– విభజన హామీలను అమలుచేసింది లేదు..
– దేవుని పేరుతో కాకుండా అభివృద్ధిపై ఓట్లడిగే దమ్ము బీజేపీకి ఉందా..?
– ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
రాష్ట్రానికి వచ్చి ఓట్లు అడిగే అర్హత ప్రధాని మోడీకి లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ వనస్థలిపురం రైతు బజార్ వద్ద, అల్వాల్ సర్కిల్ కైకుర్ వద్ద కార్నర్ మీటింగ్‌ల్లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మోడీ ఏ మొఖం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన బయ్యారం ఉక్కు స్టీల్, రైల్వే కోచ్, ఐటీఐ ఆర్ కంపెనీ, పాలమూరు ఎత్తిపోతల పథకం ఎందుకు ఇవ్వలేదన్నారు. ఓబీసీ, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తుందని, మోడీ రిజర్వేషన్లపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. బీజేపీ మతం, దేవుని పేరుతో ఓట్లు అడుగుతోందని, దమ్ముంటే అభివృద్ధి పేరుతో ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. బీజేపీ పుట్టకముందే తెలంగాణలో శ్రీరామ నవమి జరుపుకున్నారని గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు తెలిపారు. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు విస్తరింపచేస్తామన్నారు. మూసీ నదిని ఆధునీకరిస్తామని చెప్పారు. గతంలో మల్కాజిగిరి నుంచి తాను ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎల్బీనగర్ ప్రజలు 29 వేల మెజార్టీని అందించారని గుర్తు చేశారు. సునీతా మహేందర్ రెడ్డికి 30 వేల మెజార్టీని ఇవ్వాలని కోరారు. గతంలో ఎల్బీనగర్‌లో బీజేపీ కార్పొరేటర్లను గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. మల్కాజిగిరికి ఈటల రాజేందర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సభల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పార్టీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కి గౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మెన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.