2023 జులైలో బెంగళూరులో ప్రతిపక్షాల కూటమి సమావేశమై ఇండియాగా ముందుకు వస్తున్న తరుణంలోనే కేంద్ర పాలకపక్షమైన బీజేపీ హడావుడిగా ఎన్‌డిఎను పునరుద్ధరించి విస్తరించి ఢిల్లీలో సమావేశపర్చింది. 26 పార్టీలు ఇక్కడ కలు స్తుంటే అక్కడ ఏకంగా 38 పార్టీలు హాజరయ్యాయి గాని వాటి సీట్లబలం నామకార్థమని మీడియా విశ్లే షించింది. తాజాగా ముంబాయిలో ఇండియా సమా వేశమవుతుందంటే ఎన్‌డిఎ సమావేశం కాకుండా ఏకంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలనే పిలవా లని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది, లౌకిక ప్రతి పక్షాల ఐక్యవేదిక ఏర్పాటు పట్ల ప్రధాని మోడీ ఎంతగా ఉలిక్కిపడుతున్నారో దీన్నిబట్టే చెప్పొచ్చు. నవంబరు, డిసెంబరులో అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో తన పరిస్థితి ప్రతికూలంగా వుంటుందని భయపడుతున్న బీజేపీ-ఆరెస్సెస్ పరివారం ముందస్తు ఎన్నిక లకు వెళ్లవచ్చుననే సంకేతాలు గతం నుంచి వున్నాయి. కానీ ముంబాయి సమావేశ సన్నా హాలు, ప్రతిపక్షాల వ్యూహాల ఉధృతి చూసిన తర్వాత కేంద్రం దాదాపు ముందస్తును మరింత ముందుకు జరపాలని నిర్ణయించు కోవలసి వచ్చిందని ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ లోక్‌సభ అమృ తోత్సవ్ ప్రత్యేక సమావేశాలు జరిపి కీలకమైన బిల్లులు సవరణలు ఆమోదింపచేసు కోవాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు జాతీయ మీడియా ఏకకంఠంతో చెబుతున్నది. ఇందుకు తగినట్టే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాయకత్వం లో జమిలి ఎన్నికల గురించి అధ్యయనం చేసేందుకు ఒక కమిటీనే నియమించారు. 2018లో కోవింద్ ఆ పదవిలో వున్నప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో లోక్‌సభకూ శాసన సభలకూ ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచిదన్న సూచన చేశారు. అంటే కేంద్రం ఆలోచనను వినిపిం చారు. ఆయన నాయకత్వంలో కమిటీ ఇక ఏమి చెబుతుందో వూహించడం కష్టమేమీకాదు. అసలు రాజ్యాంగ అధినేతగా పని చేసిన ఒక మాజీ రాష్ట్రపతిని ఈ విధంగా రాజకీయ బాధ్యత అప్పగించడం దేశ రాజకీయాలలో ఇదే తొలిసారి కావచ్చు.
వాస్తవికత, విశాల వ్యూహం
ఇండియా సమావేశం జరుగుతుందనగా పార్ల మెంటు ప్రత్యేక సమావేశాల ప్రకటన రావడంతో దాని నిర్వహణ కోణంలోనే కొంత మార్పు అవసరమైంది. బీజేపీ మత రాజకీయాలనూ కేంద్రం నిరంకుశత్వాన్ని ఓడించడానికి మరింత సమిష్టిగానూ సమర్థంగానూ సత్వర వ్యూహాలు రూపొందించు కోవాల్సిన ప్రతి పక్షాల నాయకులు గుర్తించారు. కీలక నేతలందరూ హాజరయ్యారు కూడా. దేశంలోని 450 నియోజక వర్గాలలో బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్య ర్థిని నిలబెట్టి ఓడించాలని అందుకే తొలి అంశంగా నిర్ణయించు కున్నారు. అయితే ఇది విశాల ప్రతిపక్ష