– ఆర్టీసీక్రాస్ రోడ్ నుంచి కాచిగూడ క్రాస్‌రోడ్ వరకు
– ప్రధాని పక్కన కిషన్‌రెడ్డి, లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ రోడ్‌షోను సోమవారం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి చిక్కడపల్లి, నారాయణగూడ, వైఎంసీఏ మీదుగా కాచిగూడ క్రాస్‌రోడ్డు వరకు రోడ్‌షో చేపట్టారు. ప్రధాన వాహనంలో ప్రధాని పక్కన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ ఉన్నారు. గ్రేటర్ పరిధిలో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ ర్యాలీలో జనసేన, ఎమ్మార్పీఎస్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్‌షో పొడుగుతా మోడీకి ఆ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. రోడ్‌షో ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాలను టచ్‌చేసేలా సాగింది. కాచిగూడ చౌరస్తాలోని సావర్కర్ విగ్రహాంపై ప్రధాని మోడీ పూలు చల్లి నివాళి అర్పించారు. గ్రేటర్ పరిధిలో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థులు, బీజేపీ రాష్ట్ర నాయకులను పలుకరించారు. అనంతరం ఇందిరాపార్కులో నిర్వహిస్తున్న కోటిదీపోత్సవ పరిసమాప్తి కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేతల ప్రదర్శనలు..ప్రజల ఇక్కట్లు..
ముషీరాబాద్ నియోజకవర్గంలో ఒకే రోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రోడ్‌షోలు, సభలు పెట్టడంతో ఆయా రూట్లలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచే హిందీమహా విద్యాలయ-ఇందిరాపార్కు రూట్, సికింద్రాబాద్ టూ కోఠి, సికింద్రాబాద్ టూ బషీర్‌బాగ్, బర్కత్‌పుర నుంచి నారాయణగూడ వెళ్లే రూట్లలో పోలీసలు ఆంక్షలు పెట్టడం, వాహనాలను వెళ్లనీయకపోవడంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి పహారాలో ఉన్న పోలీసులు వాహనదారుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చేసేదేమి లేక తమ డ్యూటీకి సహకరించాలని కోరారు.