మోడీది మొసలి కన్నీరు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
– ఇన్నేండ్లు వర్గీకరణ బిల్లు ఎందుకు పెట్టలేదు?
– మాదిగల ఓట్ల కోసమే నాటకం..
– మనువాద బీజేపీకి మాదిగల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు : కేవీపీఎస్‌

‘అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాదిగల విశ్వరూప మహాసభకు హాజరైన ప్రధాని మోడీ మాదిగల పట్ల మొసలి కన్నీరు పెట్టాడు. పదేండ్లుగా దేశంలో అధికారంలో ఉండి, పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుండా మాదిగల ఓట్ల కోసం కమిటీ వేస్తానని కొత్తనాటకానికి తెరలేపారు’అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌ వెస్లీ, టి స్కైలాబ్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. మాదిగలను మనువాదం వైపు నడిపించటానికి మందకృష్ణ మాదిగను పావుగావాడుకోనున్నదని తెలిపారు. మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కార్పొరేట్లకు కట్టబెడుతున్నదనీ, ప్రయివేట్‌ పరిశ్రమల్లో రిజర్వేషన్లు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్న రిజర్వేషన్లకే విఘాతం కలిగిస్తున్నదని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపైన 300 రెట్లు దాడులు పెరిగాయని తెలిపారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని నీరుగారుస్తున్నదని పేర్కొన్నారు. దళితుల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించకుండా ప్రణాళికా సంఘాన్ని ప్రయోగించిందని తెలిపారు. పదేండ్ల కాలంలో వర్గీకరణ గురించి మోడీ పల్లెత్తు మాట మాట్లాడలేదని గుర్తు చేశారు. మోడీ దగ్గర మాదిగల ఆత్మగౌరవాన్ని మంద కృష్ణ తాకట్టు పెట్టటం విచారకరమని తెలిపారు.