– ప్రధాని సభలో విద్యార్థి కవిత నిరసన
– కరెంటు పోల్ ఎక్కడంతో తీవ్ర ఉద్రిక్తత
– స్తంభం దిగాలని సూచించిన ప్రధాని
– బలవంతంగా దింపిన పోలీసులు
– పీఎం ప్రకటన పై పలువురి అసంతృప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘మోదీ దేశ ద్రోహి. అసమర్థ నాయకుడు’ అంటూ ఓయూ విద్యార్థిని, వనపర్తి జిల్లాకు చెందిన కవిత ఎమ్‌ఆర్‌పీఎస్ సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కరెంట్ పోల్ ఎక్కి పెద్దగా నినాదాలు చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆమెను దిగాలని ప్రధాని మోడీ స్వయంగా సూచిస్తూనే మరోవైపు తన ప్రసంగాన్ని కొనసాగించారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను బలవంతంగా కిందకు దింపేశారు. అయినా, ఆమె తన నిరసనను ఆపలేదు. మీడియా అంతా ఆమె చుట్టూ పోగవ్వడంతో పోలీసులు కూడా ఆమెను ఏమీ అనలేకపోయారు. ‘మోడీ పాలన వచ్చాక దేశంలో కులమతాల పేరిట విద్వేషాలు పెరిగిపోయాయి. దేశంలో రోజుకో చోట యువతులపైనా, చిన్నారులపైనా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా మర్డర్లు, మానభంగాలు జరుగుతున్నాయి. బాధితులకు న్యాయం కూడా జరగట్లేదు. ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు. ధర్మం కరెక్టుగా ఉండి ప్రభుత్వం సరిగా పనిచేస్తే ఇలా జరుగుతుందా? సహజీవన చట్టం చేయడమేంటి? మన దేశం ఎటుపోతున్నది? ముస్లింలు, క్రైస్తవులు చనిపోతున్నారు. మనుషులమంతా ఒక్కటే ఈ చీలికలేంటి? ఒకే మతాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఓ వైపు దేశంలో ధరలు పెరిగిపోతున్నాయి. మరో వైపు యువతకు ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. బతికేదెట్టా? దేశం ఇలా ఉంటే మోడీ సమర్ధ నాయకుడు ఎలా అవుతాడు? ఆయన అసమర్ధ నాయకుడు. దేశద్రోహి ప్రధాన మంత్రి’ అంటూ తన నిరసన గళాన్ని వినిపించింది. దళితుల్ని రాజకీయంగా వాడుకోవడానికే ఈ సభ పెట్టారని ఆరోపించింది. ఆమెను మీడియాతో మాట్లాడనీయకుండా ఎమ్‌ఆర్‌పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఆందోళన జరుగుతుండగానే ఓ న్యాయవాది ముందుకొచ్చి ‘మోడీ ప్రసంగం అంతా నిరుత్సాహంగా ఉంది. ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేస్తారంటే ఇక్కడికొచ్చాం. ఆయనేమో వర్గీకరణపై కమిటీ వేస్తామని దాటేశారు. గత ప్రభుత్వాలు ఎన్నో కమిషన్లు వేసి మోసం చేశాయి. ఇదీ అలాంటిదే. ఇది ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడ’ అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.