రైతులపై మోడీ ప్రభుత్వ దమననీతి : ప్రజాపంథా

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఢిల్లీలో రైతులపై మోడీ ప్రభుత్వం దమననీతిని ప్రదర్శించిందని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా విమర్శిం చింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగా రావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతాంగ పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలనీ, రుణాలు రద్దు చేయాలంటూ సంయుక్త కిసాన్‌ మోర్చాలోని కొన్ని సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయని తెలిపారు. హర్యానా, ఢిల్లీ పోలీసులు సరిహద్దులను దిగ్బంధనం చేసి రైతులను దేశ రాజధానికి రానీయకుండా నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వారిపై టియర్‌ గ్యాస్‌ వదలడం, రోడ్లకు సీలలు కొట్టడం, రోడ్లపై అడ్డుగోడలు కట్టడం సరైంది కాదని తెలిపారు. ఇది ఫాసిస్టు చర్య అని విమర్శించారు. రైతులతో చర్చించి వారి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నిర్బంధ చర్యలను విరమించుకోవాలని కోరారు. ఈనెల 16న గ్రామీణ బంద్‌, కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని సూచించారు.