మోడీ సర్కార్‌ ఉలికిపాటు

Modi Sarkar's Chisel– రాజధానిలో నిరసన గళం విప్పిన కర్నాటక, కేరళ
– దక్షిణాదిపై వివక్ష ఎందుకని మండిపాటు
– బకాయిలు ఎప్పుడు ఇస్తారని నిలదీత
– సంఘీభావం తెలిపిన ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా ‘నా పన్ను…నా హక్కు’ పేరుతో కర్నాటక ప్రభుత్వం దేశ రాజధానిలో నిర్వహించిన నిరసన కార్యక్రమం ప్రతిపక్షాల్లో ఉత్సాహాన్ని నింపింది. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఒక్కొక్కటిగా కేంద్రంపై బాహాటంగా గొంతు విప్పుతున్నాయి. మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మందిరం, మతతత్వం, నయా జాతీయతావాదం, దేశభక్తి వంటి భావోద్వేగపూరితమైన అంశాలనే పట్టుకొని వేళ్లాడుతోంది. అయితే గత కొద్ది రోజులుగా దేశంలో రాజకీయం ఆశ్చర్యకరమైన మలుపులు తీసుకుంటోంది. తమకు రావాల్సిన న్యాయమైన నిధుల కోసం కర్నాటకకు చెందిన కాంగ్రెస్‌ నేతలందరూ దేశ రాజధానికి కదలివచ్చి, మోడీ ప్రభుత్వాన్ని నిగ్గదీశారు. ఆ మరునాడే కేరళకు చెందిన వామపక్ష నేతలు కూడా దేశ రాజధానిలోనే మోడీని నిలదీశారు. దేశంలో తనకు ఎదురే లేదని భావిస్తున్న ప్రధాని మోడీకి ఈ పరిణామాలు ఇబ్బందిని కలిగించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్‌కు చెందిన బెంగళూరు రూరల్‌ ఎంపీ, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేష్‌ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోడీ ప్రభుత్వం దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేస్తోందని, దక్షిణాది రాష్ట్రాల నుండి వచ్చే నిధుల్ని దారి మళ్లించి ఉత్తరాదికి దోచిపెడుతోందని ఆరోపించారు. దక్షిణ భారతదేశంపై హిందీ ప్రాంతాన్ని రుద్దుతున్న నేపథ్యంలో ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన డిమాండ్‌ కూడా చేశారు. దీనిపై మోడీ ప్రభుత్వం ఉలికిపాటుకు గురైంది. ఆ పార్టీ ఎంపీలు, నేతలు, ట్రోల్స్‌ సైన్యం ఒక్కసారిగా సురేష్‌పై విరుచుకుపడ్డారు. ఆయన్ని వేర్పాటువాదిగా, దేశ వ్యతిరేకిగా చిత్రీకరించారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య సురేష్‌ చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. సురేష్‌ ప్రకటనను కాంగ్రెస్‌ తొలుత ఖండించినప్పటికీ ఆర్థిక వ్యవహారాల విషయంలో దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం నిస్పాక్షికంగా వ్యవహరించకపోవడం వాస్తవమేనని, అందుకే ఆయన అలా దక్షిణాదిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కోరి ఉండవచ్చునని వివరణ ఇచ్చింది.