వేదిక మాత్రమే గనక వీలైనంత వరకూ కలసి పోటీ చేస్తామని ప్రకటించాయి. అందుకే జాతీయస్థాయి సమావేశంలో గాక రాష్ట్రాల స్థాయిలోనే సమన్వయ కమిటీల ద్వారా ఎవరు ఎలా పోటీ చేయాలన్నది ఖరారు చేయాలని నిర్ణయించారు. నిర్ణయం వాస్తవి కతను ప్రతిబింబిస్తుంది. ఉదా హరణకు కేరళలో ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ కలిసిి పోటీ చేయడం కుదిరేపని కాదు. బెంగాల్‌లో మమతా బెనర్జీని వామపక్షాలు కాంగ్రెస్ ఆమోదించడం అసాధ్యం. పంజాబ్, ఢిల్లీ, గుజరాత్‌లలో ఆప్, కాంగ్రెస్ పోటీ పడుతుంటాయి. అందుకే వీలైనంత వరకూ కలిసి అన్నారు. వాస్తవానికి మమతా బెనర్జీ ఈ విషయమై తొందరగా ఉమ్మడి పోటీ విషయం తేల్చాలని పట్టుపట్టినా మిగిలిన నేతలు ఇందుకోసం సర్ది చెప్పినట్టు కథనాలు వచ్చాయి. ఏమైనా అరడజను ముఖ్యమంత్రులు, నాలుగు జాతీయ, పలు ప్రాంతీయ పార్టీల నాయ కులు ఈ వేదికలో వున్నారు గనక ఆయా చోట్ల కలసి అడుగేయడం సాధ్యమే అవుతుంది. 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఆ విధంగా కలిసిన విజయ వంతమైన అనుభవం వుంది. కనీసం మూడుసార్లు కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాలు ఏర్పడిన వాస్తవం మర్చిపోరానిది. అవి విఫల ప్రయోగాలుగా చెబుతుంటారు గాని అందుకు నాటి కాంగ్రెస్ అనుసరించిన విధానమే ముఖ్య కారణం. ఇప్పుడు ఆ పార్టీయే ఇండియా కూటమిలో ఒక కీలక పాత్రధారి. ప్రాంతీయ పార్టీలకు అప్పటి కన్నా ఇప్పుడు నిర్ణయాత్మక పాత్ర వుంటుంది. ఈ పార్టీల ఊగిసలాటనే గతంలో బీజేపీ అధికారంలోకి రావడా నికి ఒక ప్రధాన ఆధారమైంది. మోడీ హయాంలో రాష్ట్రాలు గుప్పిట పెట్టుకునే ధోరణి, సమాఖ్య విధానానికి తూట్లు పొడవడం ఈ ప్రాంతీయ పార్టీలలో చాలావాటికి కళ్లు తెరిపించిందని చెప్పాలి. తమ అస్తిత్వం కోసమైనా వారంతా ఇండియా వైపు మొగ్గడం అనివార్యమైన పరిస్థితి. ఇప్పటికీ వైసీపీ, టీడీపీ, బీజేడీ వంటి పార్టీలు బీజేపీకి అను కూలంగా వుండటం వాటిపై ఒత్తిళ్ల ఫలితమే. ఇక బీఆర్‌ఎస్, బీఎస్‌పీ వంటి పార్టీలు సమదూరమని అంటున్నా ఆచరణలో బీజేపీకే ప్రయోజనమనే భావన వుంది. ఎన్నికలు దగ్గరపడే కొద్ది అంతిమంగా ఎవరు ఎలాంటి వైఖరి తీసుకుంటారో చూడాల్సిందే. అకాలీదళ్, బీఎస్‌పీ వంటి పార్టీలు ఇండియాలో చేరకపోయినా ఎన్‌డిఎలో చేరడం జర గదనే అభిప్రాయం ఎన్‌సిపి నాయకుడు శరద్‌పవార్ ముందే స్పష్టంగా ప్రకటిం చారు. ఒక కన్వీనర్ నియామకం కూడా ఇప్పుడే తేలక పోయినా నష్టంలేదని వాయిదా వేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కనీస ఉమ్మడి కార్యక్రమం అవసరమంటూ మరో కోణం జతచేశారు. దాన్ని అక్టోబరు 2వ తేదీన గాంధీ జయంతి రోజున రాజ్ ఘాట్‌లో విడుదల చేయాలని మమత సూచిం చారు. 14 మంది సభ్యులతో ఏర్పడిన కమిటీలో సీపీఐ(ఎం) సభ్యులెవరో తర్వాత ప్రకటిస్తామన్నారు.
