– ప్రధాన మీడియాలోనూ కానరాని కథనాలు
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో కర్నాటకలో బీజేపీ భాగస్వామ్య పక్షమైన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు దేశ రాజకీయాలను కుదిపివేస్తున్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనుమడు. హసన్ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి బరిలో దిగారు. అక్కడ ఇప్పటికే పోలింగ్ జరిగింది. కాగా రేవణ్ణ రాసలీలల వ్యవహారాన్ని గత డిసెంబరులోనే బీజేపీ నాయకత్వం తన మిత్రపక్షం దృష్టికి తెచ్చింది. అయినప్పటికీ జేడీఎస్ పెద్దలు ప్రజ్వల్‌ను హసన్ నుండి, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణను మాండ్యా నుండి పోటీకి దింపారు. రాష్ట్రంలో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ వీరిద్దరికీ మద్దతు కూడా ఇచ్చారు.
ప్రజ్వల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ ఇప్పటి వరకూ ప్రధాని మోడీ కానీ, జాతీయ మహిళా కమిషన్ కానీ, కేంద్ర మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరోవైపు పలు జాతీయ ఛానల్స్‌లో ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల బాగోతం ప్రస్తావనే లేకపోవడం గమనార్హం.
న్యూస్18 ఇండియా ఛానల్‌లో యాంకర్ రుబికా లియాకత్ సోమవారం రాత్రి రెండు షోలు నిర్వహించారు. ఒక దానిలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై చర్చ జరిగింది. మరో దానిలో ఆ ఛానల్‌కు మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో మోడీపై రుబికా ప్రశంసలు కురిపించారు. మోడీని ‘బీజేపీ కీ జీత్ కా బ్రహ్మాస్త్ర’ అని అభివర్ణించారు. మోడీ మాట్లాడినప్పుడల్లా ఆయన ప్రత్యర్థులు దిగ్భ్రాంతితో మౌనం వహిస్తారని కొనియాడారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఆ రోజు చోటుచేసుకున్న టాప్ 50 వార్తా కథనాలలో రేవణ్ణ ఉదంతానికి చోటే ఇవ్వలేదు.
ఇక ఆజ్‌తక్ న్యూస్ ఛానల్ యాంకర్లు చిత్రా త్రిపాఠీ, అంజనా ఓం కశ్యప్ తాము రూపొందించిన కార్యక్రమాలలో రేవణ్ణ ఉదంతాన్ని ప్రస్తావించనే లేదు. శ్వేతా సింగ్ మాత్రం సెక్స్ కుంభకోణం వార్తకు కేవలం రెండు నిమిషాలు కేటాయించారు. టైమ్స్ నౌ ఛానల్‌లో యాంకర్ నావిక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై కార్యక్రమాన్ని అందించారు. అయితే ఇంగ్లీషు కార్యక్రమంలో మాత్రం ఆమె రేవణ్ణ సెక్స్ కుంభకోణంపై పదిహేను నిమిషాల పాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉదంతంపై కాంగ్రెస్, బీజేపీ నేతలను ప్రశ్నించారు.