మోడీ సెలెక్టెడ్‌ లంచ్‌ ప్రధాని క్రిస్మస్‌ లంచ్‌కు హాజరైన

Modi selected lunch Prime Minister attended the Christmas lunch– వారు ఎంపిక చేసిన వాళ్లే
–  వారితో విభేదిస్తూ 3,000 మంది క్రైస్తవుల సంతకాలు
న్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్‌ 25న ప్రధాని మోడీ నిర్వహించిన క్రిస్మస్‌ లంచ్‌కు హాజరైన క్రైస్తవ నాయకులతో విభేదిస్తూ దేశవ్యాప్తంగా 3,000 మంది క్రైస్తవులు సంతకాలు చేశారు. ఈ మేరకు ప్రకటనను విడుదల చేశారు. కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి భారత్‌లోని క్రైస్తవులు అనేక సార్లు దాడులు, దూషణలకు గురవుతున్నారని తెలిపారు. పలు బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలులో ఉన్న మత మార్పిడి నిరోధక చట్టాలు సమాజానికి వ్యతిరేకంగా, వివక్షాపూరిత సాధనంగా ఉపయోగించబడుతున్నాయని ప్రకటన పేర్కొన్నది. ఈ ప్రకటన మణిపూర్‌లో గతేడాది మే 3న చెలరేగిన జాతి హింసపై ప్రత్యేక దృష్టిని కేటాయించింది. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో చర్చిలపై జరిగిన దాడిని ఉటంకించింది. క్రిస్టియన్‌ సివిల్‌ సొసైటీ గ్రూపులు సేకరించిన డేటా ప్రకారం.. 2011 నుంచి 2022 మధ్య భారత్‌లో క్రైస్తవులపై దాడులు నాలుగు రెట్లు పెరిగాయి. అనేక సందర్భాల్లో పోలీసులు నేరస్థులపై కాకుండా హింసకు గురైన వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తారని యునైటెడ్‌ క్రిస్టియన్‌ ఫోరమ్‌కి చెందిన మైఖేల్‌ తెలిపారు. ”ప్రధానిగా ఎవరికైనా రిసెప్షన్‌ను నిర్వహించడం కచ్చితంగా ఆయన హక్కులో ఉన్నప్పటికీ.. ఆయన క్రైస్తవులపై ఒక్క దాడినీ ఖండించనప్పుడు సహజంగానే ఈ రిసెప్షన్‌ ఉద్దేశాన్ని ప్రశ్నిస్తారు. ఆయన ఏసుక్రీస్తును ప్రశంసిస్తూ, క్రైస్తవ సమాజం సేవల గురించి అనర్గళంగా మాట్లాడుతున్నప్పటికీ, ఈ రోజు దేశంలోని క్రైస్తవుల పరిస్థితిపై ఆయన పశ్చాత్తాపం చెందటం కానీ, సానుభూతిని పంచుకోవటం కానీ చేయలేదు” అని సదరు ప్రకటన పేర్కొన్నది. క్రిస్మస్‌ రిసెప్షన్‌కు ఆహ్వానించబడినవారు ఎంపిక చేసిన క్రైస్తవుల సమూహమని స్పష్టం చేసింది. ప్రధాని నుంచి ఆహ్వానం వచ్చినప్పుడు, మణిపూర్‌, ఇతర ప్రాంతాలలో క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని వారు ఆ ఆహ్వానాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించడానికి ఇక్కడ ఒక అవకాశం ఉన్నదని వివరించింది.