మోడీ చారు బేచ్‌నే జాయేగా, దేశ్‌కొ అచ్ఛేదిన్‌ ఆయేగా!

మోడీ చారు బేచ్‌నే జాయేగా, దేశ్‌కొ అచ్ఛేదిన్‌ ఆయేగా!‘మూర్ఖత్వాన్ని ఉన్నతీకరించి గొప్పగా చెప్పుకోవడం, అనేది నన్ను అమితంగా బాధిస్తుంది. అంతకన్నా నన్ను బాధించేది మరొకటి లేదు’ – అని అన్నారు ప్రఖ్యాత శాస్త్రవేత్త, వైజ్ఞానిక రచయిత కార్ల్‌ సాగన్‌. వివేచన, మౌనం రెండూ కవల పిల్లలు. అందులో ఒకటి వచ్చిందంటే, దానితో పాటు రెండోది తప్పకుండా వస్తుంది. పిచ్చివాగుడు వా వారికి వివేచన ఉండదని ఇక్కడ గోప్యంగా చెప్పడం జరిగింది. మంగళ సూత్రాల మీద మాట్లాడే మన దేశ మహానాయకుడికి ఇది వర్తిస్తుంది కదా!
బీజేపీ ప్రభుత్వానికి అంతర్గతంగా కొన్ని నినాదాలున్నాయి. అవేమంటే ”హిందుత్వాన్ని ప్రేమించలేని వాడు భారత దేశాన్ని ఎలా ప్రేమించగలడూ?” అని! ”జై శ్రీరామ్‌ అనని వాళ్లంతా పాకిస్థాన్‌ వెళ్ళిపోవాలి”- అని! ”రోగాన్ని ప్రేమించలేని వాడు శరీరాన్ని ఎలా ప్రేమించగలడూ” – అన్నట్టుగా ఉంది వీరి నినాదం. హిందూ, ముస్లిం, క్రైస్తవం లాంటి మతాలన్నీ ”ధర్మవ్యాధులే”. ఇందులో హిందూ ధర్మ వ్యాధిని భారత దేశ ప్రజలకు అంటించిన తొలి పేషెంట్‌ – నరేంద్ర మోడీ. ఈయన ఈ దేశ ప్రజలు ధర్మవ్యాధిని వ్యాప్తి చేయడానికి ప్రధాని గా చేశారా? లేక పరిపాలన చెయ్యమనా? దేశాన్ని దేశంగానే ప్రేమిం చాలి. అందుకోసం ఏదో ఒక ధర్మవ్యాధిని అంటగట్టుకోవల్సిన పనిలేదు. శరీరం వ్యాధిగ్రస్తమయితే ఏం చేస్తాం? చికిత్స చేయించుకుని ఆ వ్యాధిని వదిలించుకుంటాం, కనీసం తగ్గించు కుంటాం. అందువల్ల మతానికీ, దేశానికీ తేడా తెలియని వారు వెంటనే మానసిక చికిత్స చేయించు కోవాలి. దేశం వేరు, మతం వేరు అనేది తెలుసుకోగలగాలి. ప్రపంచంలో ఏ దేశమూ ఏ ఒక్క మతానికీ స్వంతం కాదు కొంచెం ఎక్కువ తక్కువ లుగా ప్రస్తుతం అన్ని మతాల వారు అన్ని దేశాల్లోకి వలస వెళ్ళారు.
మన భారతదేశపు ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ శతాబ్దాలుగా ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృ తులు సమ్మిళితమై ఉన్నాయి. ”మానసిక రోగులు’ ముందు ఆ విషయం గ్రహించుకోవాలి! ఈó భూమి, ఈ దేశం ఎవరో తయారు చేసింది కాదు. ఎవరి స్వంత ఆస్తో కాదు. ఇది అందరిది! ఇక విశ్వాసాలు, మతాలూ అంటారా? అవి వ్యక్తిగతంగానే ఉండాలి. ప్రతి ఒక్కరికీ ఆ స్వేచ్ఛ ఉంది. ఈ భూమి జనాన్ని విడదీయడం లేదు. ఈ భూమ్మీద మనిషి ఎప్పుడో ఒకప్పుడు అనాగరిక యుగంలో ఏర్పరుచుకున్న విశ్వాసాలు – ఇప్పుడు జనాన్ని విడగొడుతున్నాయి! అందులోనూ అధికారంలో ఉన్నవారు ముర్ఖంగా మతాన్ని ఉరేగిస్తూ, తాము ఉరేగుతున్నారు. అందుకు ఈ దేశ ప్రజలు ససేమిరా ఒప్పుకోవడం లేదు.
