– అంతర్జాతీయ వేదికలపై సొంత ప్రచారం
– పొరుగు దేశాలతో బెడిసికొడుతున్న సంబంధాలు
దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తానని, భారత్‌ను బహుళ ధృవ ప్రపంచ క్రమంలో ప్రభావం చూపే స్థాయికి తీసికెళతానని 2014 ఎన్నికల ప్రణాళికలో బీజేపీ హామీ ఇచ్చింది. విదేశాంగ విధానం గురించి మ్యానిఫెస్టోలో ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రాంతీయ అభివృద్ధికి దక్షిణాసియాలో రాజకీయ సుస్థిరత, శాంతి అవసరమని నొక్కి చెప్పింది. అయితే బీజేపీ మాటలకు, చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదని గత దశాబ్ద కాలంగా జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఎందుకంటే ఈ కాలంలో అనేక పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశాంగ విధానంలో దూకుడుగా, దుందుడుకుగా వ్యవహరిస్తోంది. స్వీయ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఫలితంగా పొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మాజీ దౌత్యవేత్త ఎస్. జయశంకర్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండీ విదేశాంగ విధానంలో మార్పు కన్పిస్తోంది. మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు తరచుగా ప్రపంచంలో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడుతున్నారు. తద్వారా హిందువులకు తానే ఏకైక ప్రతినిధినని అంతర్జాతీయ సమాజం భావించాలని ఆయన కోరుకుంటున్నారు. ఇదంతా విదేశాంగ విధానంలో హిందూత్వను భాగం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం
2015లో ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఉభయ దేశాల మధ్య తొలుత శాంతి పవనాలు వీచినప్పటికీ ఆ తర్వాత సీమాంతర ఉగ్రవాదం కారణంగా సైనిక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370లోని నిబంధనలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీశాయి. ఇక నేపాల్‌తో భారత్ సంబంధాలు కూడా అంత సజావుగా లేవు. మన దేశంతో సాంస్కృతిక సంబంధాలు ఉన్న మాధేసీ జాతి వారి సమస్యలను నేపాల్ నూతన రాజ్యాంగ ముసాయిదా ఏ మాత్రం పట్టించుకోలేదు. రాజపక్స కుటుంబ పాలనలో శ్రీలంక మన దేశానికి దూరమైపోయింది. మాల్దీవులలో తొలుత అబ్దుల్లా యమీన్, ప్రస్తుతం మహమ్మద్ ముయిజూ అధికారంలో ఉన్నారు. ఈ ఇద్దరితోనూ మనకు సత్సంబంధాలు లేవు. మయన్మార్‌లో జరిగిన కుట్ర, 2021లో ఆఫ్ఘనిస్తాన్‌పై తాలిబాన్ల ఆధిపత్యం… ఈ రెండు పరిణామాలూ భారత్‌కు ఎదురు దెబ్బగానే భావించవచ్చు. ఒక్క బంగ్లాదేశ్‌తో మాత్రమే ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా సాగుతున్నాయి.
2014 నుండి సార్క్ సమావేశమే లేదు
దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ (సార్క్)ను బలోపేతం చేస్తానని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. అయితే పాకిస్తాన్‌తో నెలకొన్న ఘర్షణ వైఖరి కారణంగా ఈ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. 2014 నుండి సార్క్ నేతల సమావేశమే జరగలేదు. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం సార్క్ లక్ష్యాల సాధనకు కృషి చేసింది. వివిధ రంగాలలో సాంకేతిక, ఆర్థిక సహకారం కోసం పాకిస్తాన్ మినహా మిగిలిన అన్ని సార్క్ సభ్య దేశాలు ఓ ప్రాంతీయ వేదికగా ఏర్పడడం సానుకూల పరిణామం.
చైనాతో ఉద్రిక్తతలు
మోడీ తన తొలి ప్రభుత్వ హయాంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో వ్యక్తిగత దౌత్యం నెరపినప్పటికీ ఫలితం మాత్రం చేకూరలేదు. తొలుత రెండు దేశాల మధ్య సైనికపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అవి 2020-21లో వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణలకు దారితీశాయి. నలభై ఐదు సంవత్సరాలలో భారత సైనికులు మరణించడం అదే మొదటిసారి. వివాదాస్పద అంశాలపై నేటి వరకూ రెండు దేశాల మధ్య పూర్తి ఏకాభిప్రాయం సాధ్యపడలేదు.
అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం
భారత్, అమెరికా దేశాలు చైనాను ఉమ్మడి శతృవుగా పరిగణిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడింది. ఖాద్ దేశాలైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన భద్రతాపరమైన చర్చలు ఓ కీలక వేదిక ఏర్పడడానికి కారణమయ్యాయి. ఆగేయాసియా దేశాల సంఘంతో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని మోడీ ప్రభుత్వం కోరుకుంది. బీజేపీ 2019లో తన ఎన్నికల ప్రణాళికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆగేయాసియాలో చైనా ప్రాబల్యానికి గండి కొట్టి, దాని ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరమున్నదని తెలిపింది.
కెనడాతో దెబ్బతిన్న సంబంధాలు
ఖలిస్థాన్ మద్దతుదారులను కెనడా అణచివేస్తోందని భారత్ చేసిన ఆరోపణతో రెండు దేశాల మధ్య సంబంధాలకు విఘాతం ఏర్పడింది. తన ఆంతరంగిక రాజకీయాలలో భారత్ జోక్యం చేసుకుంటోందని అటు కెనడా కూడా ఆరోపణలు చేసింది. తన భూభాగంలో జరిగిన సిక్కు వేర్పాటువాద నాయకుడి హత్య వెనుక భారత్ హస్తం ఉన్నదని కెనడా చేసిన ఆరోపణతో గత సంవత్సరం ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఓ పథకం ప్రకారం జరుగుతున్న హత్యల వెనుక ఉన్న కుట్రలో ఈ ఘటన కూడా భాగమేనని అమెరికా ఆరోపించింది. న్యూయార్క్‌లో కూడా ఇలాంటి హత్యే జరిగిందని చెప్పింది. దీంతో భారత్, అమెరికా మధ్య కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతర్జాతీయ వేదికలపై సొంత ప్రచారం బ్రిక్స్, జీ-20 వంటి వివిధ దేశాలతో కూడిన వేదికలతో సహకారాన్ని పెంపొందించుకుంటానని 2014 ఎన్నికల ప్రణాళికలో బీజేపీ చెప్పుకొచ్చింది. గత సంవత్సరం న్యూఢిల్లీలో జీ-20 సదస్సు జరిగింది. దీనిని ప్రధాని మోడీ తన అనుకూల ప్రచారానికి వేదికగా ఉపయోగిం చుకున్నారు. బ్రిక్స్ దేశాధినేతల మావేశంలోనూ ఇదే తీరు.