‘వైద్యారోగ్యం’లో మోడీ విఫలం

Modi failed in 'health care'– లక్ష్యాన్ని చేరని హామీలు
– పీఎంజేఏవైలో ప్రభుత్వ ఆస్పత్రుల పని తీరు దారుణం
– ప్రజలపై పడుతున్న ఆరోగ్య ఖర్చులు
– కొత్త వైద్య కళాశాలల్లో సిబ్బంది కొరత
– చిన్నారుల్లో పోషకాహార లోపం
– కేంద్రం తీరుపై సామాజిక కార్యకర్తలు, ఆరోగ్య నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ : మోడీ దశాబ్దకాలం పాలనలో భారత్‌ వైద్యారోగ్య రంగంలో బీజేపీ విఫలమైంది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ వైద్యారోగ్య రంగానికి సంబంధించి పలు వాగ్దానాలను చేసింది. అయితే, ఇందులో కొన్ని హామీలైతే ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. మరికొన్ని అమలుకు నోచుకున్నా.. అది కూడా సగం వరకు కావటమే గమనార్హం. దీంతో ఈ రంగంలో మోడీ సర్కారు విఫలమైందనీ, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ భారత్‌ కోసం ఒక కొత్త ఆరోగ్య విధానాన్ని రూపొందిస్తామనీ, దేశంలో సార్వత్రిక ఆరోగ్య కవరేజీని నిర్ధారించటానికి జాతీయ ఆరోగ్య హామీ మిషన్‌ను ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. 2017లో ఇది నేషనల్‌ హెల్త్‌ పాలసీని రూపొందించింది. ఇది ప్రభుత్వ ఆస్పత్రులపై దృష్టి సారించిన పబ్లిక్‌ హెల్త్‌కేర్‌ మోడల్‌ నుంచి బీమా ఆధారిత మోడల్‌కు మారటాన్ని సూచిస్తుంది.
పీఎంజేఏవై అమలు పేలవం
2018 నుంచి ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన(పీఎంజేఏవై) కింద ప్రతి కుటుంబానికీ ఏడాదికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమాను అందిస్తున్నది. ఈ పథకం కింద ఎంప్యానెల్‌ చేయబడిన ప్రయివేటు ఆస్పత్రులు ప్రభుత్వ ఆస్పత్రుల కంటే తక్కువ రోగులను చేర్చుకుంటున్నాయని ఒక విశ్లేషణలో తేలింది. కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో బీమా పథకం అందించటంలో కూడా కేంద్రం విఫలమైంది. కేవలం 11.9 శాతం మంది అర్హులైన రోగులు ఆస్పపత్రిలో చేరినప్పుడు ఉచిత చికిత్స పొందారు. జాతీయ ఆరోగ్య విధానంలో భాగంగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కంటే విస్తృతమైన సేవలను అందించటానికి ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 1.5 లక్షల కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఆరోగ్య ఖర్చు.. జనం జేబులకు చిల్లు
2017 జాతీయ ఆరోగ్య విధానం.. ప్రజారోగ్యంపై మొత్తం ప్రభుత్వ వ్యయం జీడీపీలో కనీసం 2.5 శాతం ఉండాలని సిఫారసు చేసింది. 2014-15లో జీడీపీలో 1.13 శాతం నుంచి ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం 2022-23లో 2.1 శాతానికి పెరిగింది. అయితే, ఈ కాలంలో కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కేటాయించిన వాటా 1.9 శాతం వద్ద అలాగే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం.. ఘనా, భూటాన్‌, ఇండోనేషియా, మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాల కంటే ప్రస్తుత ఆరోగ్య వ్యయంలో భారతదేశ ప్రజలు తమ జేబులో నుంచి ఎక్కువ ఖర్చు చేస్తుండటం గమనార్హం. ఆరోగ్యం కోసం రోగులు భరించే ఖర్చు 2019-21లో రూ. 2,916గా ఉన్నది.
ఎయిమ్స్‌లో పరిమిత సేవలు
2014లో, ప్రతి రాష్ట్రంలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఏయిమ్స్‌)ను ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. గత దశాబ్ద కాలంలో మోడీ ప్రభుత్వం 15 కొత్త ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసింది. అయితే చాలా మంది ఔట్‌ పేషెంట్‌, ఇన్‌ పేషెంట్‌ విభాగాల్లో పరిమిత సేవలతో పనిచేస్తుండటం గమనార్హం.
వైద్య కళాశాలల్లో సిబ్బంది కొరత
2014లో, భారతదేశంలో 806 జిల్లాలకు 387 వైద్య కళాశాలలు ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం వైద్య కళాశాలల సంఖ్యను 706కు పెంచింది. కానీ చాలా కొత్త కళాశాలల్లో వైద్యులు, ఇతర సిబ్బంది లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 2022-23లో, నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎంసీ) సర్వే చేసిన మొత్తం 246 మెడికల్‌ కాలేజీలలో 50 శాతం మంది ఉపాధ్యాయుల హాజరు లేకపోవటం గమనార్హం.
పోషకాహార లోపంలో చిన్నారులు
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) ప్రకారం.. కొన్ని పోషకాహార లోప సూచికల విషయంలో గత దశాబ్దంలో భారతీయ పిల్లల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నది. 2015-16 సర్వేలో, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో, 7.5 శాతం మంది వారి ఎత్తుకు తక్కువ బరువు కలిగి ఉన్నారు. ఇది 2019-21 నాటికి 7.7 శాతానికి పెరిగింది. అదే వయస్సులో, ఊబకాయం సంభవం అదే కాలంలో 2.1 శాతం నుంచి 3.4 శాతానికి పెరిగటం గమనార్హం. వయస్సులో తక్కువ ఎత్తు కలిగి ఉన్న పిల్లల సంఖ్య 2019-21లో 35.5 శాతంగా ఉన్నది.
డయేరియా హామీ పెండింగ్‌.. ‘టీబీ’ లక్ష్యం అందుకోలే
డయేరియాను అంతం చేస్తామన్న బీజేపీ వాగ్దానం పెండింగ్‌లో ఉన్నది. 2019-20లో సర్వే చేయబడిన పిల్లలలో దాదాపు 8 శాతం మంది ఆ సంవత్సరం వ్యాధితో బాధపడుతున్నారు. బీజేపీ 2014 మేనిఫెస్టోలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన జాతీయ దోమల నియంత్రణ మిషన్‌ ఇంకా ప్రారంభం కాకపోవటం గమనార్హం. 2019 మ్యానిఫెస్టోలో క్షయవ్యాధిని నిర్మూలిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీని కోసం, భారత్‌ టీబీ వ్యాప్తిని ప్రతి పది లక్షల జనాభాకు ఒక కేసుకు తగ్గించాలి. భారత్‌లో ప్రస్తుతం లక్ష జనాభాకు 188 కేసులు ఉండటం గమనార్హం. 2020లో టీబీ వల్ల 4.93 లక్షల మంది భారతీయులు మరణించారని అంచనాలు ఉన్నాయి. అయితే, మోడీ సర్కారు వైద్య, ఆరోగ్య విషయంలో తన మ్యానిఫెస్టో అమలును పూర్తిగా చేయకుండా విఫలమైందని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.