– సీట్ల సర్దుబాటు కూడా జరిగింది
– బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు కుదిరింది
– ఎంఐఎం ఎటువైపో తేల్చుకోవాలి : రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు కుదిరిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ ఎంపీ ఒకరు చెప్పారని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య పొత్తు కుదిరిందని, సీట్ల సర్దుబాటు కూడా జరిగిందని వ్యాఖ్యానించారు. ఎంఐఎం ఎటువైపో తేల్చుకోవాలని కోరారు. బీఆర్‌ఎస్ ఏడు స్థానాల్లో, బీజేపీ తొమ్మిది స్థానాల్లో, ఎంఐఎం ఒక స్థానంలో పోటీ చేసేలా అవగాహన కుదిరిందని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, కార్యదర్శి మన్సూర్ అలీఖాన్, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్‌యాదవ్, మల్లు రవి, పొన్నం ప్రభాకర్, వార్‌రూమ్ ఇంచార్జి రోహన్‌గుప్తాతో కలిసి రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌కు మద్దతుపై ఎంఐఎం పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే…మోడీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధంల వారిది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని ఎద్దేవా చేశారు. అలాంటి వారికి అసదుద్దీన్ ఎలా మద్దతు ఇస్తారంటూ ప్రశ్నించారు. ఎంఐఎం ఎవరివైపు నిలబడుతుంది…బీజేపీతో దోస్తీ కడుతున్న బీఆర్‌ఎస్‌తోనా? బీజేపీ, బీఆర్‌ఎస్‌ను ఓడించాలంటున్న కాంగ్రెస్‌తోనా స్పష్టం చేయలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఫెవికాల్ బంధం గురించి నిజామాబాద్ సాక్షిగా మోడీ బయటపెట్టారని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముందే చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు పేర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కేసీఆర్‌ను గెలిపించేందుకే ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారని విమర్శించారు. పదేండ్లలో విభజన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోడీ అపహాస్యం చేశారన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేయొద్దని కేసీఆర్ అడిగిన విషయాన్ని కూడా మోడీ చెప్పాల్సిందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ఆదేశాలతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ దోపిడీలో బీజేపీకి వాటాలు వెళుతున్నాయి కాబట్టే మోడీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ, ఐటీ విచారణ చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్‌కు నీళ్లు అంటే.. కవిత కన్నీళ్లు గుర్తొస్తాయనీ, నిధులు అంటే దోపిడీ సొమ్ము, నియామకాలు అంటే కొడుకును సీఎం చేయడం గుర్తొస్తాయని విమర్శించారు. కేసీఆర్ కొల్లగొట్టిన సొమ్ములతోనే మోడీకి ఆయన దర్బారులో సన్మానం చేశారని విమర్శించారు. ఇదంతా కనిపించే ఒకవైపు మాత్రమేననీ, మరి ఎన్నికల కోసం పంపించిన కనిపించని వేల కోట్ల సంగతేంటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ దోపిడీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ సభలో మోడీ వ్యాఖ్యలతో కేసీఆర్ అధిష్టానం నరేంద్రమోడీ అని స్పష్టత వచ్చిందన్నారు. బండారం బయటపడిందనే కాంగ్రెస్‌పై బీజేపీ, బీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తున్నారన్నాయని చెప్పారు. వాళ్లిద్దరూ కాంగ్రెస్‌ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారని చెప్పారు. మోడీ చెప్పింది నిజమో, కాదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని మరల్చడానికే నాపై హరీశ్‌రావు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వాళ్ళు జైలుకెళ్లే టైం వచ్చిందనే తనపై ఆరోపణలు చేస్తున్నారని చురకలు అంటించారు. కొడంగల్‌లో పదేండ్లు నేను చేసిన అభివృద్ధి… ఐదేండ్లలో వాళ్లు చేసిన అభివృద్ధిపై చర్చ పెడదామని సవాలు విసిరారు. కోస్గి, కొడంగల్, మద్దూరులకు ఆస్పతులు తీసుకొస్తే వాటిని వాళ్లు ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. ‘నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బస్‌డిపో కోసం 5 ఎకరాలు కొని ఇచ్చామన్నారు. బిల్లా, రంగాలు ఇద్దరూ కొడంగల్ రావాలి. కొడంగల్ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని హరీశ్‌రావుకు రేవంత్ సవాలు విసిరారు.