నోరెత్తలేదు. ఒడిషాలో మూడు రైళ్లు ఢకొీంటే మాట్లాడలేదు. ఇప్పుడు నీట్, నెట్ పేపర్లు లీకైతే నోరెత్తి మాట్లాడరు! కాని నలంద విశ్వవిద్యాలయంలో పుస్తకాలు ఎవరు తగలబెట్టారో దగ్గరుండి చూసినట్లు ఉపన్యసిస్తారు! ఇదేనా అప్‌గ్రేడెడ్ వెర్షన్!” నిలదీసింది వాణి.
భార్య జ్ఞాపకశక్తికి, విజ్ఞానానికి చారికి నోరు పెగలటం లేదు!
”ఎవరైనా ఒక పదవిలో ఉన్నప్పుడు, బాధ్యతగా వ్యవహ రించాలి! మోడీ 1.0లో, 2.0లో, ఇప్పుడు 3,0లోగాని బాధ్యత అన్నది ఏ కోశాన కనబడటం లేదు! ఇంతపెద్ద దేశానిక ప్రధానిగా ఉన్న వ్యక్తి సరైన నిర్ణయాలు తీసుకో వాలి, సక్రమంగా అమలు చేయాలి! ఒక్కటైనా సరైన నిర్ణ యం తీసుకున్నారా? పెద్దనోట్ల రద్దు, కోవిడ్ లాక్‌డౌన్, బ్లాక్‌మనీ, చట్టాల మార్పు ఇలా ఒక్కటీ సరైన నిర్ణయం కాదు! కేంద్ర సంస్థలన్నీ 2014 నుండి ఒక్కోటీ శక్తులుడి పోతున్నాయి. ఈడితో మొదలు పెడితే నీట్, నెట్ వరకు వచ్చాయి! ఇంకా ఎన్ని సంస్థలు నాశనం చేస్తారు? బాధ్యతుండక్కర్లా?” గద్దించింది వాణి.
చారి కండ్లు తిరిగి పడిపోయాడు.
– ఉషాకిరణ్