– మణిపూర్‌పై ప్రధాని ప్రకటన చేయాలి
– ప్రతిపక్షాల ఆందోళన..అట్టుడికిన పార్లమెంట్
– సమాధానమివ్వకుండా పోటీగా అధికారపక్షం నిరసన : ఆప్ రాజ్యసభ నేత సంజరు సింగ్ సస్పెండ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మణిపూర్ హింసాకాండ అంశం పార్లమెంట్‌లో మంటలు రేపుతోంది. ఈ ఘటనలపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు కొనసాగిస్తున్న ఆందోళన ఉభయసభలను కుదిపేస్తోంది. దీంతో సోమవారం కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ఆప్ రాజ్యసభ నేత సంజరు సింగ్‌పై వేటు వేయటం రాజ్యసభను మరింత వేడెక్కించింది. మణిపూర్‌పై చర్చ జరపాలని, ప్రధాని సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఐక్యంగా ఆందోళన చేపడుతున్నాయి. సమాధానమివ్వకుండా ప్రతిపక్షాలకు పోటీగా రాజస్థాన్, పశ్చిమబెంగాల్‌లో మహిళలపై దాడుల గురించి అధికార పక్షం కూడా ఆందోళనలు చేస్తుంది. ఉభయ సభల్లో కూడా ప్రతిపక్షాల నోటీసులకు పోటీగా అధికారం పక్ష ఎంపీలు కూడా నోటీసులు ఇచ్చారు. రూల్176 కింద బీజేపీ ఎంపీలు లక్ష్మీకాంత్ వాజ్‌పేరు తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దాడులు గురించి, సుధాన్సు త్రివేది పశ్చిమ బెంగాల్‌లో హింస గురించి ప్రస్తావించారు. సుశీల్ కుమార్ మోడీ పాట్నాలో ఆందోళనపై పోలీస్ దాడి, జివిఎల్ నరసింహరావు ఛత్తీస్‌గడ్‌లో ఫేక్ కుల ధ్రువీకరణ పత్రాలకు వ్యతిరేకంగా యువత ఆందోళన, హరనాథ్ సింగ్ యాదవ్ ఛత్తీస్‌గఢ్‌లో మహిళలపై లైంగికదాడులు, గణశ్యాం తివారీ రాజస్థాన్‌లో మహిళలపై దాడులు, శాంతి భద్రతలపై ఇచ్చిన 11 నోటీసులు తన పరిశీలనలో ఉంటాయని, మణిపూర్ హింసపై సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ ఇచ్చిన నోటీస్‌ను తిరిగి వెనక్కి పంపిస్తున్నానని రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్ అన్నారు. రూల్ 267 కింద 27 నోటీసులు తన వద్దకు వచ్చాయని, మల్లికార్జున్ ఖర్గే, జాన్ బ్రిట్టాస్, ఎడి సింగ్ వంటి నోటీసులు ఇచ్చిన ఎంపీల పేర్లను చదువుతున్న సందర్భంలో టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ జోక్యం చేసుకొని బీజేపీ ఎంపీల పేర్లను పార్టీ పేరుతో కలిపి చదివారు, ప్రతిపక్ష ఎంపీల పేర్లు చదివేటప్పుడు మాత్రం పార్టీ పేరును ఎందుకు జోడించటం లేదని ప్రశ్నించారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలంతా డెరిక్ ఓబ్రెయిన్‌కు మద్దతుగా నిలబడ్డారు. డెరిక్ ఓబ్రెయిన్ మీరు మీ స్థానంలో కూర్చోవాలని చైర్మెన్ ధన్కర్ సూచించారు.ీ డెరిక్ కూర్చోకపోవడంతో, మీరు చైర్‌ను సవాల్ చేస్తున్నారని ధన్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. మణిపూర్‌పై ప్రధాని సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆప్ రాజ్యసభ పక్షనేత సంజరు సింగ్‌ను సస్పెండ్ చేస్తూ సభా నాయకుడు, కేంద్ర మంత్రి పియూశ్ గోయల్ తీర్మానం ప్రవేశపెట్టారు. చైర్మన్ ధన్కర్ తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించారు. సమావేశాలు జరిగే అన్ని రోజులూ సంజయ్ సింగ్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి, సభను మద్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్, సంజరు సింగ్ సస్పెన్షన్ ప్రస్తావించి, 27 సెకెన్లలో సభను సాయంత్రం 3 గంటల వరకు వాయిదా వేశారు. తరువాత ప్రారంభమైన సభలో సంజరు సింగ్‌ను సభ నుంచి వెళ్లిపోవాలని డిప్యూటీ చైర్మెన్ నారాయణ్ సింగ్ కోరారు. ఆయన వెళ్లకపోయే సరికి సభను మంగళవారానికి వాయిదా వేశారు
పార్లమెంట్‌లో ఆందోళన
. మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహం ముందు ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘మణిపూర్ కోసం భారత్, సేవ్ మణిపూర్, సేవ్ మణిపూర్ ఉమెన్స్, మణిపూర్‌పై ప్రధాని ప్రకటన చేయాలని ఇండియా డిమాండ్ చేస్తుంది’ అని రాసి ఉన్న ప్లకార్డులు, బ్యానర్‌లు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ‘పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి సభ వెలుపల మాట్లాడటం సిగ్గుచేటు.
