– బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చేట్టు లేవు
– కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మి మోసపోయిండ్రు..
– హంగ్ వస్తే మనమే కీలకం
– బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి.. : బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్
నవతెలగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
”ప్రధాని నరేంద్ర మోడీ గోదావరి జలాలను కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఇస్తాన్నంటుండు.. మన చేతకాని సీఎం రేవంత్‌రెడ్డి నోరు మూసుకొని ఉన్నడు.. బీజేపీకి దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో 200 సీట్లు కూడా వచ్చేట్టు లేవు.. దేశంలో హంగ్ వస్తే మనమిక్కడ గెలిచే 14 సీట్లతో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది” అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం హన్మకొండ చౌరస్తాలో జరిగిన బస్సుయాత్రలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. యువత ఆవేశంతో కాకుండా.. ఆలోచనతో ఓటు వేయాలని కోరారు. బీజేపీ అత్యంత ప్రమాదకరమైన పార్టీ అని, ఆ పార్టీకి ఉద్రేకం తప్పా వారి ఎజెండాలో ప్రజల కష్ట, సుఖాలు లేవని తెలిపారు. బేటీ బచావో, బేటీ పడావోతో ఎవరికన్న డబ్బులు పడ్డాయా అని ప్రశ్నించారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైతే దాన్ని మోడీ గుజరాత్‌కు తరలించారని తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయం కోసం పదేండ్లు కొట్లాడితే ఎన్నికలకు ముందు ఇచ్చిండని, పదేండ్లు పడతదా అని ఎద్దేవా చేశారు. ఇంతకుముందే కృష్ణానదిని కేంద్రం కేఆర్‌ఎంబీకి అప్పచెప్పిందన్నారు. బీజేపీని వ్యతిరేకించినందుకు తన బిడ్డను జైల్లో పెట్టారని, జైళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. గీ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు.
చేతకాని సీఎం..
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని కేసీఆర్ అన్నారు. రైతు బంధు డబ్బులు రాలేదని, పైగా కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నయని తెలిపారు. సాగు, తాగునీరు రాక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అయినా ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సీఎం చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నాడని అన్నారు. వరంగల్‌కు కాళేశ్వరం నీళ్లు రాలేదంటున్నారని, రామప్ప, పాకాలకు నీళ్లు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర, భూగోళం తెల్వదన్నారు. మన పాలనలో ఇలాంటి పరిస్థితి ఉండేనా.. ఇవన్నీ పోవాలంటే ఎవరు పోరాటం చేయాలే.. తానే చేయాలా.. అని, పోయిన ఎన్నికల్లో తనను కిందపడేసి మళ్లీ తానే కొట్లాడాలని చెబుతున్నరా.. అని ప్రజలనుద్దేశించి అన్నారు. హైదరాబాద్‌లో బిల్డర్లకు పర్మిషన్లు ఇవ్వడం లేదని, పర్మిషన్ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి లంచం ఇవ్వాలంటున్నారని ఆరోపించారు. తమ పాలనలో భూముల ధరలు పెరిగాయని, కాంగ్రెస్ పాలనలో భూముల ధరలు తగ్గాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. మహిళలకు రూ.2,500, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదన్నారు. తెలంగాణ ఉద్యమం ఇంకా ముగియలేదని, తెలంగాణ పునరుజ్జీవం పూర్తి చేయాల్సి ఉందన్నారు.
ఓరుగల్లు పోరుగల్లు అయితేనే తెలంగాణ వచ్చిందన్నారు. కాళోజీ, జయశంకర్‌ను తలుచుకుంటేనే ఉద్రేకమొస్తదని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో వరంగల్‌లో 24 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, హెల్త్ యూనివర్సిటీతో పాటు ఉమ్మడి వరంగల్‌లో 5 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో కాకతీయ మెగాటెక్స్‌టైల్స్ పార్క్‌ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. మైనార్టీ సంక్షేమానికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. మైనార్టీ గురుకులాలు పెట్టి మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనిందించామని చెప్పారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌కుమార్‌కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
‘కడియం’ శాశ్వత రాజకీయ సమాధి
కడియం శ్రీహరి చేసిన మోసానికి శాశ్వతంగా రాజకీయ సమాధి అవుతాడని కేసీఆర్ అన్నారు. ఇక్కడ ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వడమే కాకుండా ఉపముఖ్యమంత్రిని చేశామని, అయినా ద్రోహం చేశారని తెలిపారు. సుప్రీంకోర్టుకు పోయేయైన ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయిస్తామన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో మూడు నెలల్లో ఉప ఎన్నిక రాబోతున్నదని, ఈ ఉప ఎన్నికలో డాక్టర్ టి. రాజయ్య ఎమ్మెల్యే కాబోతున్నారని తెలిపారు. ద్రోహులకు ఇదే గుణపాఠమన్నారు. ఈ రోడ్డు షోలో వరంగల్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌కుమార్, శాసనమండలి వైస్ చైర్మెన్ డాక్టర్ బండా ప్రకాశ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూధనాచారి, బస్వరాజ్ సారయ్య, మాజీ ఛీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.