దేశంలో ఒకే కులం… అదే పేదరికం : మోడీ

దేశంలో ఒకే కులం...
అదే పేదరికం : మోడీ– అయితే ఓబీసీనని ఎందుకు చెప్పుకుంటారు? : రాహుల్‌
– ఛత్తీస్‌గఢ్‌లో నేతల మధ్య మాటల తూటాలు
రారుపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దేశంలో ఉన్నది ఒకే కులమని, అదే పేదరికమని మోడీ అంటుంటే అయితే మీరు ఓబీసీనని ఎందుకు చెప్పుకుంటున్నారని రాహుల్‌ నిలదీశారు. దుర్గ్‌లో శనివారం జరిగిన బీజేపీ ర్యాలీని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ తనకు సంబంధించినంత వరకూ దేశంలో ఉన్నది ఒకటే కులమని, అదే పేదరికమని అన్నారు. పేదలకు మోడీ సేవకుడని, సోదరుడని, కుమారుడని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌పై ఆయన మండిపడుతూ ఓబీసీలను అవమానించడం ఆపేయాలని డిమండ్‌ చేశారు. ‘ఓబీసీలను కాంగ్రెస్‌ ఎందుకు అవమానిస్తోంది? మోడీ ఓబీసీ అయినంత మాత్రాన ఆ తరగతుల వారి తప్పేమిటి?’ అని ప్రశ్నించారు.
ఛత్తీస్‌గఢ్‌ పర్యటనలోనే ఉన్న రాహుల్‌ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. పేదలే దేశంలోని ఏకైక కులమన్న మోడీ వ్యాఖ్యను ఆయన ఎద్దేవా చేస్తూ దేశంలో ఏ కులమూ లేనప్పుడు, కేవలం పేదలే ఉన్నప్పుడు ఎందుకు ఓబీసీనని చెప్పుకుంటారని నిలదీశారు. జగ్‌దల్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ గిరిజనులను ఆదివాసీలు అనడానికి బదులు వనవాసీలు అనడం ద్వారా వారిని బీజేపీ అవమానిస్తోం దని విమర్శించారు. తమ పార్టీ దేశం నుండి ‘వనవాసి’ అనే పేరును తొలగిస్తుందని చెప్పారు. వనవాసి అనే పదం గిరిజనులకు అవమానకరమని అన్నారు. ఈ రెండు పదాల మధ్య చాలా తేడా ఉందని తెలిపారు. ఆదివాసీ అనేది విప్లవాత్మకమైన పదమని, ఆదివాసీలు అంటే దేశానికి తొలి, అసలైన యజమానులని అర్థమని వివరించారు. వారే ఈ దేశంలోని అడవులకు, జల సంపదకు యజమానులని అన్నారు. వనవాసీ అంటే అడవుల్లో జంతువుల మాదిరిగా నివసించేవారని అర్థమని చెప్పారు. ప్రస్తుత పాలకులు గిరిజనుల చేతుల్లో నుండి భూమిని, నీటిని లాక్కున్నారని మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడతగా 20 శాసనసభ స్థానాలకు ఈ నెల 7న పోలింగ్‌ జరుగుతుంది. మిగిలిన 70 స్థానాలకు 17న ఎన్నికలు నిర్వహిస్తారు.