– లేదంటే బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయం
– ఆగస్టు రెండో వారంలో హైదరాబాద్‌లో మాదిగల విశ్వరూప మహాసభ : విలేకర్ల సమావేశంలో మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రధాని మోడీ ముచ్చటగా మూడోసారి ఇచ్చిన హామీనైనా నిలబెట్టుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఎంఆర్‌పీఎస్ కార్యా లయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. వర్గీకరణ విషయంలో బీజేపీ ఎందుకు జాప్యం చేస్తోందో చెప్పాలని నిలదీశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే..ఆ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటాన్ని సాగిస్తామని హెచ్చరించారు. ఆగస్టు రెండో వారంలో హైదరాబాద్‌లో మాదిగల విశ్వరూప మహాసభను నిర్వహించనున్నట్టు తెలిపారు. దక్షణాది రాష్ట్రాలతో పాటు, ఉత్తరాది రాష్ట్రాల్లో వర్గీకరణను సమర్థించే వారితో ఈ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కేంద్రంతో వర్గీకరణ విషయంలో సంప్రదింపులు చేయాల్సిన బాధ్యత బీజేపీ రాష్ట్ర నేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఈటల, రాజేందర్‌దేనని పేర్కొన్నారు. లోక్ సభ… రాజ్యసభ లో… కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే విధంగా కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో… ముఖ్యమంత్రులు అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, ఎంఎస్‌పీ జాతీయ నాయకులు రాగటి సత్యం మాదిగ, మంద కుమార్ మాదిగ, తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షులు సోమశేఖర్ మాదిగ, ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.