ఈ దేశంలోని మూలవాసులే కొంత కొంత మంది కాలక్రమంలో ముస్లింలుగా, క్రైస్తవులుగా మారారు. తప్పిస్తే, ఇక్కడ ఆ మతాలకు మూలాలు లేవన్నది నిజం. బౌద్ధులుగా ఉన్న ఈ దేశ మూలవాసుల్ని బలవంతంగా శంకరాచార్యులు. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వగైరాలంతా కలిసి వారి వారి కాలాలలో వైదిక మతస్తులుగా మార్చారన్నది నిజం! అందుకు అన్ని ఆధారాలూ ఉన్నాయి. ఇక ఇప్పుడు అన్ని మతాల వారు కలిసి మెలిసి శతాబ్దాలుగా సహజీవనం చేస్తూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒక మిశ్రమ భారతీయ సంస్కృతిని అభివృద్ధి చేసుకున్న దశలో – ఎవడో వచ్చి, ఇది ‘హిందూ దేశం’ అని అంటే కుదరదు. ఈ దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు ఇంకా అనేకానేక మతాల వారు అందరూ ఈ దేశ మూలవాసులే!
లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్లి జీవ పరిణామ దశలు గమనిస్తే, పెద్ద ఎత్తున జరిగిన మానవ వనరుల విషయం క్షుణ్ణంగా గ్రహిస్తే, ఈ దేశానికి అందరి కందరూ వలస వచ్చిన వారే అయితే తొలుత వచ్చిన ఎన్నో మానవ జాతుల్లోంచి లక్షల సంవత్సరాల కాలంలో హోమోసెవియన్లు విడివడి, క్రమంగా నాగరికతను ఏర్పరుచుకుంటూ వచ్చారు. వ్యవసాయం అభివృద్ధి చేసుకుని ప్రశాంతంగా జీవించారు. వారే ఈ దేశ మూలవాసులు. ఆ సమయంలో గుర్రాల మీద వలస వచ్చిన వారు బ్రాహ్మణార్యులు. వారు, తమ ఆధిక్యతను చాటుకోవడానికి తమను భగవంతుడి స్థానంలో నిలుపుకున్నారు. మిగతా వారిని కుల సంస్కృతి ప్రకారం నిచ్చనమెట్ల వ్యవస్థగా విభజించారు. మూల వాసులు ఈ విషయం క్షుణ్ణంగా అవగతం చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ – మూలవాసులంతా వైదిక మత ఆచారాలను అనుకరిస్తూ అదే గొప్ప సంస్కృతి, అదే గొప్ప సంప్రదాయం అనే భ్రమలో ఉండకూడదు. వారిని బానిసల్లా తొక్కి పెట్టడానికి హైందవమెంత క్రూరంగా ప్రవర్తించిందో తెలుసుకోవాలి. ప్రపంచానికి తొలిసారి భౌతిక వాదాన్ని వివరించిన వారు మన చార్వాకులు. వారేం చెప్పారో తెలుసుకోరు. ఆ తర్వాత వచ్చిన బౌద్ధం, జైనం సూచించిన జీవన విధానం గూర్చి తెలుసుకోరు. వీటన్నిటినీ నాశనం చేస్తూ దౌర్జన్యంగా వచ్చి పెత్తనం చెలాయి ంచిందే వైదిక మతం కదా? తర్కబద్దమైన, మానవీయ విలువలతో కూడిన చార్వాకాన్ని, బౌద్ధాన్ని, వదిలేసి మూర్ఖ పండితులు రూపొందించిన హైందవాన్ని అనుకరించడం విచారకరం. తాము గొప్ప దైవ శక్తులమై పొయ్యామ నుకోవడమంత హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదు. అయితే మూలవాసులు ఈ విషయం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. వివేకవంతుడెప్పుడూ మనువాద సంస్కృతిని, బ్రాహ్మణిజాన్ని సమర్థించడు.
