ఆయుధాల సరఫరాను మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

– వామపక్ష పార్టీల డిమాండ్‌
– హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమం
– ఇజ్రాయిల్‌ దాడులతో మానవాళి వినాశనం : బి వెంకట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అమెరికా సామ్రాజ్యవాదం అండతో ఇజ్రాయిల్‌ గత కొన్ని నెలలుగా పాలస్తీనాలోని గాజా, రఫా ప్రాంతాలపై సాగిస్తున్న దాడులు, మారణహోమాన్ని తక్షణమే ఆపాలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. పాలస్తీనా భూభాగంపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించాయి. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దారుణ హత్యాకాండను వ్యతిరేకిస్తూ శనివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ‘స్వతంత్ర పాలస్తీనా కోసం చర్యలు చేపట్టాలి, ఇజ్రాయిల్‌కు భారత్‌ ఆయుధాల ఎగుమతిని నిలిపేయాలి, రఫా నగరంపై ఇజ్రాయిల్‌ దాడులను ఆపాలి’ అంటూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. ‘ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, సేవ్‌ పాలస్తీనా, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి, ఇజ్రాయిల్‌ దాడులను తక్షణమే ఆపాలి’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహారావు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇజ్రాయిల్‌ దాడులతో మానవాళి వినాశనం : బి వెంకట్‌
అమెరికా సామ్రాజ్యవాదం అండతో ఇజ్రాయిల్‌ చేస్తున్న దుర్మార్గాలు ప్రపంచ మానవాళికి వినాశనంగా మారాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్‌ చెప్పారు. పాలస్తీనాపై దాడులను ఆపాలంటూ ఐక్యరాజ్య సమితి నాలుగు సార్లు తీర్మానం చేసినా ఇజ్రాయిల్‌ పట్టించుకోలేదన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేసిందని అన్నారు. ఆయుధాలను అమ్ముకునేందుకు అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాల మధ్య యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నదని విమర్శించారు.
అందులో భాగంగానే పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులకు పాల్పడుతున్నదని చెప్పారు. ఇజ్రాయిల్‌కు ఎలాంటి సహకారం అందించొద్దంటూ అమెరికా సహా అన్ని దేశాల్లోని విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. ఇది పాలస్తీనా మీద జరుగుతున్న దాడి కాదనీ, మానవాళి మీద, ప్రపంచ శాంతి మీద జరుగుతున్న దాడి అని అభివర్ణించారు. మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్‌కు డ్రోన్లు, ఆయుధాలను సరఫరా చేసి పరోక్షంగా ఆ యుద్ధంలో భాగస్వామిగా మారిందని విమర్శించారు. ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పాలస్తీనాకు ప్రపంచ ప్రజలంతా అండగా ఉండాలనీ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇజ్రాయిల్‌ దుర్మార్గాలకు వ్యతిరేకంగా విశాల ఉద్యమం : బాలమల్లేష్‌
పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌ బాలమల్లేష్‌ చెప్పారు. పాలస్తీనాపై అమెరికా సామ్రాజ్యవాదం అండతో సాగిస్తున్న దాడులను తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. వేలాది మంది చనిపోతున్నా, లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నా ఇజ్రాయిల్‌ యుద్ధాన్ని ఆపడం లేదన్నారు. కాల్పులను విరమించాలని ఐక్యరాజ్య సమితి చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇజ్రాయిల్‌కు మోడీ ప్రభుత్వం ఆయుధాల సరఫరాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
మోడీ ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్యవిరుద్ధం : హన్మేష్‌
ఇజ్రాయిల్‌కు మోడీ ప్రభుత్వం ఆయుధాలను సరఫరా చేయడం దుర్మార్గమని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర నాయకులు హన్మేష్‌ విమర్శించారు. ఈ చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించడం, ఆ జాతి లేకుండా చేయడం కోసమే ఇజ్రాయిల్‌ మారణకాండకు పాల్పడుతున్నదని చెప్పారు. 37 వేల మందిని చంపిందనీ, పిల్లలు నిద్రలోనే మరణిస్తున్నారని వివరించారు. ఇజ్రాయిల్‌ మానవత్వం లేకుండా వ్యవహరించడం సరైంది కాదన్నారు.
పాలస్తీనాను శ్మశానంగా మారుస్తున్న ఇజ్రాయిల్‌ : వెంకట్రామయ్య
పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు చేసి శ్మశానంగా మారుస్తున్నదని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య విమర్శించారు. పాలస్తీనాకు స్వతంత్ర దేశంగా పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.
లౌకిక విధానం నుంచి వైదొలగిన మోడీ ప్రభుత్వం : కె గోవర్ధన్‌
మోడీ ప్రభుత్వం లౌకికవిధానం నుంచి వైదొలగి ఇజ్రాయిల్‌కు సహకారం అందించడం దుర్మార్గమని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్ధన్‌ విమర్శించారు. పాలస్తీనాలో ఇజ్రాయిల్‌ సైన్యాలు వైదొలగాలని డిమాండ్‌ చేశారు. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్‌ మాట్లాడుతూ పాలస్తీనా మీద ఇజ్రాయిల్‌ దాడి ప్రపంచ మానవాళి మీద జరుగుతున్న దాడి అని అన్నారు.
దీన్ని వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర నాయకులు తేజ మాట్లాడుతూ ఇజ్రాయిల్‌కు మోడీ ప్రభుత్వం అందిస్తున్న ఆయుధాల సరఫరా, సహకారాన్ని ఉపసంహరిం చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టి సాగర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌, ఎం శ్రీనివాస్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ నాయకులు సూర్యం, ఎస్‌ఎల్‌ పద్మ, కేఎస్‌ ప్రదీప్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు ఎం శ్రీనివాస్‌, ఎంసీపీఐ(యూ) నాయకులు మైదంశెట్టి రమేష్‌, తుడుం అనిల్‌కుమార్‌, ఈ దశరథ్‌ నాయక్‌, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.