మహిళలను మోసం చేసిన మోడీ

Modi cheated women– ఇప్పటికిప్పుడు బిల్లును అమలు చేయొచ్చు
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ బి. వినోద్‌కుమార్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
మహిళలను ప్రధాని మోడీ మోసం చేశారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. గురువారం హన్మకొండలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ మహిళా బిల్లును ప్రవేశపెడితే మహిళలందరూ లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో రిజర్వేషన్లు వెంటనే దక్కుతాయని ఆశించారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే క్లాస్‌ 5లో మార్పులు చేసి ఇప్పటికిప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేయొచ్చని, ఒక న్యాయవాదిగా ఈ విషయం చెబుతున్నానని తెలిపారు. 2002లో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ.. ఆర్టికల్‌ 82, 170 ప్రకారం 2026లోపు నియోజకవర్గాల పునర్విభజనకు వీలు లేదన్నారు. 2031 జనాభా లెక్కలు పూర్తయ్యాకే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్నారు. అంటే 2039 ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు దక్కుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రవేశపెట్టిన అనంతరం తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 34, ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 50కి పెరగాల్సి ఉండగా, ఆ బిల్లులో ‘నాట్‌ విత్‌ స్టాండింగ్‌’ అనే పదాన్ని చేర్చకపోవడం వల్ల లోక్‌సభ స్థానాలు పెరగలేదని తెలిపారు.
ఈ విషయంపై సీఎం కేసీఆర్‌తోపాటు ఎంపీలందరం ప్రధాని మోడీని కలిసినా ఆయన స్పందించలేదన్నారు. పార్లమెంట్‌ వ్యవహారాల్లో మోడీ కొత్త పద్ధతి అవలంబించారని, ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ఏ విషయంపై పెడుతున్నారో ప్రకటించకుండా 15 రోజుల క్రితం మంత్రి ప్రహ్లాద్‌ జోషి ట్విట్టర్‌లో ట్వీట్‌ చేయడాన్ని తప్పుపట్టారు. అంతేకాదు, క్యాబినెట్‌లో మహిళా బిల్లుపై నిర్ణయం తీసుకున్నా ఆ విషయాన్ని ప్రకటించకుండా మళ్లీ ట్విట్టర్‌లోనే ట్వీట్‌ చేశారన్నారు. జమిలి ఎన్నికల పేరిట వేసిన కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను చైర్మెన్‌గా నియమించారని, ఇప్పటి వరకు ఎలాంటి కమిటీలకు మాజీ రాష్ట్రపతులను చైర్మెన్లుగా నియమించలేదని తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఎంపీలందరూ మద్దతివ్వడం శుభపరిణామమన్నారు. దేశంలో మొదట మహిళా పాలకురాలు రజియా భేగం అని చెబుతుంటారని, కాని, కాకతీయ రాణి రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించారని గుర్తుచేశారు. విలేకరుల సమావేశంలో ఛీఫ్‌ విప్‌ దాస్యం వినరుభాస్కర్‌, కుడా చైర్మెన్‌ సుందర్‌రాజ్‌ యాదవ్‌, గ్రంధాలయ సంస్థ చైర్మెన్‌ అజీజ్‌ఖాన్‌, కార్పొరేటర్‌ ఇండ్ల నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
నవంబర్‌ 19, 20, 21 తేదీల్లో హన్మకొండలో తపాల ఉద్యోగుల జాతీయ మహాసభలు
హన్మకొండలో నవంబర్‌ 19 నుంచి 21వ తేదీ వరకు మూడ్రోజులపాటు 12వ ఆలిండియా గ్రామీణ తపాల ఉద్యోగుల సంఘం జాతీయ మహాసభలు జరుగనున్నాయని, ఈ సభలను విజయవంతం చేయాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, మహాసభల ఆహ్వానసంఘం చైర్మెన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఛీఫ్‌ విప్‌, ఆహ్వానసంఘం వైస్‌చైర్మెన్‌ దాస్యం వినరుభాస్కర్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి గ్రామీణ తపాల ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. దేశంలో 3 లక్షల మంది గ్రామీణ తపాల ఉద్యోగులున్నారని, వీరంతా సుమారు 8-10 గంటల మేరకు పనిచేస్తున్నారని, వీరిపై తీవ్రమైన పనిభారం పడుతుందన్నారు. 25 ఏండ్ల క్రితం నుండే పోస్టల్‌ శాఖను నిర్వీర్యం చేయడం ప్రారంభమైందన్నారు. తాను ఎంపీగా ఉన్న సందర్భంలో పార్లమెంట్‌లో పలుమార్లు గ్రామీణ పోస్టల్‌ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం మాట్లాడానని, అప్పట్లో కేరళ ఎంపీగా ఉన్న ప్రేమ్‌చందర్‌ వీరి సమస్యలపై ప్రధానంగా చర్చించేవారని తెలిపారు. పోస్టాఫీసును పోస్టల్‌ బ్యాంకులుగా మార్చిన ఈ తరుణంలో పోస్టల్‌ వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఈ మహాసభల్లో పాల్గొనడానికి 3 వేల మంది ప్రతినిధులు రానున్నారన్నారు. విలేకరుల సమావేశంలో గ్రామీణ తపాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బి. జయరాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మర్రి కొమురారెడ్డి, హన్మకొండ డివిజన్‌ కార్యదర్శి బొద్దున వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.