– కానీ.. నిరుద్యోగం గురించి ఒక్కసారి కూడా…
న్యూఢిల్లీ : ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ తన పేరును 758 సార్లు చెప్పుకున్నారని, కానీ నిరుద్యోగం గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గురువారం విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తుది దశకు గురువారం ప్రచారానికి చివరి రోజు సందర్భంగా విలేకరులతో ఖర్గే మాట్లాడారు. ‘గత 15 రోజుల్లో మోడీ తన ప్రసంగాల్లో కాంగ్రెస్ పేరును 232 సార్లు, తన పేరును సొంతంగా 758 సార్లు ప్రస్తావించారు. కానీ నిరుద్యోగం గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు’ అని ఖర్గే అన్నారు. జూన్ 4 తరువాత ఇండియా వేదిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ఖర్గే నమ్మకంగా తెలిపారు. ఇండియా వేదిక పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మనమందరం కలిసి ఈ దేశానికి ఇండియా వేదిక ప్రభుత్వాన్ని అందిస్తాం. అందర్ని కలుపుకొని ముందుకు సాగుతాం’ అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు దేశంలోని ప్రతీ పౌరుడు ఏకతాటిపైకి వచ్చినందుకు ఈ ఎన్నికలు చిరకాలం గుర్తుంటాయని అన్నారు. ‘మతం, విభజనతో ప్రజల్ని తప్పుదోవపట్టించేందుకు ప్రధాని, బీజేపీ నాయకులు లెక్కలేనన్ని ప్రయత్నాలు చేశారు. అయినా ప్రజలు సమస్యలపై దృష్టి పెట్టారు. మేం కూడా సమస్యలపై ఓట్లు అడిగాం.ఈ మోడీ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇస్తే ప్రజాస్వామ్యానికి ముగింపే అనే మా అభిప్రాయాన్ని ప్రజలు ఆమోదించారు’ ఖర్గే చెప్పారు. కులం, మతం ఆధారంగా ఓట్ల కోసం ప్రచారం చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ ప్రచారంలో మోడీ 421 సార్లు ‘మందిర్-మసీద్’ వంటి అంశాలను ప్రస్తావించారని ఖర్గే ఆరోపించారు. అలాగే గాంధీ సినిమా వచ్చిన తరువాతే మహాత్మాగాంధీకి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చిందని మోడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పడాన్ని ఖర్గే తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ కార్యదర్శి కెసి వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.