మోడీ హటావో డ్రైవర్స్‌కో బచావో..

మోడీ హటావో డ్రైవర్స్‌కో బచావో..–  కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో డ్రైవర్ల భారీ ర్యాలీ
– కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
నవతెలంగాణ – భగత్‌నగర్‌
హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో డ్రైవర్స్‌కి 10ఏండ్ల జైలు, రూ.7లక్షల జరిమానా విధిస్తూ బలవంతంగా తీసుకొచ్చిన చట్టాన్ని నిరసిస్తూ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో డ్రైవర్లు శుక్రవారం సీఐటీయూ, ఏఐఆర్‌టీడబ్ల్యుఎఫ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. మోడీ హటావో.. డ్రైవర్స్‌కో బచావో అంటూ నినదించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్‌ మాట్లాడుతూ.. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారానే ఈ చట్టం రద్దవుతుందని, అందుకు డ్రైవర్స్‌ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా డ్రైవర్లందరూ ఆందోళనకు దిగారన్నారు. ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకు దేశవ్యప్తంగా సీఐటీయూ, ఇతర రవాణా రంగ ఫెడరేషన్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ.. ప్రముఖ ప్రొఫెసర్‌ గీతం తివారి అధ్యయనం ప్రకారం.. 90 శాతం మానవేతర కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీ ఐఐటీ రిపోర్టు తెలిపిందన్నారు. దేశంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు నిర్మాణాలు సాగుతున్నాయని, అందులో లోపాల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. డ్రైవర్లదే తప్పిదమనే భావన తీసుకొచ్చి వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదన్నారు. ధర్నాలో ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పున్నం రవి, లారీ డ్రైవర్స్‌ యూనియన్‌ పట్టణ అధ్యక్షులు ఎస్‌కె.ఆరిఫ్‌ మోహినాయుద్దీన్‌, ఇసుక టిప్పర్‌ డ్రైవర్లు యూనియన్‌ నాయకులు, జై ఇండియన్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ జిల్లా ఇన్‌చార్జి చందు, వైస్‌ ప్రెసిడెంట్‌ రాజ్‌ నాయక్‌, రెడీమిక్స్‌ వాహన డ్రైవర్‌ రామచంద్రన్‌, డ్రైవర్లు పాల్గొన్నారు.