– జయంతి వేడుకల్లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జనసంఘ్ పూర్వ అధ్యక్షులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోడీ నిరంతరం పనిచేస్తున్నారని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి లక్ష్మణ్‌తోపాటు ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్, రాష్ట్ర కార్యదర్శులు జయశ్రీ, గొట్టాల ఉమారాణి, రాష్ట్ర అధికార ప్రతినిధి జి వెంకట్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యమంటూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన సిద్ధాంతానికి అనుగుణంగా మోడీ పనిచేస్తున్నారని చెప్పారు. సమాజంలో చిట్టచివరి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు, దేశ సంపద అందాలన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ కలలను సాకారం చేస్తున్నారని వివరించారు. కుల, మత, వర్గ భేదం లేకుండా అందరికీ నేరుగా ఫలాలు అందేలా, దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలను డిజిటల్ విధానంలో అందిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు అవినీతి కుంభకోణాలతో కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిందని ఆరోపించారు. కర్ణాటక సీఎం నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సింది పోయి చేసిన అవినీతిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో కూడా మంత్రులు, ప్రభుత్వంలోని కొంతమంది అవినీతికి పెద్ద ఎత్తున పాల్పడుతున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత వస్తున్నదని అన్నారు.