– మానవతా సాయానికి హామీ
న్యూయార్క్ : పాలస్తీనా ప్రజలకు భారత్ మద్దతు, తోడ్పాటు పూర్తి స్థాయిలో వుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. న్యూయార్క్‌లో ఆదివారం సాయంత్రం పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో మోడీ భేటీ అయ్యారు. రాబోయే 12మాసాల కాలంలో ఆక్రమిత పాలస్తీనా భూభాగాల నుండి ఖాళీ చేయాలని ఇజ్రాయిల్‌ను కోరుతూ ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. ఆ తరువాత కొద్ది రోజులకు ఈ సమావేశం చోటు చేసుకుంది. ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు భారత్ మద్దతు గురించి మోడీ చర్చించారని సమావేశానంతరం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయిల్ పేరెత్తకుండా గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభం పట్ల, మోడీ ఆందోళన వ్యక్తం చేశారు.ఈ క్లిష్ట తరుణంలో పాలస్తీనియన్లకు తమ పూర్తి మద్దతు వుంటుందని, మానవతా సాయం కూడా అందజేస్తామని మోడీ హామీ ఇచ్చారని తెలిపింది. రెండు దేశాల ఏర్పాటు మాత్రమే ఈ సంక్షోభాన్ని పరిష్కరించగలదని మోడీ పేర్కొన్నారు.
నేపాల్, కువైట్ నేతలతో చర్చలు
నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలితో ఆదివారం మోడీ చర్చలు జరిపారు. జల విద్యుత్ సహకారం, ప్రజల మధ్య సంబంధాలు, అనుసంథానతను పెంచుకోవడం వంటి పలు అంశాలపై వారు మాట్లాడుకున్నారు. కువైట్ యువరాజు షేక్‌సబా ఖలీద్ అల్ అహ్మద్‌తో కూడా మోడీ భేటీ అయ్యారు. ఇంధన, ఆహార భద్రతా అవసరాలపై ఇరు దేశాలు పరస్పరం సహకరించు కోవడంపై ఉభయ పక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.