మణిపూర్ హింసపై పార్లమెంట్ లోపల సమగ్ర ప్రకటన చేయడం ఆయన బాధ్యత’ అని అన్నారు. మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని ప్రకటన చేయాలని రాజ్యసభ చైర్మెన్, లోక్‌సభ స్పీకర్‌ను అభ్యర్థిస్తున్నామ న్నారు. ఇదే సమయంలో ‘రూల్ 267 కింద చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం. కానీ మోడీ ప్రభుత్వం రూల్ 167 కింద అరగంట పాటు స్వల్పకాలిక చర్చను కోరుతోంది. మేము రూల్ 267 ప్రకారం ఓటింగ్ కూడా ఉండాలనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. మణిపూర్‌పై రాజ్యాంగ బాధ్యత, జవాబుదారీ తనం నుండి మోడీ ప్రభుత్వం, బీజేపీ పారిపోలేవని ఖర్గే అన్నారు.
”మేం చర్చకు సిద్ధంగా ఉన్నాం. 140 కోట్ల మంది ప్రజల నాయకుడు ప్రజా ప్రతినిధులు కూర్చునే పార్లమెంటులో ప్రకటన చేయాలి” అని డిమాండ్ చేశారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ ”ఇది మహిళలకు సంబంధించినది.
రాష్ట్రాల మధ్య పోటీ కాదు. ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటివి జరగడం తప్పు” అని అన్నారు. మణిపూర్ గురించి అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్నా మన దేశంలో చర్చ లేదని, ఇంతకంటే ఏం చెప్పను.. ఇది సిగ్గుచేటని ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ అన్నారు.
ఇండియా ఫర్ మణిపూర్ లోక్‌సభలో ప్రతిష్టంభన
లోక్‌సభ ప్రారంభం కాగానే మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ సభలో సమాధానం ఇవ్వాలని సభలో ప్రతిపక్ష నేత అధిర్‌రంజన్ చౌదరీ డిమాండ్ చేశారు. ఆయనకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తమ స్థానాల్లోంచి లేచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హౌరెత్తించారు. దీనిపై స్పీకర్ ఓంబిర్లా స్పందిస్తూ, దీనిపై ప్రభుత్వం సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, అయితే కేంద్రం తరపున ఎవరూ సమాధానమి వ్వాలో మీరు ఆదేశించలేరని అన్నారు. అయినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గకపోగా మోడీ సమాధానం చెప్పాలని మరింత తీవ్రస్వరంతో నినాదాలు చేశారు. ఇండియా ఫర్ మణిపూర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభ్యుల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టారు. అనంతరం కొద్దిసేపటికే సభ 12 గంటలకు వాయిదా పడింది. అనంతర ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే డిఎన్‌ఎ టెక్నాలజీ రెగ్యూలేషన్ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఉపసంహరించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి మనుసుఖ్ మాండవీయా నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు, నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు, కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం ప్యానెల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభ నిమిషంలోనే మధ్యాహ్నం 2్ణ30 గంటలకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో స్పీకర్ ఓం బిర్లా కేంద్ర హౌం మంత్రి అమిత్ షాకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చ సజావుగా జరిగేలా సహకరించాలని ప్రతిపక్షాలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ”మణిపూర్ అంశంపై చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతిపక్షాలు చర్చకు ఎందుకు సుముఖంగా లేరో అర్ధం కావడం లేదు. ముందు సభలో చర్చను జరగనీయండి. అత్యంత సున్నితమైన ఈ అంశంలో వాస్తవం ఏమిటనేది దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది” అని అమిత్‌షా అన్నారు. మణిపూర్‌లో హింసాకాండపై పార్లమెంటులో ప్రతిష్ఠంభనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలుసుకున్న అనంతరం అమిత్ షా ఈ ప్రకటన చేశారు.