గిరిజనుల హక్కులపై మోడీ సర్కారు దాడి

గిరిజనుల హక్కులపై మోడీ సర్కారు దాడి– రాహుల్‌ గాంధీ
రారుపూర్‌ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ పదం అర్థాన్ని మార్చేసిం దని, వారి హక్కులపై దాడిచేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ జిల్లాలో శనివారం కాంగ్రెస్‌ అభ్యర్థి ఖవాసి లక్మాకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన మహిళ అయినందున అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమానికి రాకుండా అడ్డుకున్నారని, బీజేపీ మనస్తత్వానికి ఈ ఘటన అద్దం పడుతుందని అన్నారు. గిరిజనులను ఆదివాసీలని అందరూ పిలుస్తారని, మోడీ వనవాసి అని పిలుస్తున్నారని చెప్పారు. ఆదివాసీ అంటే నీరు, అడవి, భూమిపై హక్కులు కలిగి ఉంటారని, వనవాసి అంటే అడవుల్లో జీవించే వారనే అర్థమని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మతం, గిరిజనుల సిద్ధాంతాలు, చరిత్రపై దాడి చేస్తున్నాయని విమర్శించారు. గిరిజనుల భూములను బీజేపీ బిలియనీర్లకు కట్టబెడుతోందని అన్నారు. మోడీ పాలనలో 22 మంది వ్యాపారవేత్తలు 70 కోట్ల మంది భారతీయులకు సమానమైన సంపాదనను కూడబెట్టారని విమర్శించారు.