మోడీని గద్దెదించాలి..దేశాన్ని కాపాడాలి

– ఢిల్లీ ట్రాక్టర్‌ పరేడ్‌లో ఏఐకేఎస్‌ నేత హన్నన్‌ మొల్లా, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతాంగాన్ని మరింత దెబ్బతీసిందని ఏఐకేఎస్‌ నేత హన్నన్‌ మొల్లా, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ విమర్శించారు. దేశ జీడీపీలో అగ్రభాగాన నిలుస్తున్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పజెప్పే చట్టాలకు వ్యతిరేకంగా 2020లో కిసాన్‌ ఉద్యమాన్ని రైతులు ప్రారంభించారని తెలిపారు. 2021లో భారత రాజ్యాంగం అమలైన రోజున వేలాది ట్రాక్టర్లలతో మార్చ్‌ టూ పార్లమెంట్‌ నిర్వహించారని ఈ సందర్భంగా నాడు మోడీ ప్రభుత్వం రైతులపై దమనకాండకు పాల్పడిందని, ఈ సందర్భంగా రైతాంగాన్ని కాపాడాలని ప్రతి ఏడాది జనవరి 26న రైతుల కార్మికుల, కర్షకుల పరేడ్‌ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ దేశ వ్యాప్తంగా జరుగుతున్న ట్రాక్టర్లు, వాహనాల పరేడ్‌ లో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన ర్యాలీలో ఏఐకేఎస్‌ అఖిల భారత ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్లా, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ ఫల్వాల్‌ సరిహద్దుల్లో పాల్గొన్నారు. 21 కిలో మీటర్ల మేర ఈ పరేడ్‌ జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లడుతూ దేశంలో రానున్న ఎన్నికల్లో ఆరెస్సెస్‌ ఎజెండాతో నడుస్తున్న బీజేపీని, మోడీ ఫాసిస్టు చర్యలను ఓడించాలని అన్నారు.
మోడీ విధానాలు దేశంలో వ్యవసాయం వినాశనకర విధానాలుగా ఉన్నాయని, వ్యవసాయ రంగం పూర్తిగా కార్పొరేట్‌ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కొవిడ్‌ సమయంలో కూడా 30 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాలు పండించారనీ, అలాంటి రైతాంగంపై మోడీ నిరంకుశత్వం వ్యవరిస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో దేశంలో మోడీని ఓడించాలని నేతలు పిలుపునిచ్చారు.