పెన్షన్‌ పెంచకుంటే మోడీ ప్రభుత్వాన్ని ఓడిస్తాం

Modi government will be defeated if pension is not increased– టీఏపీఆర్‌పీఏ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పెన్షన్‌ పెంచకపోతే కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఓడిస్తామని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ (టీఏపీఆర్‌పీఏ) ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి హెచ్చరించారు. టీఏపీఆర్‌పీఏ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌లోని బర్కత్‌పుర వద్ద రీజనల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు ”ఈపీఎస్‌ పెన్షనర్ల విద్రోహ దినం” పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ కనీస పెన్షన్‌ రూ.తొమ్మిది వేలు చెల్లించాలనీ, డీఏ జతచేయలనీ, వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. 74 లక్షల ఈపీఎస్‌ పెన్షనర్లలో 50 శాతం మందికి నెలకు రూ.వెయ్యిలోపు పెన్షన్‌తో దుర్భరమైన జీవితం గడపాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెన్షన్‌ పెంచని మోడీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం రీజనల్‌ పీఎఫ్‌ కమిషనర్‌ను కలిసి పెన్షనర్ల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఏపీఆర్‌పీఏ రాష్ట్ర నాయకులు ఎమ్‌ఎన్‌ రెడ్డి, పి నారాయణరెడ్డి, ఎన్‌ బ్రహ్మచారి, నరహరి, రాధాక్రిష్ణ, నర్సప్ప, విజరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.