రాజ్యాంగంపై మోడీ సర్కార్‌ దాడి

– దళితుల సామాజిక భద్రత నిర్వీర్యం :
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలనరసింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంపై మోడీ ప్రభుత్వం దాడి చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం బాలనరసింహ విమర్శించారు. దేశంలోని దళితుల ఆర్థిక స్థితిని, సామాజిక భద్రతను నిర్వీర్యం చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నదని చెప్పారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో రాజ్‌ బహదూర్‌గౌర్‌ హాల్‌లో బుధవారం అఖిల భారత దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమితి సమావేశాన్ని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజరత్నం అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన బాలనరసింహ మాట్లాడుతూ నాగ్‌పూర్‌ కేంద్రంగా రిజర్వేషన్‌ విధానాన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అందులోనే భాగంగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్‌ పరం చేస్తున్నారని చెప్పారు. దీంతో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు లేకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు.
దళిత, ఆదివాసీలను ఆర్థికంగా అణగదొక్కాలని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను కూడా రద్దు చేసిందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో అణగారిన వర్గాల వాటా ఏటా తగ్గుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తొమ్మిదేండ్ల మోడీ పాలనలో దేశవ్యాప్తంగా దళితులపై అసమానతలు, అణచివేతలు, వివక్ష, దాడులు, నేరాలు రెట్టింపయ్యాయని అన్నారు. బలమైన పోరాటాలు, ఉద్యమాలు ద్వారానే రాజ్యాంగాన్ని రక్షించుకుంటామనీ, దళితుల హక్కులు పరిరక్షించబడతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌ కుమార్‌ మారుపాక మాట్లాడుతూ వచ్చేనెల 20న హైదరాబాద్‌లో ‘దళితుల అభివృద్ధి-ప్రభుత్వాలు’అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తామని అన్నారు. దళితుల సమస్యల పరిష్కారానికి ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర నాయకులు కె యేసురత్నం, బి లక్ష్మీపతి, కె సహదేవ్‌, జె కుమారస్వామి, వై ఉషశ్రీ, కె రాములు తదితరులు పాల్గొన్నారు.