కోవింద్ కమిటీ,కోటి కౌటిల్యాలు
ఏమైనా ఈ సమావేశ ప్రభావం అప్పుడే బీజేపీపౖౖె పడిందని సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్య అర్థవంత మైంది. ముంబాయి సమావేశం ఒకవైపున ఇంకా జరుగుతుండగానే ఏకకాల ఎన్నికల ముచ్చట వూపందుకోవడంలో అది కనిపిస్తుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరెస్సెస్ అధినేత మోహన్‌భగవత్‌ను కలిశారు. ఇండియా అనే పేరు మార్చి భారత్‌నే వాడాలని భగవత్ రెండుచోట్ల వేర్వేరు సమావేశాల్లో ప్రవచించారు. ఈ దేశం హిందూ రాష్ట్రమేనని, భా రతీయులందరూ హిందు వులేనని మత భాష్యాన్ని మరింత తీవ్రంగా వినిపిం చారు. రామ్‌నాథ్ కోవింద్ కూడా కొంత కాలం కిందట భగవత్‌తో సమావేశమయ్యారని ఇక్కడ గుర్తు చేయాలి. అంటే మోడీ, అమిత్ షా ఒకవైపు ఎన్‌డిఎ విస్తరణ కోసం తంటాలు పడుతుంట,ే మరోవైపు మోహన్ భగవత్ హిందూత్వ మతతత్వ సిద్ధాంతం వ్యాప్తికి బీజాలు వేస్తున్నారన్నమాట. కోవింద్ కమిటీ గురించి ప్రహ్లాద్ చెప్పడమే గాని ఇంతవరకూ అధి కారిక ప్రకటన వెలువరించలేదు. పైగా రాజ్యాంగం గురించిన చర్చను అనధికార కమిటీ ఎలా చేస్తుంది? ఆ అధికారం పార్లమెంటుకు మాత్రమే వుంది. గతంలో వాజ్‌పేయి హయాంలోనూ రాజ్యాంగ సంస్కరణలకై జస్టిస్ వెంకట చలయ్య కమిటీని ఇలాగే ఏర్పాటు చేసి తర్వాత సూచనల కోసం అని వెనక్కు తగ్గారు. ఇప్పుడైనా ఏకపక్షంగా రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయడం చెల్లదు. ఆ అంశాన్ని తెరపైకి తేవడం, ప్రజల్లో అనుకూలత పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. పార్టీలు వ్యక్తులు సంస్థలు ప్రభుత్వాలతో ఈ కమిటీ సంప్రదిస్తుం దంటున్నారు. కానీ ఇతర పార్టీలు, ప్రభుత్వాలు ఒక అనధికార కమిటీకి సహకరిస్తాయని చెప్పడం కష్టం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా పదవీ విరమణ తర్వాత మామూలు పౌరుడేనని ఇటీవల జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టంగా చెప్పారు. అధికార లాంఛనాలు కొన్ని వుండవచ్చు గాని మాజీ రాష్ట్రపతి అయినా ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తి ఏమీ వుండదు. ఈ కమిటీ సిఫార్సులు చేసినా వాటిని కేంద్ర క్యాబినెట్ తీర్మానం ముందుకు తెస్తారన్నమాట. ఎన్నికల సంఘం కూడా కేంద్రం ఒత్తిడితో గతంలోనే దీనిపై స్పందించింది. ఒకేసారి ఎన్నికలు జరపగల సత్తా వుందని కాకపోతే అదనంగా సహాయం అవసరమని వెల్లడించింది. తన వంతుగా అయిదు సూచనలు చేసింది. 1.కొత్త లోక్‌సభ ప్రారంభానికి తేదీ నిర్ణయించాలి. 2.అవిశ్వాస తీర్మానం తెచ్చేవారు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి నాయకత్వం వహించే వ్యక్తి పేరు అందులో సూచించాలి. 3.పదవీ కాలం కొద్దిగానే మిగిలివుండగా ప్రభుత్వం పడిపోతే రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఎక్కువుంటేనే ఎన్నికలు 4.శాసనసభల విషయంలోనూ ఇదే జరగాలి. 5. లేదంటే అన్ని ఎన్నికలకూ నిర్ణీత తేదీలలో జరిగేలా నిర్ణయించాలి.
