– ఇజ్రాయిల్‌కు మద్ధతు సరికాదు
– పాలస్తీనాకే మా సంఘీభావం : సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక సామ్రాజ్యవాద అనుకూల విదేశాంగ విధానాన్ని అమలు చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాలస్తీనా సంఘీభావ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ భారతదేశం మొదట్నుంచి స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ పాలస్తీనాకు మద్ధతుగా నిలిచిందని గుర్తుచేశారు. ఆ దేశాన్ని అమెరికా సామ్రాజ్యవాదం, యూరోపియన్ ఫాసిస్టు ఒత్తిడితో కేంద్రంలోని బీజేపీ ఇజ్రాయిల్‌కు మద్ధతు ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీపీఐ మొదట్నుంచి పాలస్తీనీయులకు వారి మాతృభూమి దక్కాలని కోరుకుంటూ మద్ధతిస్తున్నదనీ, భవిష్యత్తులోనూ అదే సంఘీభావాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సూచించిన పరిష్కారానికి, అంతర్జాతీయ న్యాయ స్థానం చెబుతున్న విషయాలను ఇజ్రాయిల్ పాటించి తీరాల్సిందేనన్నారు. తూర్పు జెరుషలేం రాజధానిగా పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఉంటుందన్నారు. వంద రోజులకు పైగా ఇజ్రాయిల్ సాగిస్తున్న దమనకాండలో అనేక మంది పౌరులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు చంపబడుతూ, శరణార్థులుగా, బంధీలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాదులు ఇస్తున్న దన్నుతోనే ఇజ్రాయిల్ ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకున్నా… ప్రజల మద్ధతు మాత్రం పాలస్తీనాకే ఉంటుందనీ, యుద్ధంలో గెలిచి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేటశారు.
సీపీఐకు కృతజ్ఞతలు
పాలస్తీనాకు సంఘీభావం తెలిపిన సీపీఐకు భారత్ లో పాలస్తీనా రాయబారి అద్నాన్ మహ్మద్ జబేర్ అబుల్ హయెజా కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ 7న మొదలైన యుద్ధం పాలస్తీనాను చిన్నాభిన్నం చేస్తున్నదన్నారు. తీవ్రవాదుల అంతం పేరుతో ఇజ్రాయిల్ పాలస్తీనాలో మానవ హననానికి పాల్పడుతున్నదని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనాకు మద్ధతుగా నిరసనలు జరుగుతున్నాయనీ, ఆహార పదార్థాల సహకారం అందుతున్నదని చెప్పారు. పాలస్తీనీయులు సొంత భూమిలోనే ఉండేలా వారి హక్కులు సాధించుకునేందుకు అవసరమైన అన్ని రకాల సహకారాలను అందించాలని ఆయన అభ్యర్థించారు. ఈ సదస్సులో కార్యదర్శులు పల్లభ్ సేన్ గుప్తా, డాక్టర్ కె.నారాయణ, రామకృష్ణ పాండ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, అనీ రాజా, సీపీఐ రాష్ట్ర కార్యదర్సి కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.