నీటి వాటా తేల్చని అసమర్ధుడు మోడీ

– ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో : మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవ తెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి/ కోస్గి
”రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు దాటినా నేటికీ తెలంగాణ జలాల వాటా తేల్చని అసమర్ధుడు ప్రధాని మోడీ. పార్లమెంటులో తెలంగాణ అభివృద్ధిని మెచ్చుకుంటూ.. రాష్ట్రానికి వచ్చి పచ్చి అబద్దాలు మాట్లాడారు.. బీజేపీకి అసలు తెలంగాణలో స్థానమే లేదు” అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో, నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభల్లో మంత్రి ప్రసంగించారు.రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న తాము వచ్చే ఎన్నికల సందర్భంగా మహిళల కోసం కూడా బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నిరంతరం సాగునీటి కోసమే పరితపించేవారని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తకోటలో 30 పడకలు, దేవరకద్రలో వంద పడకల ఆస్పత్రిని నిర్మించి మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. మెడికల్‌ కళాశాలలో నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందించినట్టు అవుతుందన్నారు. పార్లమెంట్‌లో సీఎం కేసీఆర్‌ని మెచ్చుకున్న మోడీ తెలంగాణలోకి రాగానే తిట్టడం ఆయనకు అలవాటే అని విమర్శించారు.
కుటుంబ పాలన మోడీ క్యాబినెట్‌లోనే ఉందన్నారు.
ఢిల్లీలో మోడీని కలవడానికి వెళ్లినప్పుడు.. కేసీఆర్‌ నీకు ఎప్పుడూ నీటి సంగతేనా, రైతుల అభివృద్ధి గురించే మాట్లాడతావా అని మెచ్చుకుని.. రాష్ట్రానికి వచ్చి కుటుంబ పాలన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ప్రజల మద్దతుతో గెలిచి నాయకులుగా ఎదిగారని చెప్పారు. ఐదు హామీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ చెప్పిన పథకాలు అమలు చేయకుండా ప్రభుత్వం చితికిల పడిందని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి తప్పు చేశారు.. ఇవాల కాకపోతే రేపు విచారణ అయ్యేది ఖాయం.. ఆయన జైలుకు పోయేది పక్కా అని అన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించకపోతేనే ఆయన్ని మల్కాజిగిరికి పంపారని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్‌ ప్రజలకు రేవంత్‌ రెడ్డి ఒక్క ఆస్పత్రి కూడా తేలేదని, నేడు నరేందర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అండతో మూడు ఆస్పత్రులను ప్రారంభించారన్నారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణలో బీజేపీకి స్థానం లేదన్నారు. కాంగ్రెస్‌ గెలిచేది లేదు.. హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించు కున్నామని, కృష్ణమ్మ నీరు బిరబిరా నార్లపాడు రిజర్వాయర్లో పడ్డాయన్నారు. ఏడాదిలోగా మీ పొలం వాకిట్లోకి కృష్ణమ్మ నీరు వస్తుందని చెప్పారు. త్వరలో నారాయణపేట జిల్లాలో మెడికల్‌ కళాశాలను ప్రారంభించబోతున్నామని, రూ.150 మంజూరు చేశామని అన్నారు.
గ్రూపు తగాదాలతో కొట్లాడుకొని ఏమవుతుందో వాళ్లకే తెలియని పరిస్థితిలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నదని సమాచార శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌ బండ ప్రకాష్‌ అన్నారు. బీజేపీ ఉనికి కోల్పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, టీఎస్‌ ఎంఐడిసి చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, నారాయణపేట డీసీసీబీ చైర్మెన్‌ నిజాం పాషా, ఈజీఎస్‌ డైరెక్టర్‌ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.