26, 27 తేదీల్లో మోడీ పర్యటించే అవకాశం

– కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి
–  బీజేపీలో చేరిన బీఆర్‌ఎస్‌ నేత ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌, పలువురు నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 26,27 తేదీల్లో ప్రధాని మోడీ మరోసారి పర్యటించే అవకాశముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని హోటల్‌ కత్రియాలో కిషన్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌ నేత ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌, నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల ముందు సీట్ల కోసం చేరటం సహజ ప్రక్రియ అనీ, ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ మాత్రం ఏమీ ఆశించకుండా తమ పార్టీలో చేరారని తెలిపారు. తిరిగి ఆయన తన ఇంటికి చేరుకోవడం మంచి పరిణామ మన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ తరఫున 111 మంది, జనసేన నుంచి 8 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. దీపావళి తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. జాతీయ నేతలు, మంత్రులు, సీఎంలు అమిత్‌ షా, యోగి, రాజ్‌నాథ్‌ సింగ్‌, హిమాంత బిశ్వ శర్మ, ఏక్‌నాథ్‌ షిండే, పలువురు వస్తారన్నారు. బీజేపీపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. మజ్లీస్‌, బీజేపీ ఒక్కటే అని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలేనని విమర్శించారు.
కర్నాటక ప్రజల నెత్తిన కాంగ్రెస్‌ భస్మాసుర అస్త్రంగా మారిందనీ, ఆ రాష్ట్రంలో ఐదేండ్లలో జరగాల్సిన నష్టం ఐదు నెలల్లో జరిగిందని చెప్పారు. పదేండ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి మరింత తీవ్రం అవుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ రెండుచోట్ల, మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయమని చెప్పారు. కేసీఆర్‌ కుటుంబం అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని కక్కిస్తామని హెచ్చరించారు. డిసెంబర్‌ 3వ తేదీతో రాష్ట్రంలో కమ్ముకున్న ‘కారు'(బీఆర్‌ఎస్‌) చీకటిని, అధికారంలోకి వస్తామనుకుంటున్న ‘మసక'(కాంగ్రెస్‌) చీకటిని పారదోలాలని పిలుపునిచ్చారు.