– నిరంకుశ, ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్న బీజేపీ
– పొగబాంబు ఘటనకు బాధ్యత వహించాలి
– దేశ ప్రజలకు కేంద్రం క్షమాపణ చెప్పాలి
– ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తేయాలి : వామపక్ష పార్టీల నేతల డిమాండ్
– హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలో బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం నిరంకుశంగా, ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నదని వామపక్ష పార్టీల నేతలు విమర్శించారు. హిట్లర్, ముస్సోలినీని మించిన నియంతలుగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పొగబాంబు ఘటనకు మోడీ ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలనీ, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 143 మంది ఎంపీలపై సస్సెన్షన్‌ను వెంటనే ఎత్తేయాలని కోరారు. 143 మంది ప్రతిపక్ష పార్లమెంటు సభ్యుల అప్రజాస్వామిక సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తేయాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలి, ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తేయాలి’అంటూ నినాదాలు చేశారు. ‘పార్లమెంటు భద్రతపై ప్రశ్నించిన ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడం సిగ్గు… సిగ్గు…, ఎంపీలను సస్పెండ్ చేసిన బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండించండి, ప్రతిపక్ష ఎంపీల అప్రజాస్వామిక సస్పెన్షన్‌లను ఖండించండి’అంటూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు అజాగ్రత్తగా ఉంటూ పాస్‌లను జారీ చేశారని చెప్పారు. దాన్ని ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని విమర్శించారు. బీజేపీ తీరు ఇలాగే కొనసాగితే ఎంపీల మీద దాడి జరుగుతుందనీ, కాల్చి చంపుతారని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లో బీజేపీ గెలు పుపై అనేక అనుమానాలున్నాయని అన్నారు. యంత్రాలు తారుమారైనట్టు తెలుస్తున్నదని చెప్పారు. పొగబాంబు ఎందుకు తెచ్చారో, అందుకు కారణాలేంటో తెలుసుకోవాలని సూచించారు. మోడీ, అమిత్‌షాలపై వ్యతిరేకతతో తెచ్చారా?, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా తెచ్చారా? అన్న వాస్తవాలను బయటికి తీయాలని డిమాండ్ చేశారు.
పొగబాంబు ఘటనపై ప్రధాని స్పందించాలి : నంద్యాల నర్సింహారెడ్డి
పార్లమెంటుకు అత్యంత భద్రత ఉండాలనీ, అందులోకి దుండగులు చొరబడి పొగబాంబు వేసిన ఘటనపై ప్రధాని, హోంమంత్రి స్పందించాలంటూ ప్రతిపక్ష ఎంపీలు కోరితే వారిని సస్పెండ్ చేయడం దుర్మార్గమని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి విమర్శించారు. అందరినీ బయటికి వెళ్లగొట్టి మూడు క్రిమినల్ చట్టాలను ఆమోదించారని అన్నారు. పార్లమెంటుకే భద్రత లేకుంటే దేశంలోని ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దేశాన్ని, సరిహద్దును, ప్రజలను కాపాడతామంటూ ఎలా భరోసా కల్పిస్తారని అడిగారు. ఈ ఘటనకు ప్రధాని, హోంమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం వరకు పార్లమెంటు సమావేశాలుంటే, గురువారంనాడే నిరవధిక వాయిదా వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. శుక్రవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలుండడం వల్లే పార్లమెంటు సమావేశాలను నిర్వహించలేదన్నారు. ప్రజాపంథా రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ నిరసన తెలపడమే నేరం అన్నట్టుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. దేశంలో ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదా? పాలకులు ప్రజాస్వామ్యవాదులేనా?అని అడిగారు. ప్రజలను మేల్కొల్పాలనీ, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లోకి తేవాలని కోరారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జెవి చలపతిరావు మాట్లాడుతూ పొగబాంబు ఘటనపై ప్రధాని, హోంమంత్రి సమాధానం చెప్పలేక ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని విమర్శించారు. మూడు రాష్ట్రాల్లో గెలవడం, 370 ఆర్టికల్ రద్దును సుప్రీం సమర్థించడంతో కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నదని అన్నారు.
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్ధన్ మాట్లాడుతూ ఆజాదీకా అమృత మహోత్సవాలు జరుపుతున్న వేళ 143 మంది ఎంపీలను బహిష్కరించిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఇది మోడీ సర్కారు ఫాసిస్టు చర్య అని విమర్శించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే స్పందించి సస్పెన్షన్లను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర నాయకులు తేజ మాట్లాడుతూ దేశంలో బీజేపీ ఫాసిస్టు విధానాలకు పాతర వేస్తే తప్ప ప్రజలకు విముక్తి లేదన్నారు. అధ్యక్షత వహించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు మాట్లాడుతూ పార్లమెంటును రక్షించలేని ప్రభుత్వం దేశాన్ని ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు. ఎంపీలను సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలంతా నడుం బిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తీగల సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, ఆర్ శ్రీరాంనాయక్, టి స్కైలాబ్‌బాబు, జె బాబురావు, ఆర్ వెంకట్రాములు, బుర్రి ప్రసాద్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, ఎన్ బాలమల్లేష్, విఎస్ బోస్, ప్రజాపంథా నాయకులు ఎస్‌ఎల్ పద్మ, ప్రదీప్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు సంధ్య, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.