పర్యటనలతో మోడీ బిజీబిజీ

పర్యటనలతో మోడీ బిజీబిజీ– 2023లో రాష్ట్రాలకు 162… విదేశాలకు 14 ట్రిప్పులు
– మణిపూర్‌ వైపు మాత్రం కన్నెత్తి చూడని ప్రధాని
న్యూఢిల్లీ: సున్నితమైన సరిహద్దు రాష్ట్రం మణిపూర్‌లో హింస ప్రారంభమై సంవత్సరం గడిచింది. జాతి ఘర్షణలతో, మహిళలపై లైంగికదాడులు, దాష్టీకాలతో అట్టుడికిపోయిన ఆ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ కనీసం ఒక్కసారి కూడా పర్యటించలేదు. కానీ గత సంవత్సరం వివిధ రాష్ట్రాలను అధికార, అనధికార పర్యటనలతో 162 సార్లు చుట్టివచ్చారు. మణిపూర్‌ తగలబడుతున్న సమయంలోనే 14 విదేశీ పర్యటనలకూ వెళ్లి వచ్చారు. మణిపూర్‌ హింసలో 230 మంది ప్రాణాలు కోల్పోయినా, 60 వేల మంది నిరాశ్రయులైనా ఆయన మనసు మాత్రం కరగలేదు.
మణిపూర్‌ ప్రస్తుతం బీజేపీ పాలనలో ఉంది. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ పదవిలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నప్పటికీ ఆయనపై కానీ, ఇతర మంత్రులపై కానీ ఎలాంటి చర్యలు లేవు. మణిపూర్‌లో ప్రధాని కాలుపెట్టకపోవడాన్ని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ గత సంవత్సరం ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఆయన తన భారత్‌ జోడో యాత్రను ఈ ఏడాది మణిపూర్‌ నుండే ప్రారంభించారు.
2023 మే నుండి ఈ సంవత్సరం ఏప్రిల్‌ వరకూ ప్రధాని మోడీ అత్యధికంగా 24 సార్లు రాజస్థాన్‌లో పర్యటించారు. మధ్యప్రదేశ్‌కు 22 సార్లు వెళ్లారు. ఈ రెండు రాష్ట్రాల శాసనసభలకు గత సంవత్సరం నవంబరులో ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రాల్లో బీజేపీ తరఫున ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మణిపూర్‌లో హింస మొదలైనప్పుడు మోడీ కర్నాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. గత సంవత్సర కాలంలోనే ఆయన ఎనిమిది సార్లు కర్నాటకలో పర్యటించారు. స్వరాష్ట్రమైన గుజరాత్‌కు 10 సార్లు, ఉత్తరప్రదేశ్‌కు 17 సార్లు వెళ్లారు.
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఈశాన్య ప్రాంతంలోని అసోం, త్రిపుర, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటించిన మోడీ మణిపూర్‌ వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. అసోంకు మూడు సార్లు, త్రిపుర, అరుణాచల్‌కు ఒక్కోసారి వెళ్లారు. గత నవంబరు ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగ్గా మిజోరం మినహా మిగిలిన రాష్ట్రాన్నింటికీ మోడీ వెళ్లారు. మణిపూర్‌కు మిజోరం పొరుగునే ఉంది. మణిపూర్‌ హింస కారణంగా నిరాశ్రయులైన కుకీ-జో తెగకు చెందిన అనేక మంది మిజోరంలోనే తలదాచుకుంటున్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిపిన పర్యటనలను అటుంచితే 2023 మే నుండి మోడీ 14 అంతర్జాతీయ పర్యటనలు జరిపారు. హిందూ దేవాలయాన్ని ప్రారంభించేందుకు యూఏఈలో జరిపిన పర్యటన కూడా వీటిలో ఉంది.