రాజ్యాంగానికే ఎసరు, దేశానికే ప్రమాదం
భారత రాజ్యాంగం ఏకకాల ఎన్నికలు జరగాలని చెప్పడం లేదు. లోక్‌సభ, శాసనసభల నియమ నిబం ధనలు కాలపరిమితి అన్నీ వేర్వేరుగా వున్నాయి. మొదటి మూడు ఎన్నికలు కలిసే జరిగాయంటే కాంగ్రెస్ గుత్తాధిపత్యమే కారణం, 1967 నుంచి క్రమంగా ఈ పరిస్థితి మారుతూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడం, రద్దు చేయడం, పడి పోవడం చాలా చూశాం. కేంద్రంలోనూ కనీసం మూడుసార్లు ప్రభుత్వాలు ముందేపడిపోయాయి. వాటిపై ఏవో కొత్త షరతులు రుద్దాలనేది ఇక్కడ ఆంతర్యం. అంటే పదవీకాలం ముగిసినా కొనసా గించడం, లేక ఇంకా వున్నా ఎన్నికలకు వెళ్లకుండా పరోక్ష పాలన సాగించడం వంటివి రాజ్యాంగ నిర్దేశానికి విరుద్ధం. అప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అనే మౌలిక సూత్రమే మంటగలిసి పోతుంది. ఎమర్జెన్సీలో రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని ఆరేళ్లకు పెంచితే తర్వాత కత్తిరించాల్సి వచ్చింది. వాస్తవానికి శ్రీలంక, బంగ్లాదేశ్ వంటిచోట్ల కూడా గతంలో నిరంకుశ ప్రభుత్వాలు పాలనా వ్యవస్థను ఇష్టానుసారం మార్చినా తర్వాత అవి నిలబడలేదు. విపిసింగ్ ప్రభుత్వ కూల్చివేత తర్వాత అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ జాతీయ ప్రభుత్వం అంటూ ఒక ప్రహసనం నడిపించి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. బీజేపీ ఎప్పుడూ అధ్యక్ష తరహా పాలన కోరు కుంటుంది. దేశంలో రాజకీయ, సామాజిక బహు ళత్వం కారణంగా అది చేయలేకపోయింది, మోడీ హయాంలో దాదాపు ప్రధాని కేంద్రంగా చేయడం అధ్యక్ష తరహా ప్రతిబింబమే. పెద్ద నోట్ల రద్దుతో సహా కీలక నిర్ణయాలు మోడీ ఒక్కరే తీసుకున్నారు. కాశ్మీర్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటివాటిని కూడా ఎవరితో చర్చించలేదు. ఈ నిర్ణయాలు సుప్రీం కోర్టు సమీక్షలో వుండటమే గాక తీవ్ర ప్రశ్నలకు కారణ మవుతున్నాయి, లోక్‌సభ పదవీకాలానికి సంబంధిం చిన 83వ అధికరణం, రద్దుకు సంబంధించిన 85 అధికరణం, అసెంబ్లీల పదవీ కాలానికి సంబం ధించిన 172, రద్దుపైన 174, రాష్ట్రపతి పాలనపై 356 అయిదు రాజ్యాంగ సవరణలు చేయవలసి వుంటుంది. శాశ్వత మార్పులైతే సగం శాసనసభల ఆమోదం కూడా అవసరమవుతుంది. లక్షల కోట్ల రూపాయలు బడాబాబుల పరం చేయడమే గాక రాయితీల రూపంలో మరిన్ని లక్షల కోట్లు కట్టబెడు తున్న ఈ సర్కారు ఎన్నికల ఖర్చు తగ్గించాలని పొదుపు కబుర్లు చెప్పడం హాస్యాస్పదం. ఇది వాస్తవానికి అధికార దాహం, అప్రజాస్వామిక రాజ్యాంగ కుట్ర. మోహన్‌భగవత్, మోడీల మాటల వెనక వున్న రాజకీయ దురుద్దేశాలు, మతతత్వ వ్యూహాల పట్ల అప్రమత్తత చాలా అవసరం. బాధా కరమైన విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రాలలో రెండు పాలక పార్టీలైన వైసీపీ, బీఆర్‌ఎస్, తెలుగు దేశం ఏవీ ఈ పోరాటంలో పాలు పంచుకోవడం లేదు. బీజేపీకే వత్తాసుగా నిలవడానికే పోటీ పడుతు న్నాయి. ఇండియా ఈ నిరంకుశత్వాన్ని నిలవరించేం దుకు పోరాడటమే గాక ఎన్నికలలోనూ బీజేపీ కూటమిని ఓడించడం ద్వారా ఈ కుటిల ప్రయత్నాలు శాశ్వతంగా అడ్డుకోవడం మరింత ముఖ్యం.
– తెలకపల్లి రవి