దేశ రక్షణను మోడీ గాలికొదిలేశారు

దేశ రక్షణను మోడీ గాలికొదిలేశారు– ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాటం తప్పదు
– ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తేయాలి : ఇండియా కూటమి ధర్నాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దేశ రక్షణను ప్రధాని మోడీ గాలికొదిలేశారని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ క్రమంలో ఇండియా కూటమి తరపున ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని తెలిపారు. పార్లమెంటుపై అగంతకులు దాడి చేసిన అంశాన్ని లోక్‌సభలో చర్చించాలంటూ ప్రశ్నించిన ఎంపీలను మోడీ సర్కారు అప్రజాస్వామికంగా సస్పెండ్‌ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారి సస్పెన్షన్‌ను ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటుపై దాడి చేయడమంటే, ప్రజాస్వామ్యంపైన, రాజ్యాంగంపైన జరిగిన దాడిగానే భావించాలని చెప్పారు. పార్లమెంట్‌ను రక్షించుకోలేని బీజేపీ పాలకులు ఈ దేశాన్ని ఏం కాపాడుతారని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు పార్లమెంటులో ఇండియా కూటమి ఎంపీలను అప్రజాస్వామికంగా సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆ ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభలో సభ్యులు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వారిని సస్పెండ్‌ చేశారని విమర్శించారు. ఈ దాడితో ప్రపంచ దేశాల్లో భారత దేశ విలువ ఎంత దిగజారిందనేది ఆలోచించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13న పార్లమెంటుపై దాడి జరిగితే ఇప్పటి వరకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర మంత్రులు మౌనంగా ఉన్నారని విమర్శించారు. అసలేం దాడి జరగలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో కనీవిని ఎరగని విధంగా లోక్‌సభ నుంచి 146 మంది సభ్యులను సస్పెండ్‌ చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ప్రశ్నిస్తే కేసులు, పార్లమెంట్‌ నుంచి బహిష్కరణ… స్వేచ్ఛ, భావ ప్రకటన లేకుండా నియంతృత్వ పోకడలతో మోడీ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు దేశ సరిహద్దుల్లో ఏదో ఒక సంఘటన సృష్టించి దేశ ప్రజల్లో భావోధ్వేగాన్ని రగిలించి అధికారంలోకి రావడం తప్ప ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలనే ఆలోచన బీజేపీకి లేదన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షులు సోనియా, అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంక గాంధీ వంటి అగ్రనేతలు రోడ్లపైకి వచ్చి ఈ దేశం కోసం మేమున్నామంటూ భరోసా కల్పించారని తెలిపారు. మీ కోసం నిలబడతామంటూ వారు ప్రజలకు బాసటగా నిలుస్తున్న విషయాన్ని గుర్తించాలని కోరారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న పోరాటంలో దేశభక్తులు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇది అంబేద్కర్‌ గుండెపై దాడి మోడీ, అమిత్‌షాపై కూనంనేని ఆగ్రహం
పార్లమెంట్‌ మీద దాడి జరగడమంటే అంబేద్కర్‌ గుండెపైన దాడి జరిగినట్టేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. దాడికి కారణమేంటని ప్రశ్నిస్తే…మోడీ, అమిత్‌షా హిట్లర్‌, ముస్సోలినిలా ప్రవర్తించారని విమర్శించారు. పార్లమెంటుపై దాడికి పాల్పడిన అగంతకులకు బీజేపీ ఎంపీ పాస్‌ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన్ను ఏమైనా సస్పెండ్‌ చేశారా? అని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీని ఏం చేశారని ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారని నిలదీశారు. తృణముల్‌ ఎంపీ ప్రశ్నిస్తే సభ్యత్వం రద్దు చేస్తారా? అని నిలదీశారు. మోడీ తప్పులను ఎండగట్టడం కోసం కలిసి నడుద్దామంటూ పిలుపునిచ్చారు. అగంతకుల దాడి మీద ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నాయన్న నేపథ్యంలో ఈ విషయంలో కావాలనే బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు.
బీజేపీ సమాధానం చెప్పాల్సిందే..! : కోదండరాం
పార్లమెంట్‌ ఘటనపై బీజేపీ సమాధానం చెప్పాల్సిన అవసరముందని టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరాం అన్నారు. కీలకమైన బిల్లులపై చర్చ జరుగుతుంటే, అందరిని బయటికి పంపించి బలవంతంగా వాటిని ఆమోదింప చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే విపక్ష సభ్యులను సభలోకి అనుమతించాలని డిమాండ్‌ చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కోఆర్డినేటర్‌ దిడ్డి సుధాకర్‌ మాట్లాడుతూ విపక్ష పార్టీలను ఏకం చేసినందుకు మోడీకి కృతజ్ఞతలు చెబుతున్నానని ఎద్దేవా చేశారు. మున్ముందు ఇండియా కూటమి రాజ్యమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని పుల్వామా దాడులు జరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తంచేశారు. రామమందిరం పేరిట బీజేపీ రానున్న ఎన్నికల్లో గెలువాలనుకుంటుందని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌లో పొగ బాంబులు వేస్తే ప్రధాని మోడీ ఇంతవరకు సమాధానం చెప్పలేదన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ పునాదులు కదలబోతున్నాయని హెచ్చరించారు. మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ బీజేపీ నియంత్య్రత్వ ధోరణితో వ్యవహరిస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లురవి, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాధ్‌, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్‌, నాగరాజు, విజయరమణా రావు తదితరులు పాల్గొన్నారు.