సరే, అ విషయాలు అలా ఉండనిచ్చి మనువాదం పునాదులుగా గల బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం చెపుతూ ఉందో చూద్దాం! వారి మాటల వెనుక ఎంత నిజాయితీ ఉందో పరిశీలిద్దాం! కాంగ్రెస్‌ వారు, ఇతర ప్రతిపక్షాల వారు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని మోడీ గొంతు చించుకుంటూ ఉంటాడు కదా? తను కూర్చున్న కుర్చీ అడుగున ఎన్ని గోతులున్నాయో, ఆ గోతుల్లో ఎన్నెన్ని కుటుంబాలున్నాయో ఏ మాత్రం చూసుకోడు. తమ బీజేపీ కుటుంబాల వైపు లేదా భాగస్వాములైన ఎన్డీయే కూటమి కుటుంబాల వైపు చూసుకుంటే కుటుంబ రాజకీయాలంటే ఏమిటో తెలిసొచ్చేది. ఉదాహరణకు మనమిక్కడ కొన్ని కుటుంబాల గురించి చూద్దాం. ఏం? ఇవి కుటుంబ రాకీయాలూ వారసత్వ రాజకీయాలూ కావా? – ప్రణిత్‌ కౌర్‌: పంజాబ్‌ మాజీ సీఎం, అమరిందర్‌ సింగ్‌ భార్య – బన్సురీ స్వరాజ్‌: సుష్మా స్వరాజ్‌ కుమార్తె – సీతా సోరెన్‌ : జేఎంఎం నేత శిబుసోరెన్‌ కోడలు – గీతా కోడా: జార్ఖండ్‌ మాజీ సీఎం మధుకోడా భార్య – జ్యోతి మిర్థా : మాజీ ఎంపీ నాథూరామ్‌ మిర్థా మనుమరాలు- గాయత్రి సిద్ధేశ్వర: కేంద్ర మాజీ మంత్రి జీఎం సిద్దేశ్వర భార్య – నవనీత్‌ రాణా: మాజీ ఎమ్మెల్యే రవి రాణా భార్య – మాళవికా దేవి. మాజీ ఎంపీ అర్య కేసరి దేవ్‌ భార్య – కృతిసింగ్‌ దేవ్‌ వర్మ: త్రిప్రామోరా పార్టీ వ్యవస్థాపకుడు ప్రద్యోత్‌ కిషోర్‌ – మాణిక్య దేవ్‌ వర్మ సోదరి: పురంధరేశ్వరి, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమార్తె. ఇవి కొన్ని మాత్రమే – వీళ్ళంతా ఎన్డీయే భాగస్వాములు – బీజేపీ ప్రభుత్వంతో భుజం భుజం రాసుకుని తిరిగేవారు – మోడీ, షాలకు ఎందుకో తమ చుట్టూ ఉన్నవారు కనబడరు. తమకు ఉన్న కంటి దోషం బాగు చేయించుకోరు.
ఈ మధ్య తనే ఏర్పాటు చేసుకున్న ఇంటర్వూలలో మోడీ చిత్ర విచిత్రమైన విషయాలు చెపుతున్నాడు. తన తల్లి బతికి ఉన్నంత కాలం తను ఆమె కుమారుడనేనని అనుకున్నాడట. ఆమె మరణించిన తర్వాత, తనకు ఒక బలమైన విశ్వాసం కలిగిందట. అదేమంటే, ఆభగవంతుడే తనను నేరుగా ఈ భూమ్మీదికి అంటే ఈ దేశానికి పంపించాడనీ! తనతో ఏవేవో సత్కార్యాలు చేయిస్తున్నాడనీ అనిపిస్తోందట! కని పెంచిన తల్లి విలువను తగ్గించి, కనపడని దేవుని మహిమకు ప్రాధాన్యమిచ్చే వాడికి అసలు మనిషికి ఉండే విలువ ఉంటుందా? సీరియస్‌గా ఆలోచించవల్సిన విషయం! ఏమైనా ఇట్లాంటి మాటలతో ఈయన మోడీబాబా అయిపొయ్యాడు. ఇలాంటి వెర్రిమాటలు చెప్పే దొంగబాబాలకు దేశంలో కొదువలేదు. వాళ్లలో కొందరు కటకటాల పాలయ్యారు కూడా! ఈయన ఆ దారిలోనే నడుస్తున్నాడేమోననే అనుమానం ఈ దేశ ప్రజలకు కలుగుతోంది. ”వారిపై వారికి అంత విశ్వాసం ఉంటుందంటే, అది కేవలం వారి ముఢత్వం వల్లనే” నని అన్నాడు జర్మన్‌ రచయిత ఫ్రాంజ్‌ కాఫ్కా తన రచన ‘ద ట్రయల్‌’ లో ఒక చోట.