కర్నాటక ‘ఛలో ఢిల్లీ’
కొద్ది రోజుల తర్వాత ఈ నెల 6న కాంగ్రెస్‌ ప్రభుత్వం జాతీయ వార్తా పత్రికల్లో ‘ఛలో ఢిల్లీ’ అంటూ పూర్తి పేజీ ప్రకటనలు ఇచ్చింది. కన్నడిగులపై, కర్నాటకపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వేధింపులకు నిరససగా రాష్ట్ర నేతలందరూ ఢిల్లీకి తరలి వెళ్లాలని అందులో పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ అడుగు ముందుకు వేసి ఈ నిరసనకు రాజకీయాలతో సంబంధం లేదని, కాబట్టి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రావాలని కోరారు. ఏదేమైనా కాంగ్రెస్‌ నిర్వహించిన నిరసన కార్యక్రమంతో మోడీ ప్రభుత్వం ఉలిక్కి పడింది. కాంగ్రెస్‌పై ఎదురు దాడికి దిగుతూ ఆత్మరక్షణ చేసుకునేందుకు ప్రయత్నించింది. ప్రధాని మోడీ సైతం పార్లమెంటులో కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
దక్షిణాది రాష్ట్రాల పట్ల మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరిని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌ గణాంకాలతో సహా ప్రజల ముందు ఉంచారు. 15వ ఆర్థిక సంఘం రూపొందించిన ఫార్ములా ప్రకారం గత ఐదు సంవత్సరాల్లో కర్నాటక రూ.1.87 లక్షల కోట్లు నష్టపోయిందని వారు వివరించారు. రాష్ట్రం వసూలు చేస్తున్న ప్రతి వంద రూపాయల పన్నులో కేవలం రూ.13 రూపాయలే తిరిగి రాష్ట్రానికి దక్కుతున్నాయని తెలిపారు. మహారాష్ట్ర తర్వాత దేశంలో రెండో అతి పెద్ద పన్ను చెల్లింపుదారు అయిన కర్నాటక అందుకు తగిన ప్రతిఫలం పొందలేకపోతోందని సిద్ధరామయ్య వాపోయారు.
కేరళ సైతం…
జంతర్‌మంతర్‌ వద్ద కర్నాటక నిరసన జరిపిన మరునాడే కేరళ కూడా అక్కడే అందోళన నిర్వహించింది. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నేతృత్వం వహించారు. జీఎస్టీ పరిహారం ఆగిపోవడం, పన్నుల్లో వాటా కుదించడం, రుణాలకు అనుమతి నిరాకరించడం వల్ల రాష్ట్రం రూ.57,000 కోట్లు నష్టపోయిందని ఆయన తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమానికి పలువురు ప్రతిపక్ష నేతలు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, సీపీఐ (ఎం) నేత సీతారాం ఏచూరి, జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా, సీపీఐ నేత డీ.రాజా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే రోజు డీఎంకే కూడా నిరసన తెలిపింది. కేరళ ఆందోళనకు డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సంఘీభావం తెలిపారు. ఆ కార్యక్రమానికి తన క్యాబినెట్‌ సహచరుడు పీటీ రాజన్‌ను పంపారు.
సుప్రీంను ఆశ్రయించిన కేరళ
ఇక్కడ మరో విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఉద్యోగుల జీతాలు, వరద బాధితులకు పునరావాసం, అభివృద్ధి పనుల కోసం వెంటనే నిధులు విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ గత నెల 12న కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. మోడీ ప్రభుత్వం తరఫున వాదించిన అటార్నీ జనరల్‌ దీనికి అభ్యంతరం తెలుపుతూ 33 రాష్ట్రాలకు లేని సమస్య ఒక్క రాష్ట్రానికే వచ్చిందని వ్యాఖ్యానించారు. కేరళ పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు మోడీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తెలంగాణ కూడా…
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కేంద్రంపై దాడి ప్రారంభించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలను పక్కన పెట్టి అందరూ చేతులు కలపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో అన్ని పక్షాలకూ సూచించారు.
రాష్ట్రాలు ఏం కోరుతున్నాయి?
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నది ఒక్కటే. పేద రాష్ట్రాలకు అధిక నిధులు ఇవ్వడాన్ని అవి వ్యతిరేకించడం లేదు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని, బీజేపీకి మిత్రపక్షంగా లేనందుకు తమను శిక్షించవద్దని అవి కోరుకుంటున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా (ఆదాయ వ్యత్యాసానికి 45%, జనాభాకు 15%, విస్తీర్ణానికి 15%, అడవులు-జీవావరణానికి 10%, జనాభా పనితీరుకు 12.5%, పన్ను ప్రయత్నాలకు 2.5%) బకాయిలు చెల్లిస్తే చాలునని అంటున్నాయి. జరిమానాలు విధించడం లేదా తమకు రావాల్సిన నిధులను ఇవ్వకపోవడం ద్వారా కేంద్రం తమ చేతులు కట్టేస్తోందని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.