మోడీ, అమిత్‌ షా రాజనీతిజ్ఞులుగా నిరూపించుకోవాలి

Modi is Amit Shah We have to prove ourselves as statesmen– సోనమ్‌ వాంగ్‌చుక్‌
– 21 రోజుల నిరాహార దీక్ష విరమణ
లఢక్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తమని తాము రాజకీయ నీతిజ్ఞులుగా నిరూపించుకోవాలని లఢక్‌ చెందిన ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ డిమాండ్‌ చేశారు. లఢక్‌కు రాష్ట్రహోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చడం వంటి నాలుగు డిమాండ్లతో 21 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను సోనమ్‌ వాంగ్‌చుక్‌ మంగళవారం విరమించారు. పై డిమాండ్ల కోసం తన పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. మంగళవారం వాంగ్‌చుక్‌ చాలా బలహీనంగా కనిపించారు. నిరాహార దీక్ష విరమణకు ముందు ఎక్స్‌లో ఆయన ఒక వీడియో పోస్ట్‌ చేశారు. ‘ప్రస్తుతం మనదేశానికి చిత్తశుద్ధి, దూరదృష్టి, వివేకం ఉన్న రాజనీతిజ్ఞులు కావాలి. కేవలం హ్రస్వదృష్టి ఉన్న రాజకీయ నాయకులు కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా త్వరలో తాము రాజనీతిజ్ఞులు అని నిరూపించుకుంటారని ఆశిస్తున్నా’ అని సోనమ్‌ వాంగ్‌చుక్‌ తెలిపారు. లడఖ్‌ ప్రజలకు బిజెపి, మోడీ చేసిన వాగ్దానాలను గుర్తుచేశారు. ‘మోడీ రామభక్తునిగా చెప్పుకుంటారు. ప్రాణాలు కోల్పోయినా మాట తప్పకూడదు’ అనే రాముని బోధనను మోడీ అనుసరించాలి’ అని అన్నారు. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం-లఢక్‌ నాయకుల మధ్య చర్చలు విఫలమైన తరువాత ఈ నెల 6న ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు. మంగళవారం ముందుగా నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్‌ను నటులు ప్రకాశ్‌రాజ్‌ పరామర్శించారు. వాంగ్‌చుక్‌కు మద్దతు తెలిపారు. ప్రభుత్వాలు తమ వాగ్దానాలను నిలబెట్టుకోనప్పుడు ప్రజలు ఐక్యంగా ఉండి, తమ గళాన్ని పెంచడం తప్ప మరో మార్గం లేదని ప్రకాశ్‌రాజ్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఈ రోజు తన పుట్టినరోజని, వాంగ్‌చుక్‌కు మద్దతు ఇవ్వడమే తన ప్రాధాన్యత అని చెప్పారు.