దేశ ప్రధానిని విమర్శించొచ్చా? అని కొందరు ఆందోళన పడుతుంటారు. నిజమే కానీ – ఎప్పుడూ? ఆయన ఆ స్థానానికి, ఆ పదవికి గౌెరవమిస్తూ మాట్లాడినప్పుడు, వ్యవహరించినప్పుడు కదా? ఆయనకు ఆ గౌరవం దక్కేదీ? ఆయనే తన పదవిని స్థాయిని మరిచినప్పుడు, రాజ్యాంగాన్ని అతిక్రమించినప్పుడు – ఆయనను విమర్శించే హక్కు ఆయనే ఇతరులకు ఇచ్చినట్టవుతుంది. – పైగా, ఎలక్షన్‌ కాలంలో ఆయన ఒక అభ్యర్థి మాత్రమే! పూర్తి స్థాయి ప్రధాని కాదు. ప్రధాని అయినంత మాత్రాన అధికారాలు ఉంటాయి కానీ, సామాన్య పౌరుడి కన్నా అధికంగా హక్కులేవీ ఉండవు. పరిపాలన మీద దృష్టి పెట్టలేని వాడు అధికారాన్ని దుర్వినియోగమే బాగా చేయగలడని నిరూపించాడు కూడా! అందువల్ల, విమర్శలకు అతీతుడుగా ఎలా ఉండగలడూ? ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాస్వా మ్యాన్ని పరిరక్షించినందువల్లనే కదా ఒక పేదింటి చారువాలా దేశ ప్రధాని అయ్యాడూ? గతంలో దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రధానులున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారేమిచ్చారూ? ఆలోచించుకునే పనిలేదా? వారణాసి ఎలక్షన్‌ ర్యాలీలో బీజేపీ నేత సంబిత్‌ పాత్ర – ‘పూరీ జగన్నాధుడు మోడీజీ భక్తుడని – ఒళ్లు తెలియకుండా ప్రసంగిం చాడు. తర్వాత మీడియా ముందుకొచ్చి తను ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడానని – విషయం రివర్స్‌లో చెప్పానని క్షమాపణలు కోరాడు. ఆ దేవుడిని ఆ దేశ ప్రజల్నీ బతిమిలాడుకున్నాడు. బీజేపీ నేతల మాటలూ చేతలూ ఇలా రివర్స్‌లోనే ఉంటాయి.
మోడి విదేశాలకు వెళ్లినా, విదేశీ నాయకులు ఈ దేశం వచ్చినా కొన్ని విషయాలు తప్పకుండా ఉంటాయి.! 1. ఇరు నాయకులు షేక్‌హాండ్‌ ఇచ్చుకోవడం 2. కౌగిలించుకోవడం. 3. పార్క్‌లు తిరగడం. 4. ఇవన్నీ ఫొటోలు తీయించుకోవడం – ఏ దేశంతో ఏ ఒప్పందమైందో, ఆ ఎగ్రిమెంట్‌లో ఏమి రాసి ఉందో – ఈ ఆరోతరగతి డ్రాపవుట్‌ అవినీతి రాజాకు (క్రేజీవాల్‌ ఇచ్చిన బిరుదు) తెలియదు. అందువల్ల మోడీ దేశాన్ని ఎలాంటి ప్రమాదస్థితిలోకి నెట్టాడో ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి! మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలి!! రాబోయే కొత్త ప్రభుత్వం మోడీ దోచుకున్నదంతా కక్కించాలి – దాన్ని దేశాబివృద్ధికి ఖర్చు చేయాలి. ఈ అబద్దాల ప్రభుత్వం పోయి, నిజాల ప్రభుత్వం – నిజాయితీ గల ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశిద్ధాం!! అచ్చేదిన్‌ వచ్చేది అప్పుడే.
– కేంద్ర సాహిత్య అకాడమీ విజేత, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌ : (మెల్బోర్న్‌ నుంచి)
డాక్టర్‌ దేవరాజు మహారాజు