– ప్రజలకు చేసిందేమీ లేదు
– చేసిన పనులు చెప్పుకోలేక మతచిచ్చు రాజేస్తున్న బీజేపీ
– తెలంగాణా చైతన్యం మరోసారి చాటాలి
– పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ అమలు చేస్తాం : ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకగాంధీ
నవతెలంగాణ-తాండూరు/కామారెడ్డి
”మోడీ పాలనలో బడా వ్యాపారులకే మేలు జరిగింది.. సామాన్య ప్రజలకు చేసిందేమీ లేదు.. మోడీ ఏదైనా పని చేసినట్లయితే నేను ఈ పనులు చేశానని చెప్పేవారు. కానీ దేశ సంపదనంతా అతని స్నేహితులకే దోచిపెట్టారు.. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా వారికి అప్పజెప్పారు. రైతులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, యువత సంక్షేమం వారికి అవసరం లేదు. సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారు..” అని ఏఐసీసీ ప్రధాని కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగాన్ని మార్చనివ్వబోమన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పదేండ్లలో ప్రధాని మోడీ రూ.16 లక్షల కోట్లు తన దోస్తులకు దోచి పెట్టాడని, పేద రైతులకు సంబంధించి ఒక రూపాయి అయినా బ్యాంకులో మాఫీ చేశాడా అని ప్రశ్నించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్‌షెట్కార్, వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలో చేవెళ్ల అభ్యర్థి రంజిత్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ జనజాతర సభలు నిర్వహించారు. ఈ సభల్లో ప్రియాంక గాంధీ ప్రసంగించారు. ఈ ప్రాంత ప్రజలు సోనియమ్మను సొంత కుటుంబ సభ్యురాలిగా కలుపుకొనిపోవడం, ఆప్యాయంగా పలకరించడం సంతోషంగా ఉందన్నారు. ‘నా తల్లి సోనియాగాంధీని మీరు సోనియమ్మ అని పిలుస్తారు.. నేను మీ సోదరిని’ అని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు జవాబుదారీగా పని చేస్తారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలు అందించడం లేదన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీతో సామాన్యుడి నడ్డి విరిగి పోయిందన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఐఐఎం, మెడికల్ కాలేజీలు, నవోదయ లాంటి విద్యాసంస్థలను మంజూరు చేయలేదన్నారు. నిరుద్యోగం పెరిగిందన్నారు. బీజేపీ పాలనలో చిన్న, చిన్న వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. దేశంలో మీడియా మోడీ చెప్పు చేతుల్లో ఉందని, మోడీకి కావాల్సిన వాటిని పెద్దపెద్దగా చూపిస్తున్నారని, వాస్తవాలు బయటకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై లైంగికదాడులు చేస్తున్న వారిని మోడీ ప్రభుత్వం వెనకేసుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మోడీకి, అమిత్ షాకి ఎన్నికలతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆర్‌ఆర్ సినిమా చూపించడం ఖాయమన్నారు. వ్యవసాయాధారిత పంటల ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గిస్తామన్నారు. ఈసారి ఇండియా కూటమికి పట్టం కట్టాలని కోరారు. ‘రాజ్యాంగమే ప్రజలకు ఎన్నో అవకాశాలు కల్పించింది.. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది రాజ్యాంగమే.. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మరోసారి చాటి చెప్పాలి” అని పిలుపునిచ్చారు.
దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక రైతులకు సంబంధించిన ఎంఎస్‌పీ చట్టాన్ని అమలు చేస్తామని కామారెడ్డి సభలో ప్రియాంక గాంధీ చెప్పారు. ఉపాధి కూలీలకు రోజుకు 400 రూపాయలు వచ్చే విధంగా చూస్తామన్నారు. ప్రతి మహిళా అకౌంట్లో లక్ష రూపాయలు వేస్తామన్నారు. కాంగ్రెస్ గెలుపు తెలంగాణ నుండే మొదలైందన్నారు. ” ఇక్కడి నుండే సందేశం ఇస్తున్నాను.. దేశాన్ని రక్షించుకుందాం.. మనమందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం..” అని పిలుపునిచ్చారు. దేశంలో అన్ని మతాలు, కులాల వారు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారని, అలాంటి వారి మధ్య బీజేపీ కొట్లాట పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కుటుంబం దేశ ప్రజల కోసమే అని చెప్పారు. ఈ సభలకు వచ్చిన ప్రతి ఒక్కరూ మీకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించుకోవాలన్నారు. మీ గల్లీకి మీ ఊరికి.. మీ ఇంటికి వచ్చి.. మీ గురించి తెలుసుకునే వ్యక్తిని ఎంచుకోవాలన్నారు. ఈ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, అభ్యర్థులు పాల్గొన్నారు.